ఆయనే దిగిపోయాక..వీళ్ల మొహం ఎవరు చూస్తారు?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రి వస్తారు. అయితే ఇప్పుడు టెన్షన్ అంతా యడ్యూరప్పను నమ్ముకుని వచ్చిన వాళ్లదే. కర్ణాటక బీజేపీలో [more]

Update: 2021-07-27 16:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రి వస్తారు. అయితే ఇప్పుడు టెన్షన్ అంతా యడ్యూరప్పను నమ్ముకుని వచ్చిన వాళ్లదే. కర్ణాటక బీజేపీలో యడ్యూరప్ప శకం ముగిసింది. యడ్యూరప్ప రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే. దీంతో కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీలో వచ్చి చేరిన నేతల పరిస్థితి డోలాయమానంలో పడింది. యడ్యూరప్ప మాదిరి కొత్త ముఖ్యమంత్రి తమకు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉండదన్న ఆందోళన వారిలో నెలకొంది.

సంకీర్ణ సర్కార్ కూలిపోవడానికి….

జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ సర్కార్ కూలిపోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలే కారణం. వారి రాజీనామాలు ఆమోదం పొంది తిరిగి వారికే బీజేపీ టిక్కెట్లు ఇప్పించి గెలిపించుకోగలిగారు యడ్యూరప్ప. వారిలో కొందరికి మంత్రి పదవులను కూడా ఇచ్చారు. యడ్యూరప్ప ఇప్పుడు రాజీనామా చేయడంతో వారి భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీలో తమ భవిష్యత్ ఏంటన్న ఆందోళనలో ఉన్నారు.

పథ్నాలుగు మంది వరకూ….

దాదాపు పథ్నాలుగు మంది కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరిన నేతలకు బెంగ పట్టుకుంది. వారికి యడ్యూరప్పే అధిష్టానం. వారికి బీజేపీ పెద్దలతోనూ పెద్దగా పరిచయాలు లేవు. పార్టీతో అనుబంధం కూడా లేదు. దీంతో కొత్త ముఖ్యమంత్రి వీరికి ప్రయారిటీ ఇవ్వడంపై అనుమానాలు సహజంగానే కొనసాగుతాయి. అయితే అందరినీ కలుపుకుని పోయే విధంగా చూడాలని, తనను నమ్మి వచ్చిన వారికి ప్రాధాన్యత తగ్గించవద్దని ముందుగానే యడ్యూరప్ప అధినాయకత్వానికి షరతు విధించారు.

ఇక వీరికి సినిమాయే….

కాంగ్రెస్ లో ఉంటే ఆ పరిస్థితి వేరు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి దేశ వ్యాప్తంగా కూడా సరిగా లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కర్ణాటకలోనూ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు. దీంతో యడ్యూరప్పను నమ్ముకుని వచ్చిన వారు భవిష్యత్ లో ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర బీజేపీ పార్టీకి పనిచేసిన వారికే గుర్తింపు ఇస్తూ వస్తుంది. యడ్యూరప్ప దిగిపోయిన తర్వాత వీళ్ల మొహం చూసే దిక్కు కూడాలేదంటున్నారు. అయితే యడ్యూరప్ప తన స్థానంలో బసవరాజు బొమ్మై ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో కొంతలో కొంత ఊరట అని చెప్పాలి.

Tags:    

Similar News