యోగీ ఫిట్ కాలేదా?

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనపై పార్టీ అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారన్న టాక్ ఇటు పార్టీలోనూ విన్పిస్తుంది. [more]

Update: 2020-07-15 18:29 GMT

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనపై పార్టీ అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోతున్నారన్న టాక్ ఇటు పార్టీలోనూ విన్పిస్తుంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యానాధ్ వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఎలా విజయం సాధించి పెడతారన్న అనుమానాలు పార్టీ అగ్రనేతలకే కలుగుతున్నాయి. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే.

మరో రెండేళ్లలో…..

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో జరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 300 పైగా స్థానాలను సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న యోగి ఆదిత్యానాధ్ ను అనూహ్యంగా తెచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అయితే తొలినాళ్లలో కొంత దూకుడుగా కన్పించిన యోగి ఆదిత్యానాధ్ గడచిన ఏడాది కాలంగా ఆయన పాలనలో తప్పటడుగులు వేస్తున్నట్లే కన్పిస్తుంది.

అనూహ్యంగా వచ్చి…..

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ పార్టీకి విజయం సాధించిపెట్టలేకపోయారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పార్టీ విజయానికి మోదీ ఇమేజ్ కారణమని చెప్పక తప్పదు. అప్పటికీ గతంలో కంటే పది స్థానాలు బీజేపీ ఖాతాలో నుంచి తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం యోగి ఆదిత్యానాధ్ పాలన కారణమన్నది పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం. కరోనా సమయంలోనూ యోగి ఆదిత్యానాధ్ తీసుకున్న చర్యలపై కూడా విమర్శలు విన్పిస్తున్నాయి.

శాంతిభద్రతల విషయంలో….

ఇక తాజాగా ఘటనలతో యోగి ఆదిత్యానాధ్ మరింత చిక్కుల్లో పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలు దిగజారాయి. కరడు గట్టిన నేరగాడు వికాస్ దుబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చీనీయాంశమైంది. దేశంలోనే ఉత్తర్ ప్రదేశ్ హత్యల్లో అగ్రస్థానంలో ఉందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. రోజుకు యూపీలో 12 హత్యలు జరుగుతున్నాయని ఆమె యోగి ఆదిత్యానాధ్ పాలనను ఎండగడుతున్నారు. మరి ఈ కాషాయ సన్యాసి రానున్న ఎన్నికల్లో పార్టీని ఎలా విజయాల వైపు తీసుకెళతారో చూడాలి.

Tags:    

Similar News