ఎంత మంది వచ్చినా…?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు. దీనికి ఒక ఫార్ములా అంటూ ఏదీ లేదు. ఎక్కడ ఏం జ‌రిగినా.. రాజ‌కీయాల్లో అంతే అనుకోవ‌డం త‌ప్ప మ‌రో మాటే వినిపించ‌దు. [more]

Update: 2019-07-28 15:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు. దీనికి ఒక ఫార్ములా అంటూ ఏదీ లేదు. ఎక్కడ ఏం జ‌రిగినా.. రాజ‌కీయాల్లో అంతే అనుకోవ‌డం త‌ప్ప మ‌రో మాటే వినిపించ‌దు. క‌నిపించ‌దు కూడా. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే బీజేపీలో వినిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌మ వ్యూహాన్ని వెల్లడించారు. శ్రావ‌ణం త‌ర్వాత పార్టీలో సంద‌డే! అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చకు దారితీశాయి. అంటే.. క‌న్నావారి ఉద్దేశంలో.. ఈ ఆషాఢం సెంటిమెంట్ అయిపోగానే.. శ్రావ‌ణ మాసంలో .. గోపి(గోడ‌మీద పిల్లులు)ల‌తో త‌మ పార్టీ క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని అర్ధం కాబోలు. అయితే, దీనిని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ డైరెక్టుగా చెప్పకుండా కొంత డొంక తిరుగుడుగా చెప్పుకొచ్చారు.

ముహూర్తం చూసుకుని మరీ….

స‌రే! ఒక పార్టీ చీఫ్‌గా క‌న్నా.. త‌న పార్టీని అభివృద్ధి చేసుకోవ‌డంపై దృష్టి పెట్టడంలో ఎలాంటి త‌ప్పూలేదు. అయితే, సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కు రాజ‌కీయంగా పార్టీని ఎలా అభివృద్ధి చేయాలో తెలియ‌డం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఆయ‌న‌కు రాజ‌కీయంగా చాలా అనుభ‌వం ఉంద‌ని, అయితే, ఇప్పుడు బీజేపీలో మా త్రం క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అనుభ‌వాన్ని రంగ‌రించ‌లేక పోతున్నార‌ని అంటున్నారు. గోడ‌దూకుళ్లు మంచివే అయినా.. అన్ని వేళ‌లా మంచివేనా? అనే ప్రశ్న రాజ‌కీయాల్లో ఎప్పుడూ వినిపిస్తుంది. ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నాయ‌కులు కీల‌క‌మైన వారే అయిన‌ప్పటికీ.. తాజా ఎన్నిక‌ల్లో గెలిచిన సంద‌ర్భం ఒక్కటి క‌నిపించ‌లేదు.

ఎందరు నేతలు వచ్చినా…

ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి చ‌రిష్మా ఉండి ఉంటే.. విశాఖ‌లో గెలిచేవారు. అదేవిధంగా సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు చ‌రిష్మా ఉండి ఉంటే.. ఆయ‌న ప్రచారం చేసిన చోట‌ల్లా క‌మ‌ల వికాసం జ‌రిగి ఉండేది. అయితే, ఇలాంటి మెరుపులు ఎక్కడా క‌నిపించ‌లేదు. అంటే.. నాయ‌కుల చ‌రిష్మా వ‌ల్ల ప్రజ‌ల్లో పార్టీ పుంజుకునే ప‌రిస్తితి లేదు. పైగా గోడ‌దూకుడు గాళ్లకు తాజా ఎన్నిక‌ల్లో ప్రజ‌లు ఎలా బుద్ధి చెప్పారో.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు తెలియంది కాదు. స్వయంగా తాను కూడా ఓడిపోయిన ప‌రిస్థితి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీని వ్యవ‌స్థా గ‌తంగా అభివృద్ధి చేసుకుని ముందుకు తీసుకు వెళ్లడం ద్వారా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆశించిన మేర‌కు బీజేపీని ప‌టిష్టం చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అలా కాకుండా కేవ‌లం జంపింగుల‌పై ఆధార‌ప‌డితే.. ఎన్నటికీ.. బీజేపీ ఎదుగుబొదుగు లేని బొన్సాయ్ వృక్షాన్నే త‌ల‌పిస్తుంది. ఫ‌లితంగా ఎన్ని శ్రావ‌ణాలు వ‌చ్చినా.. క‌మ‌ల వికాసం మాత్రం శూన్యంగానే ఉంటుంది. మ‌రి దీనిని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఇప్పటికైనా గ్ర‌హిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News