రాజధాని మార్పు పై మళ్ళీ మైండ్ గేమ్?

వైసీపీ మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోదని అందరికి తెలిసిందే. అయితే న్యాయస్థానాల్లో ఉన్న ప్రతిబంధకాలు రీత్యా ఇప్పట్లో తరలింపు సాధ్యం కాదనేది అధికారపార్టీ కి అర్ధం అయిన [more]

Update: 2020-06-23 05:00 GMT

వైసీపీ మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోదని అందరికి తెలిసిందే. అయితే న్యాయస్థానాల్లో ఉన్న ప్రతిబంధకాలు రీత్యా ఇప్పట్లో తరలింపు సాధ్యం కాదనేది అధికారపార్టీ కి అర్ధం అయిన అంశమే. శాసన సభలో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల అంశంపై బిల్లులు పాస్ చేసి మండలి లో చర్చ ఆమోదం లేకపోయినా సాంకేతికంగా మరో నెల తరువాత అసెంబ్లీ చేసిందే ఫైనల్ అయ్యి బిల్లులు ఆమోదం పొందినట్లే. ఇప్పటికే చట్టం చేసే వరకు రాజధానుల తరలింపు అంశంపై ఎలాంటి అడుగు ముందుకు వేయబోమని హై కోర్టు కి అఫిడవిట్ ను సమర్పించింది ఎపి సర్కార్. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల పై మరో మైండ్ గేమ్ కి తెరతీసి విపక్షానికి నిద్ర లేకుండా చేస్తుంది అధికారపార్టీ.

తమ్మినేని ఇలా … పెద్దిరెడ్డి అలా …

తొందరలోనే ఎపి లో మూడు రాజధానుల ఏర్పాటు తధ్యమని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేసేసారు. రెండోసారి బిల్లులు ప్రవేశపెట్టాకా పెద్దల సభ ఆమోదించినా ఆమోదించకపోయినా సాంకేతికంగా శాసనసభ చేసిన బిల్లులు ఆమోదం అయిపోతాయని తమ్మినేని చెబుతున్నారు. చంద్రబాబు రాజధానుల తరలింపును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోలేరని ఆయన ఢంకా బజాయించి చెప్పేస్తున్నారు. అయితే మరోపక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రాజధానుల తరలింపు అంశంపై భిన్నంగా స్పందించి కొత్త చర్చకు తెరతీశారు. మూడు రాజధానుల పై ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొనడం విశేషం. సమయం వచ్చినప్పుడు దీనిపై స్టెప్ వేస్తామంటూ న్యాయ పర చిక్కుల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

బొత్స సుడిగాలి పర్యటనలు …

ఇది ఇలా ఉంటె రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆకస్మిక పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ ల క్వార్ట్రర్ లను ఇతర సిబ్బంది క్వార్ట్రర్ ల నిర్మాణ ప్రాంతాలను ఆయన పరిశీలించడం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెనుతిరగడం తిరిగి మరోసారి పరిశీలనకు వస్తానని చెప్పడం దేనికోసం అనే చర్చ బయల్దేరింది. ఈ క్వార్టర్ లను ప్రభుత్వం ఏవిధంగా వినియోగించుకోవొచ్చు అనేది బొత్స పరిశీలించారా? లేక మరేదేనైనా అనేది రాజధాని ప్రాంతంలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి రాజధాని తరలింపు రచ్చను టిడిపి చేత మరోసారి చేయించేందుకే వైసీపీ మైండ్ గేమ్ మొదలు పెట్టిందనే టాక్ మాత్రం వినవస్తుంది.

Tags:    

Similar News