జగన్ గెలిచినా… సాధిస్తాడా..?

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముందునుంచీ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. గత ఐదేళ్లుగా ఆయన ప్రత్యేక [more]

Update: 2019-04-25 02:30 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముందునుంచీ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. గత ఐదేళ్లుగా ఆయన ప్రత్యేక హోదానే కావాలని పోరాడుతున్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి ఒప్పుకున్నా.. హోదా సంజీవని కాదని చెప్పినా జగన్ మాత్రం ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రానిక మేలు జరుగుతుందని, పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగాల విప్లవం వస్తుందని ముందునుంచీ చెబుతూ వస్తున్నారు. అన్ని జిల్లాల్లో విద్యార్థులు, యువకులతో జగన్ ‘యువభేరి’ సభలు నిర్వహించిన ప్రత్యేక హోదా గురించి వారిలో అవగాహన కల్పించారు. పలుమార్లు దీక్షలు, ధర్నాలు కూడా చేశారు. చివరి అస్త్రంగా ఎంపీల చేత కూడా రాజీనామా చేయించారు. ఎన్నికల్లోనూ ప్రత్యేక హోదాను జగన్ ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. 25కు 25 ఎంపీ సీట్లు గెలిపించాలని ప్రత్యేక హోదా సాధించుకుందామని ప్రచారం చేశారు.

బీజేపీనే మళ్లీ వస్తే కష్టమే…

మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి. గెలుపోటములపై ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే పలు సర్వేలు మాత్రం జగన్ దే విజయం అని చెబుతున్నాయి. ఒకవేళ ఆ సర్వేలు నిజమై జగన్ గెలిచినా.. ఆయన చెప్పినట్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారా అంటే కచ్చితంగా సాధిస్తారని చెప్పలేని పరిస్థితి ఉంది. కేంద్రంలో ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సీట్లు తగ్గినా కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తాడని పలు జాతీయ సర్వేలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని చెప్పలేము. ఎన్డీఏకు పూర్తి మెజారిటీ వస్తే మాత్రం బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో పాత వైఖరినే అవలంభించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ రాని పక్షంలో జగన్ మద్దతు ఆ పార్టీ కోరవచ్చు. కానీ, జగన్ ముందునుంచీ ఒకే మాట స్పష్టంగా చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామంటే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానని చెబుతున్నారు. మరి, జగన్ మద్దతు కచ్చితంగా అవసరం అనుకుంటే తప్ప జగన్ డిమాండ్ కు తలొగ్గి బీజేపీ ప్రత్యేక హోదాకు అంగీకరించదు.

హంగ్ వస్తే తప్ప…

ఇక, కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే, జగన్ కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. తాను కాంగ్రెస్ ను క్షమించేశానని, హోదా ఇస్తామంటే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఇటీవల ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో జగన్ ప్రకటించారు. కానీ కాంగ్రెస్.. తమ కొత్త మిత్రుడు చంద్రబాబు నాయుడును వదులుకొని జగన్ మద్దతు కోరుతుందా అనేది అనుమానమే. ఇక, ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మాత్రం ప్రత్యేక హోదా సాధించే అవకాశాలు జగన్ కు కొద్దిగా ఉన్నా.. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలో హంగ్ రావాలని జగన్ బలంగా కోరుకుంటున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే తమ అవసరం ఉండాలని, అలా అయితేనే ప్రత్యేక హోదా ఇస్తారని జగన్ భావిస్తున్నారు. మరి, జగన్ భావిస్తున్నట్లు హంగ్ వస్తే తప్ప ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి, జగన్ గెలిచినా ప్రత్యేక హోదా కచ్చితంగా సాధిస్తారని మాత్రం చెప్పలేం.

Tags:    

Similar News