విశాఖ బాధ్యత నాది

సరిగ్గా ఏడాది క్రితం ఆయన వైసీపీలో చేరారు. జగన్ తూర్పు గోదావరి జిల్లా పాదయాత్ర సందర్భంగా ఆయన్ని కలసి అక్కడే పార్టీ జెండా కప్పుకున్న ఎంవీవీ సత్యనారాయణ [more]

Update: 2019-06-18 12:30 GMT

సరిగ్గా ఏడాది క్రితం ఆయన వైసీపీలో చేరారు. జగన్ తూర్పు గోదావరి జిల్లా పాదయాత్ర సందర్భంగా ఆయన్ని కలసి అక్కడే పార్టీ జెండా కప్పుకున్న ఎంవీవీ సత్యనారాయణ ఇదే జూన్ నెల వచ్చేసరికి విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన సీటుకు ఎంపీ అయిపోయారు. గిర్రున పన్నెండు నెలలు తిరిగేసరికి ఎంవీవీ జాతకం కూడా అలా తిరగబడిందని చెప్పాలి. అందరిలాగానే వ్యాపారం కోసం విశాఖ వచ్చి సెటిల్ అయిన ఎంవీవీ రాజకీయాల వైపు మొదట్లో చూపు పెట్టలేదు. కానీ ఆయనకు జరిగిన కొన్ని అవమాన సంఘటనలే ప్రేరేపించాయని అంటున్నారు.

అకారణంగా జైల్లో పెట్టారని :

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎంవీవీని టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు కొంతమంది నాయకులు కక్ష కట్టి మరీ జైల్లో పెట్టారు. దాంతో మనస్తాపం చెందిన ఎంవీవీ తాను రాజకీయాల్లోకి రావాలని జైలులోనే నిర్ణయం తీసుకున్నారట. ఆ విధంగా ఆయన వైసీపీలో చేరారు. అదే సమయంలో వైసీపీకి కూడా సరైన లీడర్ సిటీకి కావాల్సిరావడంతో ఎంవీవీని చేర్చేసుకున్నారు. అలా ఫ్యాన్ నీడన చేరిన ఈ స్థిరాస్థి వ్యాపారికి రాజకీయ సిరి పట్టేసింది. ముక్కోణపు పోటీలో గెలిచిన ఆయన లక్కీ ఎంపీ అనిపించేసుకున్నారు. విశాఖ అభివ్రుధ్ధి కోసం పనిచేస్తానని చెబుతున్నారు.

బయట నుంచే చూసా :

పార్లమెంట్ ని బయట నుంచే చూశానని, అటువంటిది తాను లోపలికి వెళ్ళడం, ఎంపీగా ప్రమాణం చేయడం అంటే అదో కల అంటున్నారు. మొత్తం దేశాన్ని పాలించే విధంగా చట్టాలను చేసే అత్యున్నత సభలో తాను ఒక సభ్యుడు కావడం అంటే నిజంగా అద్రుష్టమనే ఆయన అంటున్నారు. ఈ విజయం జగన్ కే అంకితమని చెబుతున్న ఎంవీవీ విశాఖ సిటీలో ఎమ్మెల్యేలు తమ పార్టీకి లేరని ,అందువల్ల తానే అన్నీ అయి సిటీని అభివ్రుధ్ధి చేస్తానని అంటున్నారు. విశాఖను సినీ రాజధానిగా, టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతానని అంటున్నారు. మొత్తానికి జగన్ అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని ఆయన చెబుతున్నారు. సినిమాల్లోకి వెళ్ళి చేయి కాల్చుకున్న ఈ నిర్మాత రాజకీయాల్లో మాత్రం మొదటి ప్రయత్నంలోనే హిట్ కావడమె కాదు హీరో కూడా అయిపోయారు.

Tags:    

Similar News