ఈ విషయంలో జగన్ ఫెయిలయినట్లేనా?
ఆంధ్రులు ఆరంభ శూరులు అని అంటారు. దాని పక్కనే అనైక్యత అని కూడా రాసుకోవాలేమో. ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తామని విభజన చట్టంలో పెట్టి మరీ తరువాత [more]
ఆంధ్రులు ఆరంభ శూరులు అని అంటారు. దాని పక్కనే అనైక్యత అని కూడా రాసుకోవాలేమో. ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తామని విభజన చట్టంలో పెట్టి మరీ తరువాత [more]
ఆంధ్రులు ఆరంభ శూరులు అని అంటారు. దాని పక్కనే అనైక్యత అని కూడా రాసుకోవాలేమో. ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తామని విభజన చట్టంలో పెట్టి మరీ తరువాత తుంగలో తొక్కారు. రెండు జాతీయ పార్టీలు ఏపీని నిలువునా ముంచేశాయి. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా చట్టంలో పెట్టారు. దాంతో ఏపీ వ్యవసాయ రాష్ట్రంగా అయినా ముందుకు సాగుతుందన్న ఆశలు అందరిలో కలిగాయి. ఆరేళ్ళు గడిచాక రెండు ప్రభుత్వాలు ఏపీలో మారాక కేంద్రంలోని మోడీ సర్కార్ అడ్డం తిరిగింది. మేము 2014 నాటి బడ్జెట్ అంచనాలే కట్టుబడి ఉంటామని అంటోంది. అదే జరిగితే ఏపీకి పోలవరం టాటా చెప్పినట్లే మరి.
వల్ల కాదుగా……
పోలవరం ప్రస్తుత అంచనా 55 వేల కోట్లు. అందులో కేంద్రం ఒప్పుకున్న 20 వేల కోట్లు తీసేస్తే కచ్చితంగా 35 వేల కోట్లు రాష్ట్రం నెత్తిన పడుతుంది. ఈ మొత్తం అంతా పునరావాస ప్యాకేజి కే అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున మొత్తం ఖర్చు చేయాలంటే రాష్ట్రానికి సాధ్యమవుతుందా? అన్నది పెద్ద చర్చ. మరో వైపు చూసుకుంటే అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలని జగన్ సర్కార్ ఆలోచిస్తోంది. నాటికి ప్రాజెక్ట్ అంచనా వ్యయం మరింత పెరుగుతుంది అన్నది కూడా నిజం. మరి ఆ మొత్తం ఎవరు భరిస్తారు. కేంద్రం అయితే 2014 దగ్గరే ఆగిపోయింది కదా.
బూమరాంగ్ అయిందా….?
అమరావతిలో అవినీతి జరిగింది అని వైసీపీ ప్రచారం చేసింది. మూడు రాజధానులను ముందుకు తెచ్చింది. దీంతో రాజధాని కధ ఎటూ కాకుండా పోయింది. దాంట్లో కేంద్ర సాయం ఎంత ఇవ్వాలన్నది ఇప్పటికీ లెక్క తేలలేదు. రాజధాని నిర్మాణానికి అంతా ఇచ్చేశామని బీజేపీ పెద్దలు మరోవైపు చెబుతున్నారు. కానీ అడిగే సీన్ లేకుండా రాజధాని రచ్చ ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్యన సాగుతోంది. ఇక పోలవరం నిధులను టీడీపీ నేతలు ఏటీఎం మాదిరిగా చేసుకుని పూర్తిగా తినేశారని ప్రచారం చేసింది వైసీపీ. ఇపుడు బీజేపీ నేతలు కూడా అదే నమ్ముతున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అయితే పోలవరంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా కొత్త తగవులోకి నెట్టేసి పోలవరం నిధులు పూర్తిగా ఇవ్వకుండా కేంద్రం తప్పించుకుంటోంది అంటున్నారు. వైసీపీ టీడీపీ మీద రాజకీయ కక్షతో చేసిన అతి ప్రచారం చివరికి బీజేపీకే మేలు జరిగేలా ఉందని చెబుతున్నారు.
అతీ గతీ లేకుండా ….
ఇపుడున్న పరిస్థితిలో ఏపీని చూసి పగ వాడు కూడా జాలి పడాల్సిందే మరి. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య వ్యక్తిగత స్థాయిలో సాగుతున్న వివాదం పుణ్యమాని అయిదు కోట్ల ఆంధులకు తీరని అన్యాయం జరిగిపోయింది అన్నది కళ్ళకు కనిపిస్తోంది. హోదా ఇస్తే పరిశ్రమలు చాలా వచ్చి ఏపీ ముందుకు వెళ్ళేది. ఇక పోలవరం పూర్తి అయితే రాష్ట్ర ప్రగతి గతి మారేది. కానీ ఇపుడు ఈ రెండు హామీలను తనకు అనుకూలంగా చేసుకుని కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీ ప్రయోజనాలతోనే చెలగాటమాడుతోంది. ఇప్పటికైనా రాష్ట్రం కోసం వైసీపీ టీడీపీ సహా అంతా కలసి అఖిలపక్షంగా ఏర్పడి కేంద్రం మీద వత్తిడి తెస్తేనే ఆంధ్రా బాగు పడుతుంది. లేకపోతే మాత్రం బీజేపీ రాజకీయమే గెలుస్తుంది. ఇంతకీ అన్ని రాజకీయ పార్టీలు ఏపీలో కలవడం జరిగే పనేనా.