డెడ్ లైన్ పెట్టేసిన జగన్ కి ధీమా ఏంటో ?

పోలవరం అమరావతి ఈ రెండూ విభజన ఏపీ రాజకీయాలను తారు మారు చేసే అతి పెద్ద అంశాలు. ఈ రెండింటి మీదనే పదమూడు జిల్లాల ఏపీ పాలిటిక్స్ [more]

Update: 2020-12-23 15:30 GMT

పోలవరం అమరావతి ఈ రెండూ విభజన ఏపీ రాజకీయాలను తారు మారు చేసే అతి పెద్ద అంశాలు. ఈ రెండింటి మీదనే పదమూడు జిల్లాల ఏపీ పాలిటిక్స్ ఎపుడూ హీటెక్కుతూ ఉంటుంది. ఈ రెండూ అభివృద్ధికి సంకేతాలు. జనం గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఉండేందుకు దోహదపడే విషయాలు. సరైన రాజధాని ఉంటే మరో పదేళ్ళకైనా ఏపీ ప్రగతిపధంలో సాగుతుందని అయిదు కోట్ల మంది జనం ఆలోచన. అలాగే బహుళార్ధసాధక ప్రాజెక్ట్ పోలవరం పూర్తి అయితే తాగు సాగు నీటి కష్టాలు తీరడమే కాకుండా పారిశ్రామికంగా కూడా ఏపీ పరుగులు పెడుతుందని, దానికి కావాల్సిన విద్యుత్ చౌకగా ఏపీ ఇవ్వగలుగుతుందని మేధావుల భావన.

బోల్డ్ హామీతో ….

జగన్ తాజాగా పోలవరం టూర్ వేశారు. జగన్ ఈ పర్యటనను ఏ మాత్రం హడావుడి చేయకుండా ముగించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణం ప్రగతి గురించి ఆయన అన్ని విషయాలూ ఆరా తీశారు. సమీక్ష చేశారు. ఇక నిర్వాసితుల విషయంలో తాను ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని జగన్ ఈ సందర్భంగా గట్టి భరోసా ఇవ్వడమే చర్చనీయాంశం అయీంది. లక్షా అయిదు వేల కుటుంబాలకు 2013 తరువాత వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అంటే 35 వేల కోట్ల దాకా అవుతుంది. కేంద్రం 2014 నాటి అంచనాలకే పరిమితం అవుతామని చెబుతోంది. మరి అదే కనుక నిజమైతే జగన్ సర్కార్ నెత్తినే మొత్తం పునరావాస‌ భారం పడుతుంది.

ఎందుకంత ధీమా ….?

జగన్ హామీ అయితే ఇచ్చేశారు. కానీ నిధులు ఎలా వస్తాయి అన్నది చర్చగానే ఉంది. రాష్ట్రం తీరు చూస్తే ఒక్కోసారి ఉద్యోగుల జీతాలకే అప్పులు సకాలంలో తేలని దుస్థితిలో ఉంది. అయినా సరే జగన్ నిర్వాసితుల విషయం తాను చూసుకుంటాను అని గట్టి హామీ ఇవ్వడం ద్వారా రాష్ట్ర పెద్దగా శభాష్ అనిపించుకున్నారు. కానీ ఆ విధంగా నిధుల సమీకరణ ఎలా చేస్తారు అన్నదే సందేహంగా ఉంది. మరి కేంద్రం నిధులు ఇస్తుందా అంటే పోలవరం కనుక పూర్తి అయితే ఆ క్రెడిట్ కచ్చితంగా జగన్ ఖాతాలోకే వెళ్తుంది. ఆయన మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి అదే సోపానం అవుతుంది. మరి అన్నీ తెలిసిన బీజేపీ జగన్ కి అంత పొలిటికల్ మైలేజ్ ఇచ్చేసి చేతులు ముడుచుకుంటుందా అంటే కానే కాదు అనే చెప్పాలి.

మాట నిలబెట్టుకుంటారా ….?

జగన్ ఎట్టి పరిస్థితుల్లో 2022 ఖరీఫ్ నాటికి పోలవరం నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పడం అంటే అది ఒక విధంగా శిలాశాసనం అనుకోవాలి. ఇక్కడ జగన్ కి ముఖ్యమంత్రిగానే కాదు, వైఎస్సార్ కుమారుడిగా ఒక మాజీ సీఎం వారసుడిగా కూడా పూర్తి బాధ్యత ఉంది. అందుకే ఆయన‌ దృఢ స్వరంతో పోలవరం పూర్తి అవుతుంది అని గట్టిగా చెప్పారనుకోవాలి. కేంద్రం మీద ఓ వైపు వత్తిడి పెంచుతూనే మరో వైపు ప్లాన్ బీ కూడా జగన్ రెడీ చేశారు అంటున్నారు. దాని ప్రకారం ఆసియన్ బ్యాంక్ లాంటి వాటి ద్వారా భారీ రుణాలను తీసుకుని అయినా పొలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని ప్రచారం అయితే సాగుతోంది. ఎన్ని తిప్పలు పడినా పోలవరం సకాలంలో పూర్తి చేసి జగన్ చూపిస్తే మాత్రం ఆయన ఏపీకి తిరుగులేని నాయకుడు అవడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News