ఆ పదవి అచ్చొచ్చినట్లు లేదే?

యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి అచ్చిరాలేదనే చెప్పాలి. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అర్థాంతరంగా దిగిపోయారు. మరోసారి యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పేట్లు లేదు. దీంతో [more]

Update: 2021-07-22 16:30 GMT

యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి అచ్చిరాలేదనే చెప్పాలి. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అర్థాంతరంగా దిగిపోయారు. మరోసారి యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పేట్లు లేదు. దీంతో ఐదు సార్లు తాను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి మధ్యలోనే యడ్యూరప్ప దిగిపోవాల్సి వస్తుంది. యడ్యూరప్ప మరికొద్దిరోజుల్లోనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఈయన కంటే దురదృష్టవంతుడు మరొకరు ఉండరు.

అనేకసార్లు అంతే…?

కర్ణాటక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ పందొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే పూర్తికాలం కర్ణాటకలో ముఖ్యమంత్రిగా కొనసాగింది కొద్ది మంది మాత్రమే. చివరిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. యడ్యూరప్ప మాత్రం అధికారం చేపట్టిన ప్రతిసారీ ఏదో ఒక అవినీతి ఆరోపణలు రావడం, పదవి నుంచి దిగిపోవడం సాధారణంగా మారింది. యడ్యూరప్ప పూర్తికాలం ఎప్పుడూ ముఖ్యమంత్రిగా కొనసాగలేకపోయారు.

పార్టీ అధికారంలోకి రావడానికి…

నిజానికి భారతీయ జనతా పార్టీ జెండాను దక్షిణాదిన నిలిపింది యడ్యూరప్ప మాత్రమే. ఆయన సామాజికవర్గం పరంగా బలమైన నేత కావడంతో ఇక్కడ బీజేపీ తన ఉనికిని చాటుకోగలిగింది. 2006లోనూ బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా అప్పట్లో జేడీఎస్ మద్దతు వెనక్కు తీసుకోవడంతో యడ్యూరప్ప ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. మరోసారి ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. 2018 ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద మెజారిటీ రావడంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి బలం లేక ఐదు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది.

మరోసారి రాజీనామా చేస్తే?

ఇప్పుడు తాజాగా యడ్యూరప్ప మరోసారి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆరోగ్యం సరిగా లేకపోవడం, పార్టీ నుంచి వత్తిడులు రావడంతో ఆయన పదవి నుంచి తప్పుకోవడం అనివార్యమైంది. యడ్యూరప్ప కుమారుల జోక్యం, వారి పై అవినీతి ఆరోపణలు రావడం, యడ్యూరప్పకు 70 ఏళ్లు దాటడంతో రాజీనామా చేయాలని హైకమాండ్ కోరింది. దీనికి యడ్యూరప్ప కూడా సిద్దమయ్యారు. అయితే తమ కుమారులకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ భాగస్వామ్యులను చేయాలని షరతు విధించారు. మొత్తం మీద యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా పూర్తికాలం ఎప్పుడూ కొనసాగలేకపోయారు.

Tags:    

Similar News