జగన్ పట్ల మోదీ…?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విభిన్న వైఖరిని ప్రదర్శిస్తున్నారు. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న [more]

Update: 2019-08-07 08:00 GMT

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విభిన్న వైఖరిని ప్రదర్శిస్తున్నారు. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కూడా దక్కేది కాదు. చివరి మూడేళ్ల పాటు మోదీ అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబు చాలా ప్రయత్నాలే చేశారు. ప్రత్యేక హోదాను మినహాయించి మిగిలిన రాష్ట్ర సమస్యలను ఆయనకు వివరించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

అపాయింట్ మాత్రం….

దీంతో తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లివచ్చినా మోదీ కరుణించలేదని చంద్రబాబు పదే పదే చెప్పారు. ఎన్నికల సమయంలోనూ అదే ప్రధాన అంశంగా చంద్రబాబు చేసుకున్నారు. కానీ వైఎస్ జగన్ విషయంలో నరేంద్ర మోదీ కొంత సానుకూలంగానే ఉన్నట్లు కనపడుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి కేవలం రెండు నెలలు మాత్రమే అయింది. ఇప్పటికి రెండు సార్లు వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ లభించింది. తాజాగా కాశ్మీర్ అంశంలో బిజీగా ఉన్నా వైఎస్ జగన్ కు మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చారు.

ప్రత్యేక హోదాపై…..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చెబుతున్నట్లుగానే చేస్తున్నారు. మోదీని ప్రత్యేక హోదాపై అనేకసార్లు కలుస్తానని చెప్పారు. అదే విధంగా మరోసారి మోదీని కలసి ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ తాజాగా ప్రస్తావించారు. ప్రత్యేకహోదాపై మోదీ నుంచి సానుకూలత రాదన్న సంగతి తెలిసిందే. హోదా తో పాటు వైఎస్ జగన్ అనేక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించారు. ఆర్థికంగా తమ రాష్ట్రం ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నదీ వివరించారు.

నిధుల విడుదల పై….

ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధులను వెంటనే విడుదల చేయాలని వైఎస్ జగన్ ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు 5,103 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దీనిపై మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో పాటుగా ఏడు వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 23.300 కోట్లు విడుదల చేయాలని కోరారు. పీపీఏ ల విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా వైఎస్ జగన్ వివరించినట్లు తెలిసింది. అన్నింటికీ మోదీ సానుకూలంగానే స్పందించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి వైఎస్ జగన్ తరచూ ప్రధానిని కలసి రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన సాయాన్ని పొందుతారా? లేదా? అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News