మొదలయింది… సంకేతాలు ఇవేనా?

మోదీ ప్రభావం కర్ణాటకపై కూడా పడింది. అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీకి దారుణమైన ఎదురు దెబ్బతగిలింది. పది నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఏడింటిలో కాంగ్రెస్ జెండా [more]

Update: 2021-05-13 17:30 GMT

మోదీ ప్రభావం కర్ణాటకపై కూడా పడింది. అక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీకి దారుణమైన ఎదురు దెబ్బతగిలింది. పది నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఏడింటిలో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. దేశ వ్యాప్తంగా బీజేపీపై ఉన్న వ్యతిరేకత, బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు బీజేపీ పరాజయానికి కారణాలుగా చెబుతున్నారు. కరోనాను నియంత్రించ లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం పై వ్యతిరేకత వెరసి కన్నడనాట బీజేపీకి ఎదురుదెబ్బతగిలిందనే చెప్పాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…..

కర్ణాటకలో ఇటీవల పది నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. పంచాయతీ, మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. ఇందులో అత్యధిక భాగం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న శివమొగ్గ జిల్లాలోని భద్రావతిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయగలిగింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ప్రజల్లో వ్యతిరేకత….

అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాలను గద్దె దించి, ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుని అధికారంలోకి వచ్చిన యడ్యూరప్ప ప్రజాగ్రహం చవిచూడాల్సి వచ్చింది. ఆయన కొంత కాలంగా సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ప్రజలు కూడా చెంప చెళ్లుమనే తీర్పు ఇచ్చారు. బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి సొంత జిల్లా బళ్లారిలోనే కాంగ్రెస్ పాగా వేయగలిగింది.

కాంగ్రెస్ లో ఉత్సాహం…..

నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలు సంకేతంగా భావించాలని సీనియర్ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ప్రజల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన వ్యతిరేకత ఉందనడానికి ఇదే నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఘోర పరాజయంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి స్థానానికి ఎసరు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News