జగన్ తలరాత మారుతుంది.. తస్మాత్ జాగ్రత్త
బషీర్ బాగ్ గుర్తుందిగా….. ఏమి జరిగిందో….. చంద్రబాబు తలరాత మార్చేసిన ఘటన….. విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ రోడ్డెక్కిన ఆందోళన కారుల మీద కాల్పులు జరపడంతో అప్పటి [more]
బషీర్ బాగ్ గుర్తుందిగా….. ఏమి జరిగిందో….. చంద్రబాబు తలరాత మార్చేసిన ఘటన….. విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ రోడ్డెక్కిన ఆందోళన కారుల మీద కాల్పులు జరపడంతో అప్పటి [more]
బషీర్ బాగ్ గుర్తుందిగా….. ఏమి జరిగిందో….. చంద్రబాబు తలరాత మార్చేసిన ఘటన….. విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ రోడ్డెక్కిన ఆందోళన కారుల మీద కాల్పులు జరపడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం మొదలైంది. ఇప్పుడు మళ్లీ విద్యుత్ ఛార్జీల భారాన్ని జనం మీదకి ఒక్కసారి నెట్టేశాయి పంపిణీ సంస్థలు. మార్చి రెండో వారం నుంచి జనాలు చాలా వరకు ఇళ్లకే పరిమితం అయ్యారు. 24నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైంది. మార్చి మొదటి వారంలో తీసిన రీడింగ్ తో స్పాట్ బిల్లింగ్ పంపిణీ కూడా జరిగిపోయింది. మార్చి 24 తర్వాత లాక్ డౌన్ అమల్లోకి రావడంతో పంపిణీ సంస్థలు స్పాట్ బిల్లింగ్ నిలిపివేశాయి.
ఇళ్లలోనే ఉండిపోవడంతో…
ఏప్రిల్ నెలలో కరోనా భయంతో మీటర్ రీడింగ్ నిలిపి వేసి మార్చి బిల్లులే చెల్లించాలని కోరాయి. ఇందులో చాలా వరకు బిల్లులు చెల్లించారు. ఏ పూటకు ఆ పూట తిండి వెదుక్కునే కూలీ జనం బిల్లులు కట్టలేక మిన్నకుండి పోయారు. దీంతో బిల్లులు చెల్లించాలని పంపిణీ సంస్థలు వినియోగదారులకు విజ్ఞప్తి చేశాయి.వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలు, కూలీ చేసుకుని బతికే వాళ్ళు అందరూ డబ్బులు లేక కట కటలాడుతున్నారు. ప్రభుత్వాలే దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారికి నగదు, రేషన్ పంపిణీ చేస్తున్నాయి. దాదాపు 50రోజులకు పైగా పనులు లేవు, డబ్బులు లేవు, ఇంటి అద్దెలు చెల్లించలేని నిస్సహాయ స్థితిని జనం ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేస్తే తమ చావేదో చస్తామనే పరిస్థితి సగటు జీవికి వచ్చేసింది.
దిక్కుమాలిన ఐడియాతో….
ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖ బాధ్యులకు ఓ దిక్కుమాలిన ఐడియా వచ్చింది. విద్యుత్ చార్జీలను పెంచి కొత్త స్లాబ్ లకు అనుగుణంగా బిల్లింగ్ చేయడం మొదలు పెట్టారు. ఏప్రిల్ లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి మొత్తం రెండు నెలలు వినియోగాన్ని లెక్కించి బిల్లులు వేయడం మొదలు పెట్టారు. ఇది తడిసి మోపెడు అవుతోంది. కొందరికి ఇంటి అద్దె కంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన ఉదంతాలు ఉన్నాయి. వేసవి పెరగడంతో మధ్య తరగతి ఇళ్లలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది మార్చి నెల వినియోగం, ఏప్రిల్ నెల వినియోగం కలిపి వేలల్లో బిల్లులు రావడం మొదలైంది. జనం దగ్గర డబ్బులు లేవని తెలిసి వాళ్ళకి ప్రభుత్వమే వేల కోట్ల రూపాయల సంక్షేమం అమలు చేస్తున్న సర్కారుకు అన్ని వర్గాల నడ్డి విరిచే బాదుడు గురించి మాత్రం జ్ఞప్తికి రాలేదు.
సలహా ఎవరిచ్చారో?
ఈ సలహా ఎవరిచ్చారో, ముఖ్యమంత్రి ఎందుకు ఆమోదం తెలిపారో బుర్ర బద్దలు కొట్టుకున్నా అంతు చిక్కదు. మద్యం వినియోగాన్ని నియంత్రించేందుకు ధరలు పెంచినట్టు విద్యుత్ వినియోగం మీద కూడా ఏదైనా స్కీం మొదలు పెట్టారేమో అని ఎగతాళి చేసే పరిస్థితి రాకూడదు. నిజంగా సీఎం జగన్ కు తెలియకుండా ఇలాంటి నిర్ణయం జరిగి ఉంటే అందుకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించి అది ప్రజలకు తెలిసేట్టు చేస్తే తప్ప జనం ఆగ్రహం చల్లారదు. జనం సర్దుకు పోతారులే అనుకోడాని ఇదేమి మద్యం ధరల పెంపు కాదు. ఏళ్ల తరబడి గుర్తుంచుకునే సమస్య అవుతుంది. ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని అందుకునే ప్రజలే గుర్తుంచుకోని రోజులివి సరిగ్గా ఏడాది క్రితం ఏ పసుపు కుంకుమ స్కీం చంద్రబాబుని ఆదుకోలేదు. వాళ్ళకి కావాల్సింది భారాలు లేకుండా బతుకు బండి లాగడమే…. కాదనుకుంటే ఇప్పటికి ఏమి చేయలేరు కానీ ఎన్నికల వేళ మిమ్మల్ని కాదనుకుంటారు. తస్మాత్ జాగ్రత్త.