యనమల.. ఎటైనా తిప్పేయగలరు ?

యనమల రామకృష్ణుడు. రాజకీయాల్లోకి రానపుడు పూర్వాశ్రమంలో న్యాయవాది. గిట్టనివారు చెట్టుకింద ప్లీడర్ అంటారు. అక్కడ దర్జా వెలిగితే రాజకీయల్లోకి వచ్చేవారు కాదేమో. కానీ యంగ్ యనమలకు టీడీపీ [more]

Update: 2020-08-13 02:00 GMT

యనమల రామకృష్ణుడు. రాజకీయాల్లోకి రానపుడు పూర్వాశ్రమంలో న్యాయవాది. గిట్టనివారు చెట్టుకింద ప్లీడర్ అంటారు. అక్కడ దర్జా వెలిగితే రాజకీయల్లోకి వచ్చేవారు కాదేమో. కానీ యంగ్ యనమలకు టీడీపీ ఆఫర్ దక్కింది. అంతే చటుక్కున పార్టీలోకి వచ్చేసి పుటుక్కున పదవి పట్టేశారు. తనకు రాజకీయ బిక్ష పెట్టిన అన్న గారిని స్పీకర్ హోదాలో శాసించి మైక్ ఇవ్వకుండా నిండు అసెంబ్లీ నుంచి కన్నీళ్ళు పెట్టుకుని వెళ్లేలా చేసిన ఘనత యనమలదేనని అంటారు. ఇక యనమల రామకృష్ణుడు చంద్రబాబు రాజకీయానికి తెర వెనక చాణక్యుడు. కాగలకార్యం అంతా ఆయన అలాగే నడుపుతారు. తాము అధికారంలో ఉంటే చట్ట సభల రూల్ బుక్స్ ఆయనకు ఒకలా కనిపిస్తాయి. ప్రతిపక్షంలోకి రాగానే అవే అటునుంచి ఇటు మారుతాయి. ఏదైనా తమకే అనుకూలం చేయగల సామర్ధ్యం యనమల రామకృష్ణుడు సొంతం.

నాడు అలాగనే …..

చట్ట సభలు అత్యున్నతమైనవి. ప్రజలు ఎన్నుకున్నవి, వాటి విషయంలో న్యాయ స్థానాలు జోక్యమేంటి అని గద్దించిన గొంతు ఇదే యనమల రామకృష్ణుడిది, స్పీకర్ గా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ఈ మేరకు ఆయన ఒక రూలింగ్ కూడా పాస్ చేశారు. అప్పట్లో బాబు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పాలన మీద ఏ కోర్టులూ ఏమీ చెప్పకూడదు. ఇదీ యనమలవారి న్యాయవాద నీతి. ఇక ఇదే యనమల రామకృష్ణుడు ఇపుడు విపక్షంలో ఏమంటున్నారో అందరికీ తెలిసిందే. జగన్ లాంటి నియంత పాలనలో కోర్టులు తప్పకుండా జోక్యం చేసుకోవాలిట. ఆయన తెచ్చిన చట్టాలను ఒక్క దెబ్బకు కొట్టేయాలట.

కేంద్రం జోక్యం……

ఇక తాము అధికారం వెలగబెడుతున్న రోజుల్లో సీబీఐ రాకూడదు, కేంద్రం నోరెత్తకూడదు, అలాగైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు విలువేంటి అని అసెంబ్లీలో నిలిచి గంటల తరబడి లెక్చర్లు దంచిన నైపుణ్యం ఇదే యనమల రామకృష్ణుడిది. ఇపుడు సీన్ మారిందిగా అందుకే కేంద్రం ఏపీ విషయంలో జోక్యం చేసుకోవచ్చున‌ట. దాని కోసం అధికరణ‌ 355 లోని ఏ, బీ సీ సెక్షన్లు కూడా యనమల రామకృష్ణుడు బయటకు తీసి మరీ నొక్కి వక్కాణిస్తున్నారు. అంటే జగన్ నెత్తిన రాష్ట్ర పతి పాలన పెట్టడానికి రెడీ. అందుకోసం కేంద్రం చేతికి కత్తులు కటార్లు అందిస్తారు. కానీ తాము అధికారాంలో ఉంటే దేశంలోని ఏ చట్టాలు వర్తించవు, ఏపీ ప్రత్యేక దేశంగా ఫీల్ అవుతారన్న మాట.

ఇక్కడ నెగ్గారా ?

నిజానికి న్యాయవాదులు కోర్టులో తిమ్మిని బమ్మిగా చేస్తారు. యనమల రామకృష్ణుడు ఎందుచేతనో న్యాయవాద వ్రుత్తిలో రాణించలేదో లేక ఆసక్తి లేకనో రాజకీయ బాట పట్టారు, ఇక్కడ మాత్రం ఆయన విషయాన్ని ఎటు నుంచి ఏదైనా తిప్పగల సామర్ధ్యాన్ని సంపాదించారు. లేని సెలెక్ట్ కమిటీని ఉందని చెప్పగలరు, రెండు సార్లు అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ సంతకం పెట్టి చట్టంగా వస్తే మాత్రం అది చట్టుబండలేనని అదే నోటితో అనేయగలరు. మొత్తానికి యనమల బాబు పక్కాల్సిన ఉండాల్సిన వారే. ఇంత చేసినా కూడా బాబు ఆయన్ని రాజ్యసభకు ఎందుకు పంపించలేదో మరి.

Tags:    

Similar News