వైసీపీ నేత‌లు బాగా బిజీ… ఎందుకో తెలుసా..?

రాష్ట్ర వ్యాప్తంగా కీల‌క వైసీపీ నేత‌లు చాలా బిజీగా ఉన్నారు. వీరిలో మంత్రులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో కీల‌క సామాజిక వ‌ర్గానికి చెందిన వారు [more]

Update: 2021-01-30 11:00 GMT

రాష్ట్ర వ్యాప్తంగా కీల‌క వైసీపీ నేత‌లు చాలా బిజీగా ఉన్నారు. వీరిలో మంత్రులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో కీల‌క సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. మ‌రి వీరంతా ఎందుకు బిజీగా ఉన్నారు ? ప్రజ‌ల‌కు ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను అందించ‌డంలో బిజీగా ఉన్నారా ? లేక‌.. ప్రభుత్వం నుంచి మ‌రిన్ని నిధులు తీసుకువ‌చ్చి.. ప్రజ‌ల‌కు ఎలా సేవ చేయాలా? అనే ఆలోచ‌న‌లో ఉన్నారా? అంటే.. ఇవేవీ కావ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా వైసీపీలోని ఓ కీల‌క వ‌ర్గం చెబుతున్న మాట ప్రకారం.. వీరంతా కూడా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది.

కేబినెట్ విస్తరణ ఉండటంతో….

త్వర‌లోనే కేబినెట్ విస్తర‌ణ ఉంది. ఈ నేప‌థ్యంలో ఉన్న మంత్రుల్లో అంటే 24 మందిలో (సీఎం మిన‌హా) స‌గం మందిని మారుస్తారని అంటున్నారు. ఈ క్రమంలో వారంతా కూడా త‌మ త‌మ ప‌ద‌వులు కాపాడుకోవ‌డం కోసం ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారంతా కూడా బిజీగా ఉన్నారు. అదేంటి? ఎలా అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్లినా.. ఏ వేదిక ఎక్కినా.. మంత్రులు.. జ‌గ‌న్‌పై పొగ‌డ్తల‌వ‌ర్షం కురిపిస్తున్నారు. జ‌గ‌న్‌ను పొగ‌డ‌కుండా.. కార్యక్రమం ప్రారంభించ‌డం లేదు. కార్యక్రమాన్ని ముగించ‌డం కూడా లేదు. ఇక‌, డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి ఏకంగా.. జ‌గ‌న్‌కు పాదాభివంద‌నం చేయ‌బోయారు.

చిత్రమైన బహుమతులతో….

మ‌రికొంద‌రు మంత్రులు.. జ‌గ‌న్‌కు చిత్రవిచిత్రమైన బ‌హుమ‌తులు ఇస్తున్నారు. ఇటీవ‌ల తూర్పుగోదావ‌రికి చెందిన మంత్రి ఒక‌రు బియ్యం గింజ‌ల‌తో జ‌గ‌న్ బొమ్మను చిత్రించి ఆయ‌న‌కు బ‌హూక‌రించారు. ఇలా మంత్రులు ఎవ‌రి శైలిలో వారు త‌మ ప‌ద‌వులు కాపాడుకునేందుకు జ‌గ‌న్‌ను మ‌చ్చిక చేసుకునే క్రమంలో బిజీగా ఉన్నారు. ఇక‌, మిగిలిన వారు అంటే.. మంత్రి ప‌ద‌వుల రేసులో ఉన్నామ‌ని అనుకునేవారు.. మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నవారు కూడా జ‌గ‌న్‌పై పొగ‌డ్తల‌తో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు.. పార్టీ త‌ర‌ఫున భారీ ఎత్తున క‌టౌట్లు ఏర్పాటు చేస్తున్నారు.

జగన్ ను ఆహ్వానించాలని….

ఏ చిన్న కార్యక్రమం జ‌రిగినా.. మేమున్నామంటూ జెండా ప‌ట్టుకుంటున్నారు. మ‌రి కొంద‌రు ఏదో ఒక కార్యక్రమం పేరుతో జ‌గ‌న్‌ను నియోజ‌క‌వ‌ర్గానికి ఆహ్వానిస్తూ బ‌ల‌ప్రద‌ర్శన‌కు దిగుతున్నారు. అయితే.. ఇదేదో జ‌నం కోసం కాదు.. త‌మ కోసం.. త‌మ ప‌ద‌వుల కోసం.. ఇలా మొత్తంగా వైసీపీలో అటు మంత్రులు త‌మ ప‌ద‌వులు నిల‌బెట్టుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఇటు నాయ‌కులు.. ప‌ద‌వుల వేట‌లో బిజీగా ఉన్నారు. మ‌రి .. ఈ ఉత్సాహం త‌మ‌‌పై ఎప్పుడు చూపిస్తారో ? అనేది ప్రజ‌ల మాట‌!! ప్రస్తుతానికి వాలంటీర్లు, స‌చివాల‌యాలే దిక్కుగా ఉన్నాయి.

Tags:    

Similar News