అయ్య… అప్ప.. చెట్టపట్టాల్… ఎందుకబ్బా?

రాజకీయంగా వారు ప్రత్యర్థులు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారే. వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా కలిసి మెలసి ఉండటం కన్నడనాట చర్చనీయాంశమైంది. వారే ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ [more]

Update: 2020-03-03 17:30 GMT

రాజకీయంగా వారు ప్రత్యర్థులు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారే. వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా కలిసి మెలసి ఉండటం కన్నడనాట చర్చనీయాంశమైంది. వారే ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. నిజానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోనే యడ్యూరప్ప ముఖ్యమంత్రి కాగలిగారు. అలాగే కాంగ్రెస్ సంకీర్ణ పతనానికి కారణం కూడా యడ్యూరప్ప. కానీ వీరిద్దరూ రాజకీయంగా శత్రువులైనా గత కొంతకాలంగా మిత్రులుగా మెలుగుతున్నారు.

సాఫ్ట్ కార్నర్ తోనే…..

నిజానికి సిద్ధరామయ్య వర్గం నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లిపోయారు. సజావుగా సాగుతున్న సంకీర్ణ సర్కార్ ను కాలదన్ని రాజీనామా చేసి వెళ్లిపోయారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య విధానపరమైన, సిద్ధాంతపరమైన విభేదాలున్నాయి. యడ్యూరప్ప ఇంత చేసినా సిద్ధరామయ్యకు మాత్రం ఆయనపట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లే కనపడుతుంది.

సిద్ధూ ఏది అడిగినా….

ప్రధానంగా ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడి యడ్యూరప్ప ప్రభుత్వం బలోపేతమయ్యాక సిద్ధరామయ్యలో కొంత మార్పు వచ్చిందంటున్నారు. అలాగే యడ్యూరప్ప కూడా సిద్ధరామయ్య ఏది అడిగినా వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో సిద్ధరామయ్య యడ్యూరప్ప ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయినా యడ్యూరప్ప మాత్రం సిద్ధూ అంటే ప్రేమ ఒలక బోస్తున్నారు. ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో సిద్ధరామయ్య, యడ్యూరప్పలు ఒకేసారి ఎమ్మెల్యేలుగా వివిధ పార్టీల నుంచి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇద్దరూ చేరో పార్టీలో ఉన్నారు. సిద్ధరామయ్య కాంగ్రెస్ తరుపున ముఖ్యమంత్రి అయ్యారు. యడ్యూరప్ప ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు.

కోట్లు కుమ్మరించి…..

తాజాగా సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామికి 600 కోట్లు యడ్యూరప్ప కేటాయించడం చర్చనీయాంశమయింది. ప్రతిపక్ష నేత నియోజకవర్గానికి అంత నిధులు కేటాయించడంపై కాంగ్రెస్ నేతలే విస్తుపోతున్నారు. మరో రెండున్నరేళ్లు తన పాలన సజావుగా సాగాలంటే సిద్ధరామయ్య అవసరమని యడ్యూరప్ప భావిస్తున్నారు. అలాగే దేవెగౌడ ఫ్యామిలీ కంటే యడ్యూరప్ప బెటరని సిద్ధరామయ్య అనుకోవడం వల్లనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించిందని అంటున్నారు. సిద్ధరామయ్య యడ్యూరప్ప పుట్టిన రోజు వేడుకలకు కూడా హాజరయి ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. మొత్తం మీద వీరిద్దరి స్నేహం పైన సోషల్ మీడియాలోనూ సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News