జగన్ కి అంత ప్రేమా?
ఈ రోజుకు కూడా జగన్ మీద గట్టిగానే రాతలు రాస్తున్న పత్రిక ఈనాడు అని అంతా చెబుతారు. ఆ మాటకు వస్తే జగన్ ఆ రెండు పత్రికలు [more]
ఈ రోజుకు కూడా జగన్ మీద గట్టిగానే రాతలు రాస్తున్న పత్రిక ఈనాడు అని అంతా చెబుతారు. ఆ మాటకు వస్తే జగన్ ఆ రెండు పత్రికలు [more]
ఈ రోజుకు కూడా జగన్ మీద గట్టిగానే రాతలు రాస్తున్న పత్రిక ఈనాడు అని అంతా చెబుతారు. ఆ మాటకు వస్తే జగన్ ఆ రెండు పత్రికలు అంటూ నిత్యం ఈనాడు పేరునే ఎక్కువగా వల్లిస్తారు. ఇక జగన్ పదేళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా మెచ్చుకోలు మాటలను రాసిన చరిత్ర ఈనాడుకు లేదని కూడా వైసీపీ నేతలు గట్టిగానే చెబుతారు. ఇక వైఎస్సార్ హయాంలో ఆయన పాదయాత్రకు కొంతలో కొంత కవరేజి ఈనాడు ఇచ్చిందేమో కానీ జగన్ విషయంలో కనీసం పట్టించుకోలేదు. పైగా ఎక్కడ నెగిటివ్ ఉందా అని బూతద్దంలో వెతికి మరీ అచ్చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి ఇంతలా ఈనాడుతో జగన్ కి జన్మ వైరం ముడిపడిఉందని అంతా సులువుగానే చెప్పేస్తారు.
ఉండవల్లి ఆవేదన…..
ఇకపోతే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ ఫ్యామిలీకి ఎంత దగ్గరివాడో అందరికీ తెలిసిందే. అరుణ్ నువ్వు ఎంపీగా ఉండాల్సిందేనని వైఎస్సార్ పట్టుబట్టి మరీ నామినేషన్ వేయించిన సంగతి కూడా ఉండవల్లి పదే పదే చెబుతారు. ఇక మార్గదర్శి కేసు విషయంలో ఉండవల్లి తెర ముందు పోరడుతూంటే తెర వెనక అన్ని రకాలుగా సహాయ సహకారాలు వైఎస్సార్ అందించారని కూడా ప్రచారంలో ఉంది. లేకపోతే రామోజీరావు అనే మీడియా మొఘల్ ముందు ఉండవల్లి నిలిచి పోరాడే పరిస్థితి ఉండేదే కాదని కూడా అంతా ఒప్పుకుంటారు. ఇక వైఎస్సార్ చనిపోయాక మార్గదర్శి కేసు విషయంలో ఉండవల్లిది ఒంటరి పోరాటమే అయింది. ఈ కేసులో అన్ని ఆధారాలూ ఉన్నా ఏమీ కాలేదన్న బాధ మాత్రం ఉండవల్లికి మిగిలింది.
ఆయన గ్రేట్…..
ప్రపంచంలో ఈ తరహా కేసులో ఒక్క రామోజీ రావు తప్ప ఎవరూ కూడా జైలు శిక్ష నుంచి తప్పించుని బయటపడిన దాఖలాలు లేవు అని ఉండవల్లి గట్టిగానే అంటున్నారు. దీనికి ఆయన పలుకుబడి ఒక కారణం అయితే పెద్దల రాజకీయ సహకారం మరో కారణం అని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. ఉమ్మడి ఏపీలో జరిగిన ఈ కేసులో రెండు తెలుగు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, ఇంప్లీడ్ కాకపోవడం వల్ల కేసు మరింత బలహీనమైందని కూడా ఆయన అంటున్నారు.
జగన్ కూడా …
ఉద్యమ నేతగా ఉన్నపుడు కేసీఆర్ వేయి నాగళ్ళతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నేస్తాను అని భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. అనుకున్నట్లుగా అధికారంలోకి వచ్చారు కానీ ఏమీ చేయలేకపోయారు, పైగా స్నేహం చేస్తూ రామోజీరావుతో సాన్నిహిత్యం మరింత పెంచుకున్నారన్న ప్రచారమూ ఉంది. సరే కేసీఆర్ విషయంలో రామోజీరావుకు శత్రుత్వం ఏదీ పెద్దగా లేదు, కానీ వైఎస్సార్ ఫ్యామిలీ విషయంలో అలా కాదుగా, వైఎస్సార్, జగన్ ల మీద పనిగట్టుకుని మరీ రాసిన రాతలు ఎన్నో ఆయన పత్రికల్లో కనిపిస్తాయి. అలాంటిది రామోజీ కేసు విషయంలో జగన్ ఎందుకు ఉదాసీనంగా ఉన్నారో అర్ధం కాని పరిస్థితే.
ఆయనకూ శ్రీకృష్ణపరమాత్మేనా?
చంద్రబాబుకి శ్రీకృష్ణ పరమాత్మతో సమానమైన రామోజీరావు విషయంలో జగన్ ఎందుకు ఇలా ఉన్నారో అర్ధం కాలేదని స్వయంగా ఉండవల్లి అంటున్నారంటే ఇది ఆసక్తికరమైన పాయింటే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈనాడు భగవద్గీత అని ఆయనకు రామోజీ శ్రీకృష్ణపరమాత్మ అని ఉండవల్లి అన్నారు. కాబట్టి ఆయన మార్గదర్శి కేసులో ప్రభుత్వంగా ఇంప్లీడ్ అవుతారని అనుకోలేమని కానీ, జగన్ చేస్తారని అనుకున్నామన్నారు. ఒకవేళ జగన్ కూడా చేయకుంటే రామోజీ ఆయనకు శ్రీకృష్ణపరమాత్మ.. వేదవ్యాసుడు అవుతాడని.. దాని వల్ల తనకు వచ్చే నష్టమేమీ ఉండదని ఉండవల్లి అన్నారు. పెద్దల రాజకీయాల్లో రకరకాల ఒప్పందాలు జరుగుతుంటాయన్న ఉండవల్లి జగన్ రామోజీ బంధానికి కొత్త అర్ధం చెప్పారా? అది సాధ్యమేనా? నిజమేనా అన్న డౌట్లు కూడా పుట్టుకువస్తున్నాయి.