జగన్ ఇలాకాలో యమా కిక్కు

ఆంధ్రప్రదేశ్ లో రికార్డ్ స్థాయిలో ప్రజల మధ్య పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు వైఎస్ జగన్. తన పాదయాత్రలో మహిళలు ప్రధానంగా తీసుకువచ్చిన మద్యం సమస్యపై [more]

Update: 2019-10-02 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో రికార్డ్ స్థాయిలో ప్రజల మధ్య పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు వైఎస్ జగన్. తన పాదయాత్రలో మహిళలు ప్రధానంగా తీసుకువచ్చిన మద్యం సమస్యపై దశలవారీ మద్యపాన నిషేధం అమలు చేస్తానని మాటిచ్చారు ఆయన. అధికారంలోకి వచ్చాక తాను ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు 20 శాతం మద్యం దుకాణాలను లెక్కా పత్రం లేని బెల్ట్ షాపులను సాహసోపేతంగా తొలగించారు జగన్. రెవెన్యూ లోటు తో అప్పుల ఊబిలో వున్న ఏపీలో ఈ చర్య సంచలనమే. మద్యం ప్రధాన ఆదాయ వనరుగా వున్న రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం ధైర్యంగా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో తీసుకుంటారని లెక్కేయలేదు. అయితే మద్యం పాలసీపై తొలి అడుగును ధైర్యంగా వేసింది జగన్ సర్కార్.

మందుబాబుల అసంతృప్తి …

కొత్త మద్యం పాలసీ మాత్రం మందుబాబులకు రుచించలేదు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ప్రభుత్వం విక్రయించే దుకాణాల్లో మందు దొరకడాన్ని వారు ఒక్కసారిగా జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి తోడు పది రూపాయల నుంచి 200 ల రూపాయల వరకు మద్యం ధరలు పెరగడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మద్యం కొనలేనంత ధరలు పెంచుతానని జగన్ ఎన్నికల ముందు చెప్పిన మాట ఇప్పుడు వారిని మరింత భయపెడుతుంది.

మహిళలు హ్యాపీ ….

జగన్ సర్కార్ దశలవారీ మద్యపాన నిషేధం పై మరోపక్క మహిళలు స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం మద్యం విక్రయాల సమయాన్ని కుదించడం బావుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీధికో మద్యం షాపు వుండే తీరును తగ్గించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ భర్తల సంపాదన అంతా మధ్యానికే ఖర్చు చేస్తూ తమకు వేధింపులే మిగులుతున్నాయని మహిళలు వాపోతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో మొదలైన ఉద్యమాలు ….

అయితే పలు జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు జనావాస ప్రాంతాల నడుమ ఉండటంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు కొత్త మద్యం దుకాణాల ముందు ఆందోళనలు చేపట్టడం కొన్ని చోట్ల తెలుగు దేశం శ్రేణులు వారికి అండగా నిలవడంతో ఈ ఉద్యమాలకు రాజకీయ రంగు పులుముకుంది. దాంతో బాటు ఎన్నో ఏళ్లుగా మద్యం దుకాణాలపై ఆధారపడిన వ్యాపారులు, ఉద్యోగులు సైతం కొన్ని ప్రాంతాల్లో ఉద్యమాల వెనుక ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కి అందిన సమాచారం. అయితే ఇవన్నీ కొద్ది రోజుల్లో సమసి పోతాయని ఎక్సయిజ్ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి జగన్ సర్కార్ తాజా సాహసం పై మాత్రం మెజారిటీ వర్గాల్లో ఆనందం వ్యక్తం కావడంతో భవిష్యత్తులో మద్యం ధరలు మరింత పెంచడం కొన్ని షాపులు తగ్గిస్తూ సర్కార్ అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Tags:    

Similar News