ముసలం మొదలయిందా?
కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ జరగక ముందే ముసలం మొదలయింది. సుదీర్ఘ కాలం వేచిచూసిన తర్వాత అధిష్టానం యడ్యూరప్పకు మంత్రివిస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. [more]
కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ జరగక ముందే ముసలం మొదలయింది. సుదీర్ఘ కాలం వేచిచూసిన తర్వాత అధిష్టానం యడ్యూరప్పకు మంత్రివిస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. [more]
కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ జరగక ముందే ముసలం మొదలయింది. సుదీర్ఘ కాలం వేచిచూసిన తర్వాత అధిష్టానం యడ్యూరప్పకు మంత్రివిస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణలో కొందరికి చోటు దక్కే అవకాశం లేకపోవడంతో అప్పుడే అసంతృప్తులు మొదలయ్యాయి. ఉప ఎన్నికల్లో గెలవలేని వారికి మంత్రి పదవులు ఇచ్చేది లేదని యడ్యూరప్ప స్పష‌్టం చేయడంతో కొందరు నేతలు బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
మూకుమ్మడి రాజీనామాలతో……
పదిహేడు మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేయడంతోనే యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటయింది. వీరిలో పదిహేను మందిపై అనర్హత వేటు కూడా పడింది. సుప్రీంకోర్టును ఆశ్రయించి, దాదాపు మూడు నెలలు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సంపాదించారు. ఈ ఉప ఎన్నికల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే వారిద్దరినీ కేబినెట్ లోకి చేర్చుకోవడం లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు.
ఓటమి పాలయిన వారికి…..
ఉప ఎన్నికల్లో ఎంబీటీ నాగరాజు, విశ్వనాధ్ లు ఓటమి పాలయ్యారు. అయితే వీరిద్దరికీ మంత్రి పదవులు ఇస్తానని యడ్యూరప్ప గతంలో చెప్పారు. అయితే అధిష్టానంతో చర్చల అనంతరం వీరిద్దరికీ పదవులు ఇచ్చేది లేదని స్పష్టమయింది. తాను హోస్ కోట్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి రెబల్ గా పోటీ చేసిన శరత్ బచ్చేగౌడ వల్లనే ఓటమిపాలయ్యానని, ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎంబీటీ నాగరాజ్ తీవ్రంగా స్పందించారు.
అసంతృప్తిని వెళ్లగక్కుతూ…..
అలాగే మరోనేత విశ్వనాధ్ కూడా తన తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. హామీ ఇచ్చేటప్పుడు యడ్యూరప్పకు సుప్రీంకోర్టు తీర్పు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు మహేశ్ కుమటహళ్లికి కూడా ఛాన్స్ లేదనే వార్తలు రావడంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గెలిచిన 12 మందిలో పది మందికి మాత్రమే మంత్రివర్గంలో ఛాన్స్ ఉండనుంది. అలాగే బీజేపీ సీనియర్ నేతలు ముగ్గురికి అవకాశం ఇవ్వనున్నారు. దీంతో విస్తరణకు ముందే బీజేపీలో ముసలం పుట్టినట్లయింది. విస్తరణ తర్వాత మరెంత మంది తమ అసంతృప్తిని వెళ్లగక్కుతారో చూడాల్సి ఉంది.