నేను తేడానే అంటున్నాడే

బీజేపీ అంటే తేడా పార్టీ అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. అటువంటి బీజేపీలో తేడా గల నాయకుడుగా రాజుగారు కనిపిస్తారు. ఆయన కట్టేది కాషాయం. కానీ [more]

Update: 2020-01-03 14:30 GMT

బీజేపీ అంటే తేడా పార్టీ అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. అటువంటి బీజేపీలో తేడా గల నాయకుడుగా రాజుగారు కనిపిస్తారు. ఆయన కట్టేది కాషాయం. కానీ మాట్లాడేది మాత్రం తనదైన రాజకీయం. ఇది పార్టీ లైన్ కి భిన్నంగా ఉన్నా, పెద్దలకు మింగుడుపడకపోయినా తాను మాత్రం ఇలాగే ఉంటానని రాజు గారు అంటున్నారు. తనకు ఉన్న అభిప్రాయాలను పంచుకుంటానని, తప్పేముందని అంటున్నారు. గత అయిదేళ్ళూ బీజేపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించిన విష్ణు కుమార్ రాజు చాలా కాలంగా జగన్ కి జై కొడుతూ వస్తున్నారు. ఆయన ఇపుడు మరో సారి గొంతు సవరించుకున్నారు. రాజధాని విషయంలో జగన్ నిర్ణయం భేష్ అంటున్నారు.

విశాఖే ముద్దు….

విశాఖలో రాజధాని కడితే అధ్బుతమైన క్యాపిటల్ సిటీ తయారవుతుందని విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల వల్ల భవిష్యత్తులో ఎక్కడా గొడవలు రావని, అన్ని ప్రాంతాలు కలసిమెలసి ఉంటాయని కూడా అంటున్నారు. కేవలం వేయి కోట్లు ఖర్చు పెడితే విశాఖ మంచి రాజధాని తయారవుతుందని చెబుతున్న ఆయన రివర్స్ టెండరింగులో ఆదా అయిన నిధులను ఇందుకోసం ఉపయోగించుకోవచ్చునని సూచనలు చేస్తున్నారు.

ఆ మౌనం వెనక…?

నిజానికి జగన్ విశాఖ టూర్లో మౌనంగా ఉన్నారని పార్టీ నాయకులు ఆందోళన పడుతున్నారు. జగన్ ఎందుకు మాట్లాడలేదు అన్నది వారు చర్చించుకుంటున్నారు. మరి వారికి ఏ విధంగా బోధపడిందో తెలియదు కానీ విష్ణుకుమార్ రాజు మాత్రం ఆ మౌనానికి అర్ధాలు, పరమార్ధాలు కనిపెట్టేశారు. జగన్ మౌనం వెనక ప్రాంతాల మధ్య చిచ్చు రెచ్చగొట్టవద్దు అన్న సందేశం ఉందని అంటున్నారు. హై పవర్ కమిటీ నివేదిక తరువాతనే జగన్ మౌనం వీడుతారని కూడా రాజు గారు ముందే చెప్పేస్తున్నారు. అంటే వైసీపీ నేతల కంటే జగన్ ని ఆయన బాగానే అర్ధం చేసుకున్నారన్నమాట.

కన్నాకు యాంటీగా…..

ఇక బీజేపీ విష్ణుకుమార్ రాజు కన్నా లక్ష్మీనారాయణ శైలిని ఇండైరెక్ట్ గా తప్పుపడుతున్నట్లున్నారు. అది ఆంగ్ల మాధ్యం అయినా, రాజ‌ధాని అయినా కూడా కన్నా ఒకటి చెబితే రాజు గారు మరోటి అంటున్నారు. తాను సొంతంగా అభిప్రాయం చెప్పుకునే స్వేచ్చ పార్టీలో ఉందని ఆయన అంటున్నారు. ఓ విధంగా కన్నా ప్రెసిడెంట్ అయ్యాక ఉత్తరాంధ్ర బీజేపీ నేతలకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వంటి పరిణామాలు కూడా రాజు గారి చేత ఈ విధంగా మాట్లాడిస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా రాజు గారి ప్రతీ మాటా వైసీపీకి వరంగా మారుతూంటే కాషాయం పార్టీ పెద్దలకు కషాయం తాగిస్తోంది.

Tags:    

Similar News