జగన్ కు లాస్ట్ కు అవే శాపాలు కానున్నాయా?

అపుడెపుడో ఒక రాజు గారు ఉండేవారట. ఆయన ఎదురుగా నిజం చెప్పడానికి జంకే సేవకులు ఆయన ఏం చేసిన కరెక్ట్ అంటూ వచ్చారట. ఆఖరుకు ఆ రాజు [more]

Update: 2020-02-28 05:00 GMT

అపుడెపుడో ఒక రాజు గారు ఉండేవారట. ఆయన ఎదురుగా నిజం చెప్పడానికి జంకే సేవకులు ఆయన ఏం చేసిన కరెక్ట్ అంటూ వచ్చారట. ఆఖరుకు ఆ రాజు దిగంబరుడై వంటి మీద ఏ వస్త్రం లేకుండా వీధులలో విహరిస్తున్నా అవి దేవతా వస్త్రాలు అని జనాలకు చెప్పి తామూ ఆ భ్రమ‌లోనే గడిపారట. ఈ కధ ఇపుడు అచ్చంగా ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయాలకు సరిపోతుంది. అవి ముఖ్యమంత్రి జగన్ మానసపుత్రికలు. వాటి గురించి చెడుగా చెప్పే ధైర్యం ప్రభుత్వంలో ఎవరికీ లేదు. దాంతో వాటి కధ కూడా దేవతా వస్త్రాల మాదిరిగానే సాగుతోంది. ఉన్న పళ్ళు ఊడగొట్టుకున్నట్లుగా జనాల పరిస్థితి సచివాలయాలతో తయారైందని అంటున్నారు. అటు పౌర సేవలు, ఇటు రెవిన్యూ సేవలు అన్నీ కలిపి వందల్లో కీలకమైన బాధ్యతలు సచివాలయాలకు ఒక్కసారిగా అప్పగించారు. అక్కడ కనీస అవగాహన లేని సిబ్బంది చేతుల్లో పడి జనం బతుకూ, భవిష్యత్తు అంధకారం అవుతున్నా పట్టించుకునే నాధుడు లేకపోవడమే అసలైన చిత్రం.

రెంటికీ చెడి…..

సచివాలయాల వ్యవస్థ రాకముందు పౌర సేవలు మునిసిపాలిటీలో, రెవిన్యూ ఆఫీసుల్లో దక్కేవి. అక్కడ పైసలు పడేసినా పనిజరిగేది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి, ప్రజల వద్దకు పాలన పేరిట తెచ్చిన సచివాలయాన వ్యవస్థ బాలారిష్టాలు దాటడంలేదు. దాంతో అక్కడ వారికి ఏ విధంగామైన ట్రైనింగు లేదు, వారికి ఉద్యోగం మీద ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ బాధ్యతల మీద అసలు గౌరవం లేదు, దాంతో సామాన్య జనం సచివాలయాలకు వెళ్ళి పని కాక తిరిగి వస్తున్నారు. గతమెంతో ఘనం అనుకుంటూ నిట్టూరుస్తున్న స్థితి ఎక్కడ చూసినా కనిపిస్తోంది.

అన్నీ రద్దు……

చేతికి ఇచ్చిన ఒక్క ట్యాబ్ తో రేషన్ కార్డులను, పించన్లను రద్దు చేసి పారేస్తున్న సచివాలయ కార్యదర్శులు ఇంతటి పెద్ద పని చేసే ముందు కనీస బాధ్యతగా ఇంటింటికీ వెళ్ళి అక్కడ ప్రస్తుత పరిస్థితిని మదింపు చేయడంలేదు. జగన్ సర్కార్ పై నుంచి ఇస్తున్న ఆదేశాలను ఎక్కడా సచివాలయ సిబ్బంది పాటించడంలేదు. నాలుగేళ్ళ క్రితం చంద్రబాబు జమానాలో జరిగిన ప్రజాసాధికార సర్వేను ఆసరాగా చేసుకుని ప్రభుత్వం ఇచ్చిన తాజా గైడ్ లైన్స్ మేరకు ఒక్క దెబ్బకు అందరినీ అనర్హులను చేసి పారేస్తున్నారు. దీని వల్ల ఎందరో పేదలు, అర్హులు రేషన్ కార్డులు రద్దు అయి, పించన్లు రాక నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కసారి రద్దు చేశాక వాటిని పునరుద్ధరించడం బ్రహ్మ ప్రళయమే అవుతోంది. ఇలా రద్దు చేస్తున్న సచివాలయ సిబ్బంది వెరిఫికేషన్ కి వెళ్ళిన వారికి మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. తమకు పై నుంచి ఏ ఆదేశాలూ రాలేదని చెప్పి తప్పించుకుంటున్నారు.

తీవ్ర వ్యతిరేకత…..

సచివాలయాలే ఇపుడు జగన్ సర్కార్ కి శాపాలుగా మారుతున్నాయి. జన్మభూమి కమిటీలు టీడీపీ సర్కారు ఉసురుతీస్తే సచివాలయాలు జగన్ పాలనకు ఏడాది నిండకుండానే నూరేళ్ళూ నిండాయనిపించేశాయి. పౌర సేవలు ఇంటికి అందడం మాట పక్కన పెడితే సచివాలయానికి వెళ్ళినా అక్కడ ఎవరికీ జవాబు లభించని పరిస్థితి. మరో వైపు మునిసిపాలిటీలు, రెవిన్యూ కార్యాలయాలకు వెళ్ళినా తిప్పి ఇక్కడికే పంపిస్తున్న వైనంతో తమ సమస్యలు పరిష్కారం ఎక్కడని అర్హులైన లబ్దిదారులు ఆక్రోసిస్తున్నారు. ఇకపై అధికారులు సైతం అన్నీ తెలిసినా చూసీ చూడనట్లుగా పోతున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన సచివాలయ సిబ్బంది బాద్యతరాహిత్యంగా వ్యవహరించడంతో పెద్ద ఎత్తున నష్టం పేదలకే జరుగుతోంది. మొత్తానికి చూసుకుంటే ఎటువంటి శిక్షణ లేని వ్యక్తి చేతికి కత్తి ఇచ్చి రోగికి పెద్దాపరేషన్ చేయమన్నట్లుగా ఉందని అంటున్నారు. అటు పేషంట్ బతకడు, ఇటు డాక్టర్ మిగలడు అన్నట్లుగా జగన్ మానసపుత్రికలు సచివాలయాల‌ కధ ఉందని అంటున్నారు.

Tags:    

Similar News