భారం అంతా ఈయనపైనేనట

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించేందుకు బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ సీటు గెలచి అసెంబ్లీ తమ స్థానాల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా [more]

Update: 2021-08-05 09:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించేందుకు బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ సీటు గెలచి అసెంబ్లీ తమ స్థానాల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నిక ట్రయల్ రన్ లా బీజేపీ భావిస్తుంది. హుజూరాబాద్ లో పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఉండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నిక కోసం మండల స్థాయిలో ఇన్ ఛార్జులను నియమించినా గెలుపు బాధ్యతను మాజీ ఎంపీ వివేక్ పైనే పార్టీ ఉంచినట్లు అర్థమవుతుంది.

కీలక నేతగా మారి…

మాజీ ఎంపీ వివేక్ బీజేపీ లో కీలక నేతగా మారారు. నేరుగా హైకమాండ్ తో అతితక్కువ కాలంలోనే సత్సంబంధాలు మెరుగుపర్చుకోగలిగారు. సామాజికపరంగా, ఆర్థికంగా బలమైన నేత కావడంతో వివేక్ కు స్వల్ప కాలంలోనే పార్టీలో గ్రిప్ దొరికింది. పార్టీ కార్యక్రమాల ఖర్చు కూడా ఆయనే భరిస్తుండటంతో ఎక్కడైనా ముందువరసలో సీటు వివేక్ కు దక్కుతుందన్న కామెంట్స్ పార్టీలోనే వినపడుతున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నికలోనూ…

దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యతను కూడా వివేక్ కే పార్టీ అధిష్టానం అప్పగించింది. ఆయన తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ చెప్పిన వ్యూహాలను అమలు చేస్తూ గెలిపించగలిగారు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుతో వివేక్ పై పార్టీ నాయకత్వానికి మరింత నమ్మకం పెరిగింది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక పర్యవేక్షణ బాధ్యతను కూడా వివేక్ కు అప్పగించినట్లు చెబుతున్నారు.

అన్ని రకాలుగా…?

హుజూరాబాద్ లో దళిత వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో పాటు అధికారపార్టీ ఊహించని విధంగా ఖర్చు చేస్తుంది. దీంతో వివేక్ కు ఈటల రాజేందర్ గెలుపు బాధ్యతను అప్పగించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికపరంగా ఈటలను ఆదుకోవాలని వివేక్ ను పార్టీ ఆదేశించినట్లు తెలిసింది. వివేక్ కూడా హుజూరాబాద్ లోనే మకాం వేసి పార్టీ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News