స్వామీజీలు శాసిస్తే ఎలా?

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే స్వామీజీలు, మఠాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మఠాలు, స్వామీజీలు [more]

Update: 2020-01-16 16:30 GMT

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే స్వామీజీలు, మఠాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మఠాలు, స్వామీజీలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వారు నేరుగా రాజకీయాల్లో పాల్గొనక పోయినా పరోక్షంగా నేతలకు సహాయ సహకారాలు అందిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో అయితే సామాజిక వర్గాల వారీగా స్వామీజీలు, మఠాలు ఉన్నాయి. ఇవే కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయి.

మఠాలు, స్వామీజీలు….

అందులో యడ్యూరప్ప లాంటి ముఖ్యమంత్రి ఉంటే స్వామీజీలు మరింతగా చొరవ తీసుకుంటారు. యడ్యూరప్పకు స్వామీజీలన్నా, మఠాలన్నా ఎనలేని గౌరవం భక్తి. వారి మాటలను జవదాట రంటారు. నామినేషన్ వేయాలన్నా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్నా యడ్యూరప్ప స్వామీజీ సలహాలు, సూచనలు తీసుకోనిదే ముందుకు అడుగు వేయరు. అలాంటి స్వామీజీలపైనే యడ్యూరప్ప కోప్పడ్డారంటే ఎంత ఫ్రస్ట్రేషన్ కు లోనయ్యారో అర్థం చేసుకోవచ్చు.

మంత్రి వర్గంలో చోటు కోసం….

ఉప ఎన్నికలు జరిగి నెలన్నర గడుస్తున్నా కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. దీనిపై ఎందరో ఆశలు పెట్టుకున్నారు. తాను అధికారంలోకి రావడానికి సహకరించిన పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని యడ్యూరప్ప నిర్ణయించుకున్నారు. అధిష్టానాన్ని కూడా ఒప్పించగలిగారు. నేడో, రేపో దీనిపై స్పష్టత వస్తుంది. అయితే కొంత మంది ఆశావహులు స్వామీజీలు, మఠాల నుంచి మంత్రి పదవుల కోసం సిఫార్సులు చేయించుకుంటున్నారు. ఇది ఎంతదాకా వెళ్లిందంటే బహిరంగ సభలోనే స్వామీజీలు మంత్రి పదవి వారికి ఇవ్వాలంటూ ప్రకటన చేసేంతవరకూ.

యడ్డీ ఫ్రస్టేషన్…..

దావణగెరె జిల్లాలోని హరిహరలో ఒక బహిరంగ సభలో యడ్యూరప్పతో పాటు వచనానంద స్వామీజీ పంచమశాలి పాల్గొన్నారు. సభలో స్వామీజీ మాట్లాడుతూ మురుగేష్ నిరాణీకి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. లేకుంటే వీరశైవ పంచమశాలి వర్గం దూరం కాబోతుందని హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన యడ్యూరప్ప స్వామీజీ అని చూడకుండా తనకేం భయం లేదన్నారు. ఇలా బహిరంగసభలపై బెదిరింపు ధోరణి తగదని ఇటు స్వామీజీలకు, అటు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపారు. రాష్ట్రాభివృద్ధి కోసం సలహాలు ఇవ్వాలి తప్పించి ఇలా మంత్రి పదవుల కోసం సిఫార్సులు చేయడమేంటని ప్రశ్నించారు. నిజమే.. యడ్యూరప్ప చెప్పింది కూడా కరెక్టే కదా. స్వామీజీలు వారి పరిధి దాటి మాట్లాడితే ఫ్రస్టేషన్ కాక మరేమొస్తుంది.

Tags:    

Similar News