యడ్డీ అల్టిమేటమ్.. టచ్ చేసి చూడండంటున్నారే?

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయంతో యడ్యూరప్పలో ధీమా పెరిగింది. తానే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రినని ఆయన స్పష్టం చేసి అధినాయకత్వానికి పరోక్షంగా సంకేతాలు పంపారు. తన [more]

Update: 2021-01-09 16:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయంతో యడ్యూరప్పలో ధీమా పెరిగింది. తానే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రినని ఆయన స్పష్టం చేసి అధినాయకత్వానికి పరోక్షంగా సంకేతాలు పంపారు. తన పదవిని ముట్టుకుంటే బీజేపీ సీఎం అభ్యర్థి ఉండరని ఆయన మాటల్లో ధ్వనించింది. తన పట్ల నాయకుల్లో మాత్రమే కాదు ప్రజల్లో కూడా విశ్వాసం ఉందని చెప్పడానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే కారణమని ఆయన చెబుతున్నారు.

కొత్త నేత వస్తారని…..

యడ్యూరప్ప స్థానంలో కొత్త నేత వస్తారన్న ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువగా విన్పించింది. త్వరలోనే దీనిపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, యడ్యూరప్ప కు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించారని వార్తలు వచ్చాయి. అయితే తనకు ఫిబ్రవరి నెల వరకూ సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. తన పుట్టినరోజు సమయం వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని యడ్యూరప్ప అధినాయకత్వానికి అప్పీల్ చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

రెండున్నరేళ్లు తానేనంటూ…..

అయితే ఈ ప్రచారాన్ని యడ్యూరప్ప కొట్టిపారేస్తున్నారు. తనకు సన్నిహితులైన మంత్రులతో సమావేశమైన ఆయన రెండున్నరేళ్లు పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం మరోసారి చర్చకు దారితీసింది. ఒకవైపు అధినాయకత్వం యడ్యూరప్పపై ఆరోపణల దృష్ట్యా పక్కకు తప్పుకోవాలని సూచించింది. హైకోర్టు తీర్పుపై హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై యడ్యూరప్ప సుప్రీంకోర్టులను ఆశ్రయించనున్నారు.

అవసరమైతే….?

దీంతో పాటు యడ్యూరప్ప తనను కాదని బీజేపీ హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకోలేదని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా ఉంటే జనతాదళ్ ఎస్ మద్దతును తీసుకునేందుకు కూడా రెడీ గా ఉన్నారు. జేడీఎస్ కూడా యడ్యూరప్పకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉందని యడ్యూరప్ప వర్గం ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. దీంతో యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం అంత సులువు కాదంటున్నారు.

Tags:    

Similar News