హస్తిన లో అప్పకు అభయం దొరికినట్లేనా

కర్ణాటక మంత్రి వర్గ విస్తరణకు రెడీ అవుతుంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప హస్తిన పర్యటనలో బిజీగా గడిపారు. పార్టీ అగ్రనేతలను కలిసిన యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణపై గ్రీన్ [more]

Update: 2020-01-31 16:30 GMT

కర్ణాటక మంత్రి వర్గ విస్తరణకు రెడీ అవుతుంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప హస్తిన పర్యటనలో బిజీగా గడిపారు. పార్టీ అగ్రనేతలను కలిసిన యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణపై గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిసింది. కర్ణాటక ఉప ఎన్నికలు జరిగి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. సీఏఏ తీర్మానం, ఢిల్లీ శాసనసభ ఎన్నికల దృష్ట్యా అధిష్టానం యడ్యూరప్పకు అపాయింట్ మెంట్ ఇంతవరకూ ఇవ్వలేదు. దీంతో మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది.

ఢిల్లీ పర్యటనలో…..

యడ్యూరప్ప దావోస్ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్ దొరకలేదు. మొత్తం మీద పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో యడ్యూరప్ప సమావేశమై మంత్రి వర్గ విస్తరణపై చర్చించారు. అయితే ఈ విడత మంత్రి వర్గ విస్తరణలో కేవలం 11 మందికే అవకాశం ఇవ్వాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పదకొండు మందిలో ఆరుగురు అనర్హత వేటు పడి ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారని చెబుతున్నారు. మిగిలిన వారు బీజేపీ సీనియర్ నేతలకు చోటు కల్పించనున్నారు.

ఇచ్చిన మాటకు….

అయితే యడ్యూరప్ప మాత్రం తన ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన వారికి మంత్రిపదవులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. లేకుంటే ఇచ్చిన మాటకు విలువ ఉండదని ఆయన గట్టిగానే అధిష్టానం పెద్దల ఎదుట వాదించినట్లు తెలుస్తోంది. దీంతో కొంత అధిష్టానం ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఇందుకోసం యడ్యూరప్ప అధిష్టానానికి మరొక సూచన చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తొలి విడతలో అందరికీ స్థానం కల్పించలేమని, విడతలుగా విస్తరణ చేయాలని మాత్రం నిర్ణయించారు.

కొందరికి ఉద్వాసన….

దీనికితోడు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరికి ఉద్వాసన పలకాలని కూడా యడ్యూరప్ప అధిష్టానం ఎదుట ప్రతిపాదన ఉంచినట్లు చెబుతున్నారు. దీనిపై రాష్ట్ర పార్టీ నాయకత్వంతో కూడా మాట్లాడవలసి ఉంటుందని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. సీనియర్లకు అవశామివ్వాలంటే కొందరు త్యాగం చేయక తప్పదని కూడా యడ్యూరప్ప హైకమాండ్ తో చెప్పినట్లు తెలిసింది. వారిని ఒప్పించే బాధ్యతను కూడా రాష్ట్ర,కేంద్ర నాయకత్వమే చూసుకోవాలని షరతు కూడా విధించినట్లు టాక్ నడుస్తుంది. మొత్తం మీద యడ్యూరప్ప హస్తిన పర్యటనలో అధిష్టానం నుంచి అభయం లభించినట్లేనని అంటున్నారు. అయితే యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లిన వెంటనే ఆశావహులు కూడా కేంద్రం పెద్దల వద్దకు క్యూకట్టారు.

Tags:    

Similar News