ముసుగును తొలగిస్తారా?

రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా తీవ్రమైన చ‌ర్చకు దారి తీసిన ప్రధాన విష‌యం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంలో పురుడు [more]

Update: 2019-12-16 03:30 GMT

రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా తీవ్రమైన చ‌ర్చకు దారి తీసిన ప్రధాన విష‌యం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంలో పురుడు పోసుకున్న అమ‌రావ‌తి అప్ప ట్లో ప్రపంచ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా న‌డిచింది. సింగ‌పూర్ స‌హా దుబాయ్ వంటి దేశాల న‌మూనాల‌ను ప‌రిశీలించి మ‌రీ అమ‌రావ‌తిలో మ‌రో ప్రపంచాన్ని సృష్టించేందుకు చంద్రబాబు ప్రయ‌త్నించారు. ఇక‌, ఇక్కడ భూ సేక‌ర‌ణ పెద్ద చ‌ర్చకు కూడా వ‌చ్చింది. అలాంటి ప‌రిస్థితి ఒక్కసారి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌తో తీవ్ర వివాదానికి కార‌ణ‌మైంది.

ముసురుకున్న వివాదాలు….

రాజ‌ధాని విష‌యంలో ఆది నుంచి కూడా వైసీపీ అనుస‌రిస్తున్న వైఖ‌రి దీనికి ప్రధాన కార‌ణ‌మ‌నేది నిర్వివాదాంశం. ఇక్కడ రైతుల‌ను మ‌భ్యపెట్టి టీడీపీ నేత‌లు భూములు కాజేశార‌ని, పావ‌లా చేతుల్లో పెట్టి ముప్పా వలా కొట్టేశార‌ని ఇలా వైసీపీ నాయ‌కులు వివిధ అంశాల‌ను తెర‌మీదికి తెచ్చి, న్యాయ పోరాటాల‌కు దిగారు. అదేస‌మ‌యంలో జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్‌లో కూడా కేసులు వేశారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ ప్రభుత్వం వ‌చ్చాక‌.. మ‌రిన్ని అనుమాన‌పు మేఘాలు అమ‌రావ‌తిపై ముసురుకున్నాయి. ఈ ప‌రిస్థితిపై అటు రాజ‌ధాని రైతులు స‌హా ఇటు ప్రతిప‌క్షాలు కూడా తీవ్రస్థాయిలో రాజ‌కీయం చేశాయి.

బాబు ఖాతాలో పడుతుందనా?

ఇక‌, టీడీపీ అనుకూల మీడియా మ‌రింత రెచ్చిపోయింది. ఈ ప‌రిణామాలకు తోడు మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ చేసిన వ్యాఖ్యలు మ‌రింత‌గా అమ‌రావ‌తిపై అనుమానాలు పెంచాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం సంతోషించాల్సిన విష‌యం అంటున్నారు అమ‌రావ‌తి ప్రేమికులు. ఇక్కడే రాజ‌ధాని కొన‌సాగుతుంద‌ని అదే మంత్రి బొత్స చెప్పారు. ఈ ప‌రిస్థితి ఇలా ఉంటే, రాజ‌కీయంగా అమ‌రావ‌తి విష‌యాన్ని జ‌గ‌న్ ఎలా చూస్తున్నారు? ఈ న‌గ‌రం అబివృద్ధి చెందితే.. కేవ‌లం ఈ క్రెడిట్ అంతా కూడా టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు ఖాతాలోనే ప‌డుతుంద‌ని భావిస్తున్నారా ? అనే కోణంలో చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

అమరావతిని పూర్తి చేస్తే….

ఒక్క సారి ఈ విష‌యాల‌పై దృష్టి పెడితే.. నిజానికి అమ‌రావ‌తిని ప్రారంభించిన క్రెడిట్ చంద్రబాబుకే ద‌క్కుతుంది. అయితే, దీనికి మించిన క్రెడిట్ కానీ, చిర‌కాలం ఈ విష‌యంలో వ‌చ్చే ల‌బ్ధి కానీ జ‌గ‌న్‌కే ద‌క్కుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. “చంద్రబాబు పునాదులు తవ్వి వ‌దిలేశారు. కానీ, ఒక్క నిర్మాణం కూడా చేయ‌లేదు. కానీ, మేం వ‌చ్చాక కేంద్రంతో పోరాడి నిధులు సేక‌రించి అమ‌రావ‌తిని పూర్తి చేశాం“- అని 2024 ఎన్నిక‌ల్లో చెప్పుకొనే అద్బుత‌మైన అవ‌కాశం జ‌గ‌న్‌కు ల‌భించ‌నుంద‌ని అంటున్నారు.

వికేంద్రీకరణ జరిగితే….

అలా కాకుండా పోతే.. అమ‌రావ‌తిని మార్చితే.,. దీనిపై విమ‌ర్శల‌ను ఆయ‌న ఎదుర్కొన‌క త‌ప్పద‌నే వ్యాఖ్యలు వ‌స్తున్నాయి. అయితే ఇదే విష‌యంలో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని మార్చేందుకు ఇష్టప‌డ‌ని జ‌గ‌న్ ప‌రిపాల‌ను వికేంద్రీక‌ర‌ణ చేసే దిశ‌గా కూడా ఆలోచ‌న చేస్తున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి. మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ అన్ని ప్రాంతాల వారిని ఎలా నొప్పించ‌కుండా డెసిష‌న్లు తీసుకుంటారో ? చూడాలి.

Tags:    

Similar News