విడిచిపెట్టడం లేదుగా… దిగిందాకా?

ఉప ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరోసాని ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని సూచిస్తుండటం ఆయనకు ఇబ్బందికరంగా [more]

Update: 2020-10-27 18:29 GMT

ఉప ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరోసాని ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని సూచిస్తుండటం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. కర్ణాటకలో రెండు శాసనసభ స్థానలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు యడ్యూరప్పకే కాదు పార్టీకి కూడా చిక్కుల్లో పడేశాయి. గతకొంత కాలం నుంచి యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేతల నుంచే డిమాండ్ విన్పిస్తుంది.

ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నా…..

అయితే ఎప్పటికప్పుడు యడ్యూరప్ప దీన్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. యడ్యూరప్పను తప్పించాలని, మరొకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ కేంద్ర నాయకత్వానికి బీజేపీలోని యడ్యూరప్ప వ్యతిరేక వర్గం ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉంది. ముఖ్యంగా అమిత్ షా జాతీయ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఈ డిమాండ్ మరింత ఊపందుకుంది. అయితే ఇప్పటికిప్పుడు యడ్యూరప్పను తప్పిస్తే సంక్షోభం తప్పదని గుర్తించిన అధిష్టానం ఆ దిశగా ఎటువంటి చర్యలకు దిగలేదు.

తాజా వ్యాఖ్యలతో…..

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. యడ్యూరప్ప ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేరని, ఆయన మార్పు తధ్యమని బసవగౌడ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇది ఆయనకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ప్రకటనలే చేశారు. అయినా అధిష్టానం ఆయనపై ఎటువంటి చర్యలకు దిగకపోవడంతోనే తరచూ యడ్యూరప్పపై కాలుదువ్వుతున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

ఉత్తర కర్ణాటక నేతకు…..

యడ్యూరప్పపై జాతీయ నాయకత్వం కూడా అసంతృప్తిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆయన తన నియోజకవర్గానికి రావాల్సిన నిధులను విడుదల చేయకపోవడంతోనే యడ్యూరప్ప పై ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర కర్ణాటక నేతకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలో బీజేపీకి వందమంది వరకూ ఎమ్మెల్యలేలు ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో కేవలం 30 మంది మాత్రమే ఉన్నారు. దీంతో బసవగౌడ ఉత్తర కర్ణాటక నినాదాన్ని అందుకుని యడ్యూరప్పను ఇరకాటంలో పడేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News