మ్యానిఫేస్టోతోనే మ్యాజిక్….???

పేజీలకు పేజీలు కాదు. ప్రతి కులానికి ప్రత్యేక హామీలు లేవు. కేవలం నాలుగు పేజీల మేనిఫెస్టో తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్సార్ [more]

Update: 2019-04-06 13:30 GMT

పేజీలకు పేజీలు కాదు. ప్రతి కులానికి ప్రత్యేక హామీలు లేవు. కేవలం నాలుగు పేజీల మేనిఫెస్టో తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. అయన ముందు నుంచి చెబుతున్నట్లుగానే తక్కువ హామీలతో అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో రూపొందించారు. 20 నెల్ల క్రితమే అయన చెప్పిన నవరత్నాలకి మానిఫెస్టోలో పెద్దపీట వేశారు. పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను కూడా మానిఫెస్టోలో చేర్చారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలను, రైతులను, మహిళలను, యువతను ఆకట్టుకునేలా జగన్ హామీలు ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల చాల ఆలస్యమైనా ఇప్పటికే చాలా హామీలను వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. కొత్తగా కొన్ని హామీలనే మానిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి వస్తే కచ్చితంగా మేనిఫెస్టోలోని అన్ని హామీలు అమలు చేసే తర్వాతి ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని జగన్ ప్రకటించారు.

యువతను ఆకట్టుకునేలా..

మధ్యతరగతి ప్రజలను, ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారిని ఆకట్టుకునేలా రెండు ప్రధాన హామీలు ఇచ్చారు. వాటిల్లో ఒకటి ఏడాదికి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి యూనివర్సల్ హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆర్ధికంగా బాగా ఇబ్బంది పడతారు. పిల్లల చదువుల విషయంలోనూ వారు ఆర్ధికంగా సమస్యను ఎదుర్కుంటారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు తగ్గిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇది వారిని ఆకర్షించవచ్చు. ఇక, యువతను ఆకర్షించేందుకు జగన్ ఉద్యోగాల విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు ఇస్తామన్నారు. గ్రామా సచివాలయం ద్వారా గ్రామం లోని 10 మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో 75 శాతం లోకల్ రిజర్వేషన్స్ ఇస్తామని ఇచ్చిన హామీ కూడా యువతకు నచ్చేదే.

చంద్రబాబు పథకాలకు కౌంటర్….

ఇక, చంద్రబాబు ఇప్పటికే అమలులోకి తెచ్చిన పథకాలకు కౌంటర్గా కూడా జగన్ పలు హామీలు ఇచ్చారు. వాస్తవానికి ఇవి జగన్ ముందే నవరత్నాల్లో ప్రకటించారు. రైతులను ఆదుకునేందుకు జగన్ మంచి హామీలు ఇచ్చారనే అభిప్రాయంతో వ్యక్తం అవుతుంది. ఏడాదికి 12,500 పెట్టుబడి సహాయం, ఉచితంగా బోర్లు వేయిస్తామని, పంట వేసే ముందే గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తామని జగన్ చెప్పారు. ఇవి అమలులోకి వస్తే వారికీ బాగా మేలు చేసే అవకాశం ఉంది. చంద్రబాబు ఇటీవల అన్నదాత సుఖీభవ పథకానికి ఇవి కౌంటర్ గా చెప్పవచ్చు. మహిళల కోసం కూడా జగన్ పలు హామీలు ఇచ్చారు. కాపులకు సైతం ఏడాదికి 2,000 చొప్పున కేటాయిస్తామని జగన్ చెప్పారు. కాపుల ఓట్లు కీలకమైన నేపథ్యంలో జగన్ హామీకి వారు సంతోషిస్తారో లేదో చూడాలి. అగ్రవర్ణ పేదలకు కూడా జగన్ పలు హామీలు ఇచ్చారు. మొత్తానికి తూతూమంత్రంగా కాకుండా బాగా స్టడీ చేసి మేనిఫెస్టో రూపొందించినట్లు కనిపిస్తోంది. మరి ఈ హామీలు ఈమేరకు ఫలిస్తాయో, ఓట్లు రాలుస్తాయో చూడాలి.

Tags:    

Similar News