తెగనమ్మడం అంటే ఇదేగా ?

విశాఖ ఉక్కు కర్మాగారం అంటే తూర్పు తీరానికి పెట్టని కోట అని అంతా అనుకున్నారు. అది ఉక్కు కాదు తుక్కు కింద తెగనమ్ముకోవచ్చు అని నేటి నేతలు [more]

Update: 2021-03-23 11:00 GMT

విశాఖ ఉక్కు కర్మాగారం అంటే తూర్పు తీరానికి పెట్టని కోట అని అంతా అనుకున్నారు. అది ఉక్కు కాదు తుక్కు కింద తెగనమ్ముకోవచ్చు అని నేటి నేతలు రుజువు చేస్తున్నారు. విశాఖ ఉక్కుని ప్రజల సెంటిమెంట్ గా చూడడంలేదు. త్యాగాల పునాదులపైన ఏర్పడిన ప్లాంట్ గా కూడా అసలు భావించడంలేదు. ఇవన్నీ కాదనుకున్నా దేశంలో అత్యంత ఖరీదైన కర్మాగారంగా అయినా చూస్తున్నారా అంటే అది కూడా లేదు అని తేలిపోతోంది. విశాఖ ఉక్కు విలువ మరీ అంత తక్కువా అన్నది కూడా ఇపుడు ఉద్యమకారుల మరో ఆవేదనగా ఉంది.

కారు చవకగానా…?

విశాఖ ఉక్కు కర్మాగారం దాదాపుగా పాతిక వేల ఎకరాల్లో ఉంది. ఇందులో 18 వేల ఎకరాలను వినియోగించినా కూడా ఇంకా ఏడు వేల ఎకరాల భూమి భవిష్యత్తు అవసరాల కొరకు మిగిలి ఉంది. మొత్తానికి మొత్తం ఎకరాలను కనుక ప్రస్తుత‌ మార్కెట్ విలువకు లెక్క కడితే రెండున్నర లక్షల కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. అతే కాదు అక్కడ ఉన్న ఇతర స్థిర చరాస్తుల విలువ అంచనా కట్టినా కూడా మూడు లక్షల కోట్లకు తక్కువ లేదు అంటారు. అలాంటిది కేంద్రం కట్టిన విలువ కేవలం 32 వేల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే అసలు విలువలలో కేవలం పదవ వంతు అన్న మాట. ఇంతకంటే కారు చౌక బేరం ఉంటుందా అన్నదే అందరి ప్రశ్న.

రియల్ వ్యాపారమే…?

ఉక్కు కర్మాగారాన్ని కొనుగోలు చేసే కామందులు ఆసాములు ఎవరైనా చేసేది మాత్రం అచ్చమైన రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని అంటున్నారు. అయిదు దశాబ్దాల క్రితం విశాఖ భూముల ధరలు నామమత్రంగా ఉన్నాయి. పైగా విశాఖకు స్టీల్ ప్లాంట్ అపుడు కడు దూరం. కానీ నేడు మెగా సిటీగా విశాఖ ఉంది. దాంతో నడి మధ్యకు స్టీల్ ప్లాంట్ వచ్చేసింది. ఇక ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా విశాఖ అభివృద్ధి చెందుతోంది. పాలనా రాజధాని కూడా కాబోతోంది. దాంతో భూముల విలువ అంతకంతకు పెరిగేదే కానీ తరిగేది కాదు. ఇక కారు చవకగా కొన్న వారు ఎవరైనా జాక్ పాట్ కొట్టేసినట్లే అని అర్ధిక నిపుణులు కూడా అంటున్నారు. వారు ఉక్కు పరిశ్రమను నడుపుతారో లేదో తెలియదు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా లక్షల కోట్లు చేతుల్లోకి వచ్చిపడతాయి అంటున్నారు.

ఆ పని చేయగలదా…?

విశాఖ ఉక్కుని తుక్కు మాదిరిగా చేసి దారుణమైన రేటుని పెద్దలు అస్మదీయులకే అప్పచెబుతారు అంటున్నారు. మరి ఇందులో లాభనష్టాలు లోపాయికారీ ఒప్పందాలు అన్నీ కూడా పరమాత్ముడికే ఎరుక అని కూడా చెప్పుకోవాలి. అయితే ఉక్కు కర్మాగారం స్థాపన నాడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇచ్చిన మాట ఏంటి అంటే భూములు ఇచ్చి నిర్వాసితులుగా మారిన వారికి ప్రతీ కుటుంబంలో ఒకరికి స్టీల్ ప్లాంట్ లో జాబ్ ఇస్తామని. కానీ మొత్తం 20 వేల మందిలో కేవలం ఎనిమిది వేల మందికే ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన వారి సంగ‌తేంటి, ఇపుడు ప్రైవేటీకరణతో మొత్తం ఉద్యోగాలు పోతున్న వారి సంగతేంటి అన్నది కూడా ఒక చర్చ. అయితే ఎటూ తెగనమ్మాలనుకుంటే ఆ భూముల విలువ ప్రకారం వాటాదారులు ఎవరున్నారో వారందరినీ నష్టపరిహారం చెల్లించాల్సిందే అన్న డిమాండ్ కూడా వస్తోంది. మరి దీనికైనా పాలకులు ఒప్పుకుంటారా.

Tags:    

Similar News