యడ్డీ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారా?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అన్నీ చిక్కులే ఎదురవుతున్నాయి. ఒకవైపు మంత్రి వర్గ విస్తరణతో అసంతృప్తి, మరోవైపు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల వత్తిడి. ఇలా రెండింటి మధ్య [more]

Update: 2019-09-09 17:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అన్నీ చిక్కులే ఎదురవుతున్నాయి. ఒకవైపు మంత్రి వర్గ విస్తరణతో అసంతృప్తి, మరోవైపు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల వత్తిడి. ఇలా రెండింటి మధ్య యడ్యూరప్ప నలిగిపోతున్నారు. ఈ రెండు పార్టీ అంతర్గత సమస్య. ఈ రెండింటిని తెలివిగా యడ్యూరప్ప అధిష్టానం పై నెట్టగలిగారు. మంత్రివర్గ విస్తరణ నుంచి శాఖల కేటాయింపు వరకూ కేంద్ర నాయకత్వమే చూసుకుంటుందని, తనకు ఏమాత్రం సంబంధంలేదని యడ్యూరప్ప నేతలకు చెప్పుకోగలిగారు. అలాగే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల విషయమూ అధిష్టానమే చూస్తుందని నచ్చ చెప్పగలిగారు.

ఈ విష‍యంలో మాత్రం…..

కానీ ప్రజలకు సంబంధించిన విషయంలో మాత్రం యడ్యూరప్ప తప్పించుకోలేక పోతున్నారు. ఇటీవల కర్ణాటకలో కురిసిన వర్షాలు, వరదలకు దాదాపు నలభై వేల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. ప్రధాని నరేంద్ర మోదీ తో సహా కేంద్రమంత్రులు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. కేంద్ర బృందం కూడా నష్టం అంచనా వేసుకుని వెళ్లింది. అయితే ఇంతవరకూ కేంద్రం నుంచి సాయం అందలేదు. ఒక్క రూపాయి కూడా మోదీ సర్కార్ యడ్యూరప్ప ప్రభుత్వానికి విదిల్చ లేదు.

ప్రజలు అండగా నిలిచినా….

నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మాత్రమే భారతీయ జనతా పార్టీకి పట్టున్న రాష్ట్రం. కర్ణాటక తప్ప మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ఎదగలేని పరిస్థిితి. పైగా కర్ణాటకలో ఇటీవల బీజేపీ అధికారంలోకి కూడా వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. కర్ణాటకలో ఉన్న లోక్ సభ సీట్లలో ఒక్కటి మినహాయించి మిగిలిన సీట్లన్నీ (స్వతంత్ర అభ్యర్థి సుమలత) బీజేపీకే దక్కాయి. కన్నడ ప్రజలు కీలక లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచారు.

ప్రభుత్వం ఏర్పడినా…..

ఈ ఫలితాలతోనే కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి పెరిగి కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలి పోవడానికి కారణమయ్యాయి. ఇంత స్థాయిలో లోక్ సభ సీట్లను కట్టబెట్టిన కన్నడ ప్రజలకు మోదీ సర్కార్ వరద సాయం చేయకపోవడంపై విమర్శలు విన్పిస్తున్నాయి. దీనినే విపక్షాలు అస్త్రంగా తీసుకుంటున్నాయి. యడ్యూరప్ప దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి. పలుమార్లు ఢిల్లీ వెళ్లి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో యడ్యూరప్ప ఫెయిల్ అయ్యారన్న టాక్ విన్పిస్తుంది.

Tags:    

Similar News