నో ఎంట్రీ అందుకేనట

గణతంత్ర దినోత్సవాల్లో జరిగే పరేడ్ లోనూ రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందా? దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారా? శకటాలను అనుమతించని రాష్ట్రాల జాబితా చూస్తుంటే అదే [more]

Update: 2020-01-03 18:29 GMT

గణతంత్ర దినోత్సవాల్లో జరిగే పరేడ్ లోనూ రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందా? దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారా? శకటాలను అనుమతించని రాష్ట్రాల జాబితా చూస్తుంటే అదే నిజమనించక మానదు. ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే రాష్ట్రాల శకటాలను ఈనెల 26వ తేదీన జరిగే పరేడ్ లో ప్రదర్శనకు అనుమతించలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటి వరకూ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, కేరళ రాష్ట్రాల శకటాలకు అనుమతించలేదు.

మమత దూకుడు చూసి….

పశ్చిమబెంగాల్ లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్సార్సీని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని మమత బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. ఆమె కోల్ కత్తాలో ఎన్సార్సీ కి వ్యతిరేకంగా ర్యాలీని కూడా నిర్వహించారు. కర్ణాటకలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలకు సయితం మమత బెనర్జీ బెంగాల్ నుంచే పరిహారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ శకటానికి పరేడ్ లో చోటు దక్కలేదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

శివసేన మోసంతో….

ఇక మహారాష్ట్రలో ఇటీవల కొత్త సర్కార్ ఏర్పాటయింది. దశాబ్దాలుగా మిత్రుడిగా ఉన్న శివసేన బీజేపీకి కటీఫ్ చెప్పి కాంగ్రెస్ తో జతకట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు విషయంలో కాకున్నా, తమను మోసం చేసిన శివసేనపై కక్షతోనే మహారాష్ట్ర శకటాన్ని అనుమతించలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దీంతో పాటు కేరళ శకటం కూడా తిరస్కరణకు గురయింది. ఇటీవలే కేరళ అసెంబ్లీలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.

రాజకీయం లేదంటున్న….

అయితే శకటాల ఎంపికపై నిపుణుల కమిటీ మాత్రం అనుమతి నిరాకరణ రాజకీయ కోణంలో చూడవద్దంటోంది. నిబంధనలను పాటించకపోతేనే తిరస్కరిస్తామని నిపుణుల కమిటీ చెబుతోంది. తమకు రాజకీయాలు అవసరం ఉండదని, కేవలం నియమ, నిబంధనలను మాత్రమే చూస్తామని చెబుతోంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళతో పాటు హర్యనా, ఉత్తరాఖండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ శకటాలకు కూడా అనుమతి లభించలేదు. తమ వద్దకు రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖల నుంచి 56 ప్రతిపాదనలు రాగా అందులో 22 శకటాలకు అనుమతించామని చెబుతోంది. మొత్తం మీద గణతంత్ర దినోత్సవ శకటాల ఎంపిక రాజకీయంగా ఈసారి పెనుదుమారం రేపిందనే చెప్పాలి.

Tags:    

Similar News