భళా భూటాన్… చూసి నేర్చుకోండయ్యా?
దక్షిణాసియా దేశమైన భూటాన్ పచ్చని అందాలతో కనువిందు చేస్తుంటుంది. ఆధునికతకు దూరంగా ప్రశాంత జీవనంతో ప్రయాణిస్తుంది. ఆధునికత, హడావిడిలకు ఆ దేశం ఆమడ దూరం. దక్షిణాసియాలోని పేద [more]
దక్షిణాసియా దేశమైన భూటాన్ పచ్చని అందాలతో కనువిందు చేస్తుంటుంది. ఆధునికతకు దూరంగా ప్రశాంత జీవనంతో ప్రయాణిస్తుంది. ఆధునికత, హడావిడిలకు ఆ దేశం ఆమడ దూరం. దక్షిణాసియాలోని పేద [more]
దక్షిణాసియా దేశమైన భూటాన్ పచ్చని అందాలతో కనువిందు చేస్తుంటుంది. ఆధునికతకు దూరంగా ప్రశాంత జీవనంతో ప్రయాణిస్తుంది. ఆధునికత, హడావిడిలకు ఆ దేశం ఆమడ దూరం. దక్షిణాసియాలోని పేద దేశాల్లో ఒకటిగా దానిని అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుంది. అయినప్పటికీ ఆ విషయాన్ని భూటాన్ పట్టించుకోదు. తనదైన తరహాలోనే, తాను నమ్మిన బాటలోనే ముందుకు సాగుతుంది. ప్రక్రతిని, పర్యావరణాన్ని దెబ్బతీసి సాధించేది ఏమీ ఉండదన్నది దాని విశ్వాసం. అన్ని దేశాలు అభివద్ధిని జీడీపీలతో పోల్చిచూసుకుంటే, ఈ చిన్న దేశం మాత్రం ప్రజల సుఖ సంతోషాలతో ప్రగతిని లెక్కిస్తుంది.
కేవలం ఒకరే మృతి…..
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా మహమ్మారితో కుదేలవగా భూటాన్ మాత్రం కరోనా తన ఛాయలకు రాకుండా నిలువరించడం విశేషం. అధునాతన వైద్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లోపించినప్పటికి పకడ్బందీ ప్రణాళికతో కరోనాను తరిమి కొట్టడం ప్రశంసనీయం. సుమారు ఏడున్నర లక్ష్లల జనాభా గల దేశంలో జనవరి ఏడున ఒక వ్యక్తి చనిపోయారు. 34 ఏళ్ల ఈ వ్యక్తి కరోనాతో మరణించారని చెబుతున్నప్పటికీ అతను కొంతకాలంగా కాలేయం, మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుండటం గమనార్హం. ఏడున్నర లక్షల జనాభాకు దేశంలో గల వైద్యులు 337 మందే అంటే ఆశ్ఛర్యం కలగక మానదు. వీరిలో క్రిటికల్ హెల్త్ కేర్ లో శిక్షణ పొందిన వైద్యుడు ఒక్కరే. హెల్త్ కేర్ వర్కర్లు మూడు వేలమందే. ఈ పరిమిత వైద్య సిబ్బందితోనే కరోనా కేసులను
866కు ప్రభుత్వం నియంత్రించగలిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రజలు, వైద్యుల నిష్పత్తి తగినంతగా దేశంలో లేకపోవడం గమనార్హం.
ఆఫీసులోనే నిద్రించి…..
అధునాతన వైద్య వసతులు, సాంకేతిక పరిజానం తమ సొంతమని ఢంకా బజాయించి చెప్పుకునే పాశ్ఛాత్య దేశాలు, అగ్రరాజ్యమైన అమెరికాసహా అనేక దేశాలు కొవిడ్ నియంత్రణలో తడబడిన వేళ భూటాన్ యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. నిబద్ధత గల నాయకత్వం, పకడ్బందీ కార్యాచరణ, అధికార యంత్రాంగం చిత్తశుద్ధి, ప్రజల సహకారం వల్లే ఈ ఘనతను సాధించింది బుల్లి దేశమైన భూటాన్. ప్రధానమంత్రి లోటే త్సెరింగ్ స్వయంగా ఫిజీషియన్ కావడంతో పరిస్థితి తీవ్రతను గుర్తించి రంగంలోకి దిగారు. పని ఒత్తిడిలో ఇంటికి వెళ్లే తీరిక లేక ఆయన ఒక్కోసారి కార్యాలయంలోనే నిద్రించారు. ఆరోగ్యమంత్రి వాంగ్మో కొన్ని వారాల పాటు ఇంటికెళ్లలేదు. కార్యాలయాన్నే ఇంటిగా మార్చుకుని పనిచేశారు. రాజు జింగ్మే ఖేసర్ ఖే నామ్ జ్యేల్ వాంగ్ ఛుక్ కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఒక సహాయనిధిని ప్రారంభించారు. ఉపాధి కోల్పోయిన దాదాపు 35 వేల మందికి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వపరంగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు.
వెయ్యిలోపే కేసులు….
అందువల్లే అమెరికాలో సుమారు 2.83 లక్షలు, భారత్ లో 1.09 లక్ష్లల కేసులు నమోదు కాగా భూటాన్ ఆ సంఖ్యను 866కు పరిమితం చేయగలిగింది. అదే సమయంలో అమెరికాలో నాలుగు లక్షలకు పైగా, భారత్ లో లక్షన్నర మరణాలు సంభవించగా భూటాన్ లో ఒక్కరే మరణించడం గమనించదగ్గ అంశం. పాలన, అధికార యంత్రాంగాలే కాకుండా ప్రజలు కూడా ఈ విషయంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను విరాళంగా అందించారు. ప్రజలు తమ హోటళ్లను క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు కోసం ఉచితంగా అందజేశారు. ఇక వైద్యుల సేవలను వెలకట్టడం అసాధ్యమని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒక్కరి కోసం అందరు, అందరి కోసం ఒక్కరు స్ఫూర్తితో ప్రజలు పనిచేయడం వల్లే కరోనా మహమ్మారిని పారదోగలిగారు. బుల్లి దేశమైన భూటాన్ నుంచి ప్రగతికి మారు పేరని భుజాలు చరచుకునే దేశాలు స్ఫూర్తి పొందాల్సిన ఆవశ్యకత ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
– ఎడిటోరియల్ డెస్క్