వ్యూహాత్మకంగానే వాయిదా?

రాజధాని మార్పుపై మొదట దూకుడు గా వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు వ్యూహం మార్చారా ? అవుననే అంటున్నారు విశ్లేషకులు. కీలకమైన సున్నితమైన రాజధాని మార్పు [more]

Update: 2019-12-28 03:30 GMT

రాజధాని మార్పుపై మొదట దూకుడు గా వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు వ్యూహం మార్చారా ? అవుననే అంటున్నారు విశ్లేషకులు. కీలకమైన సున్నితమైన రాజధాని మార్పు అంశంలో నిదానమే ప్రధానమని పార్టీలో కొందరు ముఖ్య నేతలు ఇచ్చిన సూచనతో జగన్ ఇప్పుడు ఆచితూచి వ్యవహారం నడపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను క్యాబినెట్ లో లాంఛనంగా ప్రకటించడాన్ని జగన్ వాయిదా వేశారంటున్నారు. ముందు అమరావతిలో భూ బాగోతాన్ని బట్టబయలు చేసి టిడిపి ని దోషిగా ప్రజల ముందు నిలబెడితే రాజకీయంగా మైలేజ్ దక్కుతుందని తమ వాదనకు బలం చేకూరుతుందని వైసిపి అంచనా వేసినట్లు తెలుస్తుంది.

ఉద్యమ వేడి చల్లారేలా …

ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసేదిశగా ముందుగా అడుగులు వేసి ఉద్యమాన్ని చల్లార్చే కార్యాచరణ ఇప్పటికే జగన్ మొదలు పెట్టారని అంటున్నారు. అమరావతి రైతులకు ఏమి చేస్తే న్యాయం జరుగుతుంది అన్నదానిపై కసరత్తు సర్కార్ వేగవంతం చేసింది. అదే సమయంలో అయాచితంగా అమరావతి ప్రాంతం రాజధానిగా ప్రకటించక ముందు తరువాత భూముల వివరాలు నేతలు, వారి బినామీ వివరాలను బయటపెట్టే పని ఇప్పటికే దశలవారీగా మొదలు పెట్టేసింది ప్రభుత్వం. ఈ కార్యక్రమం సంపూర్ణం అయ్యాక హై పవర్ కమిటీ నివేదిక, జి ఎన్ రావు నివేదిక, న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు చర్చించి విశాఖకు కార్యనిర్వాహక రాజధాని హోదా ప్రకటించాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.

మరో నెలపాటు …

మరో నెలరోజుల పాటు రాజధానిపై అన్ని ప్రాంతాల్లో చర్చ జరగాలన్నదే వైసిపి అభిమతంగా కనిపిస్తుంది. ఈలోగా అమరావతి ప్రాంత రైతులను బుజ్జగించేందుకు సమయం చిక్కుతుందని అక్కడి ఉద్యమ వేడి తగ్గుతుందన్న అంచనాలో అధికారపార్టీ ఉందని అంటున్నారు. గతంలో రాజధానిపై విస్తృత స్థాయిలో చర్చ జరగకుండానే చంద్రబాబు ప్రజాభిప్రాయం అంటూ తన ఆలోచన జనం పై తోసి అమరావతి ని ప్రకటించిన విధంగా కాకుండా మరింత రచ్చ చేయాలన్నదే వైసిపి చేస్తున్నట్లు చెబుతున్నారు.

అన్ని వివరాలతో…..

అందుకే రాజధాని కోసం చంద్రబాబు ఏం చేశారు ? ఎంత కేంద్రం ఇచ్చింది ? ఎంత అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేశారు ? ఇలా అన్ని వివరాలు బహిరంగంగా చర్చ జరగడం మంచిదని అధికార పార్టీ వర్గాలు లెక్కేసుకునే త్రి క్యాపిటల్స్ ప్రకటన వ్యూహాత్మకంగా వాయిదా వేసినట్లు విశ్లేషకుల అంచనా. మరి జగన్ రానున్న రోజుల్లో వీటికి భిన్నంగా స్పందిస్తారా లేక తాను అనుకున్న స్కెచ్ లోనే అన్ని చేసుకుపోతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News