సడలించి… సాధిస్తారా….?

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల క్యాడర్ మధ్య లోక్ సభ ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలు సంకీర్ణ సర్కార్ కు షాకిచ్చేవిలా ఉన్నాయి. [more]

Update: 2019-05-13 17:30 GMT

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల క్యాడర్ మధ్య లోక్ సభ ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలు సంకీర్ణ సర్కార్ కు షాకిచ్చేవిలా ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ నేతలు భవిష్యత్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని ప్రకటించేసుకుంటున్నారు. సిద్ధరామయ్య కూడా దీనిపై పెద్దగా మాట్లాడకుండా మౌనంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు కుమారస్వామి తన ఇంటలిజెన్స్ వ్యవస్థ మొత్తాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేల వ్యవహారశైలిని పరిశీలిస్తున్నారు.

వ్యాఖ్యల కలకలం….

తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల్లోనూ కలకలం రేపాయి. దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యలు సంకీర్ణ సర్కార్ పట్ల, ప్రధానంగా ముఖ్యమంత్రి కుమారస్వామి పట్ల వ్యతిరేకతతో ఉన్నారని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. వారు ఏ క్షణంలోనైనా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశముందని కూడా యడ్డీ చెప్పారు. ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది వేచిచూడండని ఆయన అనడంతో మరోసారి సంకీర్ణ సర్కార్ మనుగడపై చర్చ ప్రారంభమయింది.

20 మంది ఎమ్మెల్యేలు….

అయితే యడ్యూరప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలనే చేశారు. ఏకంగా క్యాంపులను నిర్వహించి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. అయితే గతంలో జరిగిన ఆపరేషన్ కమల్ కు కొందరు ఆకర్షితులయ్యారు. రమేష్ జార్ఖిహోళి వంటి నేతలు ఇప్పటికే బీజేపీకి టచ్ లో ఉన్నారు. ఆయనపై అనర్హత వేటు అంశం స్పీకర్ పరిశీలనలో ఉంది. అయితే బీజేపీ పెట్టిన షరతుల వల్లనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి రావడం లేదన్న వాదన సయితం వినపడుతోంది.

షరతులను సడలిస్తే….

కాంగ్రెస్ పార్టీ బీజేపీని వదిలి రావాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం షరతు విధించింది. ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే సంకీర్ణ సర్కార్ సంఖ్యాపరంగా వీక్ అవుతుంది. అప్పుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని యడ్యూరప్పను ఎక్కించాలన్నది బీజేపీ ఆలోచన. అయితే ఈ ఆలోచనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో బీజేపీ కూడా రాజీనామాల షరతును పక్కనపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కన్నడ నాట లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏమైనా జరగొచ్చన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News