వారికే ఛాన్స్…వీరికి మాత్రం?

ఎంతైనా యడ్యూరప్ప డీసెంట్ అండ్ డైనమిక్ లీడర్. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. తాను అనుకున్నది సాధించారు. అధిష్టానాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప [more]

Update: 2020-02-06 17:30 GMT

ఎంతైనా యడ్యూరప్ప డీసెంట్ అండ్ డైనమిక్ లీడర్. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. తాను అనుకున్నది సాధించారు. అధిష్టానాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప బాధ్యతలను చేపట్టిన చాలా కాలం తర్వాత తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. మంత్రి వర్గ విస్తరణ విషయంలో అనేక ప్రచారాలు జరిగాయి. వదంతులు వ్యాప్తి చెందాయి. యడ్యూరప్ప పని అయిపోయినట్లేనని కొందరు వ్యాఖ్యానించారు కూడా.

జరిగిన ప్రచారం అంతా….

ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నుంచి యడ్యూరప్పకు సహాయ సహకారాలు అందడం లేదని, యడ్యూరప్ప పై కేంద్ర నాయకత్వం నిఘా పెట్టిందని కూడా వార్తలు వచ్చాయి. ఒకరకంగా యడ్యూరప్పను కట్టడి చేయడానికి తొలినాళ్లలో కొంత కేంద్ర నాయకత్వం ప్రయత్నించిందనే చెప్పాలి. అయితే మహారాష్ట్ర పరిణామాల తర్వాత అధిష్టానం సయితం యడ్యూరప్ప విష‍యంలో ఆచితూచి అడుగులు వేసిందంటున్నారు.

అపాయింట్ మెంట్ కూడా…..

యడ్యూరప్పకు దాదాపు నెలన్నర పాటు అధిష్టానం పెద్దలు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో జరుగుతున్న ప్రచారం నిజమేననుకోవాల్సి వచ్చింది. అయితే చివరకు యడ్యూరప్ప సక్సెస్ అయ్యారు. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని మరోసారి యడ్యూరప్ప రుజువు చేసుకున్నారు. కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ జరిగింది. అయితే ఇందులో కేవలం పదిమంది మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

సీనియర్లను పక్కన పెట్టి…..

ఈ పది మంది కూడా రాజీనామాలు చేసి, అనర్హత వేటు పడి ఉప ఎన్నికల్లో తిరిగి గెలిచిన వారే కావడం గమనార్హం. ఉప ఎన్నికల ప్రచారంలోనూ అధిష్టానంతో సంబంధం లేకుండా యడ్యూరప్ప వీరిని గెలిపిస్తే మంత్రులను చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే పట్టుబట్టి మరీ వారికి పదవులు ఇప్పించుకున్నారు. బీజేపీకి చెందిన సీనియర్ నేతలను సయితం పక్కన పెట్టి ఈ విస్తరణలో తాను మాట ఇచ్చిన వారికే పదవులు ఇచ్చారు. ముగ్గురు బీజేపీ సీనియర్ నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని తొలుత నిర్ణయించినా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. మొత్తం మీద పార్టీ మారి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని, పార్టీని నమ్మకున్న వాళ్లను పక్కన పెట్టారన్న విమర్శలు మాత్రం విస్తరణ వెంటనే వెలువడ్డాయి.

Tags:    

Similar News