పులివెందులలోనే పరువు పోతుందా?

ఇది ఎన్నికల వ్యవహారామే కాదు, ప్రతిష్టతో ముడి పడి ఉంది. గెలవకపోతే ఇంతే సంగతులు అని చెప్పడానికి. ఇది నిజంగా అగ్ని పరీక్షగానే చూడాలి. వైఎస్సార్ ఫ్యామిలీకి [more]

Update: 2021-08-18 14:30 GMT

ఇది ఎన్నికల వ్యవహారామే కాదు, ప్రతిష్టతో ముడి పడి ఉంది. గెలవకపోతే ఇంతే సంగతులు అని చెప్పడానికి. ఇది నిజంగా అగ్ని పరీక్షగానే చూడాలి. వైఎస్సార్ ఫ్యామిలీకి గత నలభై మూడేళ్ళుగా కంచుకోటగా ఉన్నది పులివెందుల. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ లో అగ్ర నేతగా ఎదిగాక కడప జిల్లా కూడా ఆ ఫ్యామిలీకి కంచుకోటగా మారింది. జగన్ హయాం వచ్చేసరికి రాయలసీమ మొత్తం ఆయనకు జై కొడుతూ వస్తున్న సందర్భం ఉంది. అలాంటి కుటుంబానికి గుండె కాయ పులివెందుల. మరి ఆ పులివెందులలో ఒక తీవ్రమైన కేసు మీద ఇపుడు సీబీఐ విచారణ చేస్తోంది. రెండున్నర నెలలుగా అక్కడే తిష్ట వేసి మరీ సీబీఐ పెద్దలు కేసు లోతుల్లోకి వెళ్తున్నారు.

దారుణ హత్యకు గురైనా…?

ఈ కేసు కూడా ఎవరిదో కాదు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించినది. ఆయన ప్రజా నాయకుడు వైఎస్సార్ కి తమ్ముడు, ప్రస్తుత సీఎం జగన్ కి చిన్నాన్న. ఇంతటి కీలకమైన నాయకుడు తన సొంత ఇంట్లో రెండేళ్ళ క్రితం అతి దారుణంగా చనిపోయాడు. ఇదంతా గ‌త ఎన్నిక‌ల‌కు ముందే జ‌రిగింది. అప్ప‌టి అధికార పార్టీతో పాటు కొన్ని పార్టీలు సైతం దీనిని బేస్ చేసుకుని జ‌గ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమ‌ర్శలు చేశాయి. పులివెందులలో వివేకా ఎలా ? హత్య చేయబడ్డారు అన్నది ఈ రోజుకీ తెలియడంలేదు. నాడు చంద్రబాబు సర్కార్ అధికారంలో ఉంది. దాంతో బాబే ఈ హత్య చేయించారు అని వైసీపీ నేతలు ఆరోపించారు.

సీఎం అయ్యాక కూడా…?

ఆ తరువాత రెండు నెలలకే అధికారంలోకి జగన్ వచ్చారు. జగన్ సీఎం అయ్యాక కూడా సొంత చిన్నాన్న హత్య కేసు ఓ కొలిక్కి రాక‌పోవ‌డం ఒక విడ్డూరం అయితే ఇపుడు సీబీఐ విచారణ దూకుడు మీద సాగడం మరో విశేషం. ఈ కేసులో పూర్వపరాలు జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని చిక్కు ముడులను విప్పుకుంటూ సీబీఐ కధను క్లైమాక్స్ కి చేర్చే ప్రయత్నం చేస్తోంది అంటున్నారు. ఇక వైఎస్సార్ ఫ్యామిలీలో అతి ముఖ్యమైన పెద్దాయన వైఎస్ ప్రకాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచి విచారించడంతో రాజకీయంగా అతి పెద్ద కుటుంబం గురించి చర్చ అయితే వస్తోంది. పులివెందులలో వారికి ఎదురులేదు. ఆ కుటుంబం మీద మచ్చ కూడా లేదు.

విచారణ జరిగే సమయంలో….?

రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా సామాన్య జనాలకు వైఎస్ ఫ్యామిలీ అంటే దైవంతో సమానమే. పులివెందులలో వారి కుటుంబం నుంచి ఎవరిని పోటీ పెట్టినా కూడా గెలిపించడానికి ఇదే కారణం. ఈ హత్య ఎవరు చేశారు అన్నది తేలితే ఏ చిక్కూ ఉండదు. అలా కాకుండా సీబీఐ విచారణ అలా జరుగుతూ వైఎస్ ఫ్యామిలీని కూడా పిలుస్తూ జనాలలో కొంత అయోమయాన్ని సృష్టించేలా కధ సాగితే మాత్రం ఇబ్బందే. ఏది ఏమైనా జగన్ వైఎస్సార్ వారసుడు, పులివెందుల బిడ్డ. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, అన్నింటికీ మించి ముఖ్యమంత్రి. మరి ఈ కేసు త్వరితగతిన విచారణ జరిగి అసలైన నిందితులు బయటకు వస్తే వైఎస్సార్ ఫ్యామిలీ కూడా ఊపిరిపీల్చుకుంటుంది.

Tags:    

Similar News