సంక్షేమం కలసి రావడం లేదా?

తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవి అధికార పార్టీకి కలసిరాలేదు. ఓటర్లు సంక్షేమ పథకాలను పట్టించుకోలేదు. వ్యక్తిగత ప్రయోజనం పొందుతున్నా [more]

Update: 2020-12-25 11:00 GMT

తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవి అధికార పార్టీకి కలసిరాలేదు. ఓటర్లు సంక్షేమ పథకాలను పట్టించుకోలేదు. వ్యక్తిగత ప్రయోజనం పొందుతున్నా టీఆర్ఎస్ పట్ల విముఖత చూపడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. లోపం ఎక్కడుందన్న దానిపై పార్టీ సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రజలు కోరుకుంటుందేమిటి? ప్రభుత్వం చేస్తున్నదేమిటి? అన్న దానిపై లోతుగా చర్చించాలని నిర్ణయించారు.

దానిపైనే ఆశ పెట్టుకున్నా…..

నిజానికి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బట్టి చూస్తే ప్రజలు తమవైపే ఉండాలని టీఆర్ఎస్ నేతలు అంచనా వేశారు. కానీ దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అది కరెక్ట్ కాదని తేలింది. కల్యాణ లక్ష్మి, రైతు బంధు, పింఛన్లు, పక్కా ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనిపైనే టీఆర్ఎస్ నేతలు మొన్నటి వరకూ ఆశలు పెట్టుకున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయంతో సంక్షేమ పథకాలే తమను గట్టెక్కించాయని నేతలు గట్టిగా విశ్వసించారు.

రివర్స్ ఫలితం రావడంతో….

కాని దుబ్బాక ఉప ఎన్నికలో మాత్రం రివర్స్ ఫలితం రావడంతో మళ్లీ గులాబీ పార్టీ నేతలు లెక్కలు వేయడం ప్రారంభించారు. దుబ్బాక నియోజకవర్గంలో వివిధ పథకాల కింద లక్షా ముప్ఫయి వేల మంది వరకూ ఉన్నారు. ఈ లెక్కలు వేసుకుని దుబ్బాకలో తమ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ నేతలు భావించారు. అయితే ప్రభుత్వ పథకాలను పొందుతున్న లబ్దిదారుల్లో సగం మంది కూడా టీఆర్ఎస్ కు ఓటు వేయలేదు.

ప్రజల్లోనే ఉండాలని…

దీంతో సంక్షేమ పథకాలు పనిచేయడం లేదని టీఆర్ఎస్ నేతలకు అర్థమయింది. ఇక ప్రజల్లోనే ఉండాలని కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. నెలలో పదిహేను రోజుల పాటు గ్రామాల పర్యటన చేపట్టాలని కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలను సూచించినట్లు తెలిసింది. ముఖ్యమైన సమస్యలను గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమితో ఎమ్మెల్యేల వ్యవహార శైలిలో కూడా గణనీయమైన మార్పు వచ్చిందని చెబుతున్నారు.

Tags:    

Similar News