అప్పుల లెక్కలు బాగానే అప్పచెబుతున్నారుగా ?

ఎవరికి ఎలా ఉన్నా యనమల రామకృష్ణుడుకి మాత్రం ఆంధ్ర అప్పుల లెక్కలే గుర్తుకువస్తున్నాయి. ఆయన చదివింది న్యాయ శాస్త్రం అయినా కూడా ఆర్ధిక శాస్త్రంలో కూడా పట్టు [more]

Update: 2021-05-04 11:00 GMT

ఎవరికి ఎలా ఉన్నా యనమల రామకృష్ణుడుకి మాత్రం ఆంధ్ర అప్పుల లెక్కలే గుర్తుకువస్తున్నాయి. ఆయన చదివింది న్యాయ శాస్త్రం అయినా కూడా ఆర్ధిక శాస్త్రంలో కూడా పట్టు సంపాదించారు. ఆర్ధిక మంత్రిగానే బాగా కుదురుకున్నారు. ఆయనకు ఒక నమ్మకం ఉంది తనలాగా ఎవరూ ఆర్ధిక మంత్రిత్వ శాఖను నిర్వహించలేరని. కానీ ఏపీ ఎందరినో చూసింది. ఇంకా చూడబోతోంది. అందువల్ల యనమల రామకృష్ణుడు బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అవునా కాదా అన్నది ఆగని కాలం రాస్తున్న చరిత్రలో ఎలా చెబుతుంది. ఏది ఏమైనా ఓడిన తరువాత యనమలకు చిట్టాపద్దుల గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయని అంటున్నారు.

శ్వేతపత్రం కావాలట ….

ఈ పత్రాలు లెక్కలూ ఎవరికి అర్ధం కావాలి. ఎవరు దీన్ని చూసి సంతోషించాలి. రాజకీయ నాయకులు మాత్రం పదే పదే తమకు శ్వేత పత్రాలు కావాలంటూ డిమాండ్లు పెట్టడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. మొదట్లో ఈ పద డాంబికం చూసి అందులో ఏమైనా ఉంటుందేమోనని జనాలు కూడా ముచ్చట పడడం కద్దు. కానీ ఇపుడు బడ్జెట్ పద్దులనే ఎవరూ పట్టించుకోవడం లేదు. అరిగిపోయిన దానికి జరిగిన పోయిన దానికీ లెక్కలు చెప్పమంటే వినే ఓపిక కూడా ఎవరికి ఉంటుంది మరి. అయినా యనమల రామకృష్ణుడు లెక్కలు చెప్పండి, వైట్ పేపర్ ఇవ్వండి అంటూ వైసీపీ సర్కార్ ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు.

నాడేం చేశారో …?

ఏపీ విభజన కాలంలో తొంబై వేల కోట్ల అప్పుతో వస్తే తెలుగుదేశం దిగిపోయేనాటికి మూడున్నర లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ఖజానాకు ఉందని లెక్క తేలింది. మరి టీడీపీ హయాంలో రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చారని వైసీపీ నేతలు విమర్శించారు. మరి ఆ డబ్బు ఏం చేశారు, దేనికి ఖర్చు పెట్టారు అని అడిగిన నాడు టీడీపీ నేతలు లెక్కలు ఏమైనా చెప్పారా. పోనీ శ్వేతపత్రం అని కలవరిస్తున్న యనమల రామకృష్ణుడు అయినా ఇదీ మా ఖర్చుల లెక్క అంటూ ఏమైనా చూపించారా. మరి నాడు ఆ డబ్బు దేనికి పెట్టారు అంటే పసుపు పార్టీ పెద్దలు అభివృద్ధికి అని ఒక్క మాట అనేస్తారు. ఆ అభివృద్ధి అన్నది బ్రహ్మ పదార్ధం అనుకోవాలి అంతే

కనిపిస్తోందిగా…?

ఇక వైసీపీ ఏలుబడిలో రెండేళ్లు గడిచాయి. అందులో కేవలం ఎనిమిది నెలల పాలన జరిగాక కరోనా మహమ్మారి వచ్చి పడింది. ప్రపంచమే అతలాకుతలం అయింది. ఆర్ధికంగా ఇబ్బందులు వచ్చాయి. కేంద్రం నుంచి ఆర్ధిక సాయం ఏపాటిదో యనమల రామకృష్ణుడు కి తెలియనిది కాదు, ఇక జగన్ సంక్షేమ కార్యక్రమాల పేరిట చేస్తున్న ఖర్చు అంతా చూస్తున్నదే. డైరెక్ట్ గా నగదు బదిలీ జరుగుతోంది. కరోనా వంటి కఠోరమైన వేళ కూడా జనాల చేతిలో డబ్బు ఆడించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తం ఖర్చు ఇక్కడే పెట్టారు అని చెప్పడానికి లేదు కానీ పెద్ద ఎత్తున సంక్షేమానికి నిధుల వరద పారిస్తున్నారు అన్నది మాత్రం అందరికీ తెలిసిందే. మరి ఆర్ధిక నిపుణుడు అయిన యనమల రామకృష్ణుడుకు ఇవన్నీ తెలియవా. బట్టతల కనిపిస్తున్నా అదేంటి అని అడిగితే వట్టి రాజకీయ విమర్శ తప్ప ఇంకేలా చూడాలి. ఏది ఏమైనా ఏపీ అప్పుల్లో ఉంది. అది యనమల రామకృష్ణుడు నుంచి వారసత్వగానే వచ్చింది. ఆ సంగతి మరచి కొత్త కోడలిని అత్త దబాయించినట్లుగా యనమల మాట్లాడమే విడ్డూరం అని వైసీపీ నేతలు అంటున్నారంటే తప్పేముంది.

Tags:    

Similar News