విశాఖ తూర్పులో వైసీపీ మార్పులు

విశాఖ అర్బన్ జిల్లా వైసీపీకి ఓ పట్టాన చిక్కడం లేదు. 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా మొత్తానికి మొత్తం టీడీపీకే జై కొట్టిన ప్రాంతమిది. [more]

Update: 2019-02-11 11:00 GMT

విశాఖ అర్బన్ జిల్లా వైసీపీకి ఓ పట్టాన చిక్కడం లేదు. 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా మొత్తానికి మొత్తం టీడీపీకే జై కొట్టిన ప్రాంతమిది. దానికి తోడు జగన్ మాత్రుమూర్తి విజయమ్మని సైతం ఓడించిన విశాఖగా వినుతికెక్కింది. ఈ మైనస్ పాయింట్ తోనే మరో మారు ఆ పార్టీ 2019 ఎన్నికలను ఎదుర్కుంటోంది. వైసీపీకి విశాఖ అర్బన్ జిల్లాలో ఇప్పటికీ సరైన అభ్యర్ధులు లేరు. జనంతో సంబంధాలు నెరిపే వారు అసలే లేరు. జగన్ పేరు చెప్పుకుని గెలిచేద్దామనుకుంటున్న వారే అందరూ. దాంతో ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా కూడా విశాఖలో వైసీపీకి ఇక్కట్లు తప్పడంలేదు. దీంతో కీలకమైన ఎన్నికల వేళ మరో మారు మార్పు చేర్పులకు వైసీపీ రెడీ అవుతోందని అంటున్నారు.

తూర్పును కొట్టాలంటే…:

విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీకి పక్కా సీటు ఏదంటే తూర్పు నియోజకవర్గాన్నే ముందుగా చెబుతారు. రెండు మార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఉవ్విళ్ళూరుతున్నారు. ఆయనకు పోటీగా వైసీపీ తరఫున వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనకు బలమైన సామాజిక వర్గం అండ ఉన్నప్పటికీ సరైన వ్యూహాలు లేకపోవడం వల్ల బొక్క బోర్లా పడుతున్నారు. దాంతో ఈసారి ఎలాగైనా తూర్పున‌ జెండా పాతాలని వైసీపీ కొత్త ప్రయోగం చేయాలనుకుంటోందట. ఇక్కడ వంశీకి బదులుగా విశాఖ ఎంపీ క్యాడిడేట్ గా ప్రచారంలో ఉన్న ఎంవీవీ సత్యనారాయణకు టికెట్ ఇవ్వాలని భావిస్తోందని సమాచారం.

వర్కౌట్ అవుతుందా…:

అదే జరిగితే తూర్పులో గెలుస్తామని వైసీపీ వ్యూహకర్తలు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ కూడా వెలగపూడి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం తో పాటు, అంగబలం, అర్ధబలం నిండుగా ఉన్నవారు కావడం ప్లస్ పాయింట్ గా భావిస్తున్నారు. పైగా ఆయన పదునైన వ్యూహాలు రచించి కమ్మ సామజిక వర్గం మద్దతు పొందగలరని కూడా వూహిస్తున్నారు. తూర్పులో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం బాగా ఉంది. ఈ కారణంగానే వెలగపూడి రెండు మార్లు గెలిచారని అంటున్నారు. దాంతో ట్రంప్ కార్డ్ గా ఎంవీవీని ప్రయోగిస్తే లాభసాటిగా ఉంటుందని కూడా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ పోటీకి మొదట ఎంవీవీ ఒప్పుకోవాలి. అలాగే తనకు టికెట్ దక్కకపోతే వంశీ తిరుగుబాటు చేయకుండా ఉండాలి. మరి ఈ ఇద్దరికీ నచ్చచెప్పి బరిలోకి ఎంవీవీని దించితే మాత్రం తూర్పులో పోటీ గొప్ప మార్పుని ఈసారి తెస్తుందని అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News