గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లేనా?

ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆశించిన మంత్రి వర్గ విస్తరణ ఇప్పటి వరకూ జరగలేదు. ఆయన గత కొన్ని నెలలుగా మంత్రి వర్గ విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అధిష్టానం [more]

Update: 2021-01-10 17:30 GMT

ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆశించిన మంత్రి వర్గ విస్తరణ ఇప్పటి వరకూ జరగలేదు. ఆయన గత కొన్ని నెలలుగా మంత్రి వర్గ విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. యడ్యూరప్ప విస్తరణలో ఎంపిక చేసుకున్న జాబితాయే ఈ అవరోధాలకు కారణమన్నది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి ఇప్పటికే పెద్ద పీట వేసిన యడ్యూరప్ప మరికొందరు మాజీ కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు.

ఒకవర్గం మాత్రం…..

కానీ బీజేపీలో ఒక వర్గం యడ్యూరప్ప నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. యడ్యూరప్పకు వ్యతిరేకంగా సమావేశాలను పెట్టి మరీ అధినాయకత్వానికి యడ్యూరప్ప పై ఫిర్యాదు చేశారు. తొలి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా కొత్త వారికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే పార్టీ బలోపేతం కాదని యడ్యూరప్ప మొహం మీదే కొందరు నేతలు చెప్పారు. అయినా యడ్యూరప్ప తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

విస్తరణకు ఓకే…..

దీంతో అధిష్టానం కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. రాజ్యసభ సభ్యుల ఎంపికలో కూడా అధిష్టానమే నిర్ణయం తీసుకోవడంతో ఇక అంతా యడ్యూరప్ప పని అయపోయినట్లే అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యడ్యూరప్పకు మంత్రి వర్గ విస్తరణకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన మంత్రి వర్గ విస్తరణను చేపడతారని ఆయన వర్గీయులు అంటున్నారు.

పరిశీలన తర్వాతే…..

భారతీయ జనతా పార్టీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడం వల్లనే యడ్యూరప్ప బలం కేంద్ర నాయకత్వం వద్ద పెరిగిందంటున్నారు. పంచాయతీ ఎన్నికలలో 60 శాతం స్థానాలను గెలుచుకున్నామని యడ్యూరప్ప ఇప్పటికే అధినాయకత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు మంత్రి వర్గ విస్తరణకు కేంద్రనాయకత్వం ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే జాబితాను కేంద్ర కార్యాలయానికి పంపాలని కోరినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News