ఇంతుల హోరు… ఇంటి పోరు.. పొరుగింటి జోరు

జనంలో జగన్ అజేయుడనే ముద్ర బలపడుతోంది. అసాధారణ పరిస్థితులు ఏర్పడితే తప్ప ఒకటి రెండు టర్మ్ లకు ఢోకా లేదని రాజకీయ పరిశీలకులు కూడా ఒప్పుకుంటున్నారు. అసాధారణ [more]

Update: 2021-04-04 03:30 GMT

జనంలో జగన్ అజేయుడనే ముద్ర బలపడుతోంది. అసాధారణ పరిస్థితులు ఏర్పడితే తప్ప ఒకటి రెండు టర్మ్ లకు ఢోకా లేదని రాజకీయ పరిశీలకులు కూడా ఒప్పుకుంటున్నారు. అసాధారణ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా కేంద్రం పెద్దలతోనూ ముఖ్యమంత్రి సయోధ్యగానే ఉంటున్నారు. ప్రజల్లో బలం లేని ప్రతిపక్షాలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. విపక్షాలను దీటుగా ఎదుర్కొనే బాధ్యతను ద్వితీయశ్రేణి నాయకులపై పెట్టేశారు. ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు, విమర్శలు, తిట్లు, దూషణల బాధ్యతను తన మంత్రులకు అప్పగించేశారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ముఖ్యమంత్రిగా తాను బదులు చెప్పాల్సిన అవసరమే లేదన్న భావనకు వచ్చేశారు. స్థానిక ఎన్నికల్లో అడుగు బయటపెట్టకుండా విపక్షాలను నిర్వీర్యం చేసేశారు. ఇంతటి ప్రజాబలం ఉన్నప్పటికీ ఇంటి పోరు ఇరకాటంగా మారుతోంది. ఒకవైపు సొంత చెల్లెలు షర్మిళ, మరోవైపు చిన్నాన్న కూతురు సునీత పరోక్షంగా, ప్రత్యక్షంగా తనను టార్గెట్ చేస్తున్నారు. వారి ప్రశ్నలకు, ప్రజల్లో కలిగే సందేహాలకు బదులు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతోంది. పార్టీలోని ఇతర నాయకులు ఈ బాద్యతను తీసుకోలేరు. అది కుటుంబ వ్యవహారం. చట్టం తన పని తాను చేస్తుందన్నట్లుగా మౌనాన్ని ఆశ్రయించవచ్చు. కానీ నైతికంగా ప్రజల్లో పలచనయ్యే ప్రమాదం ఉందంటున్నాయి వైసీపీ శ్రేణులు.

విజయమ్మ విల విల…

పార్టీలోనూ, ప్రజల్లోనూ అత్యంత గౌరవం, ఆదరణ కలిగిన వ్యక్తి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి. విచారణలో భాగంగా కుమారుడు జగన్ జైలు పాలయినప్పుడు పార్టీ బాధ్యతలను భుజస్కంధాలపై మోశారామె. షర్మిల తో కలిసి ఊరూరా తిరిగారు. పార్టీకి జవసత్తువలు కల్పించారు. ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రియాశీలక పాత్ర నుంచి నిష్క్రమించారు. తన కర్తవ్యం నెరవేరిందని భావించారు. షర్మిలకు రాజకీయ ఆకాంక్షలు ఉన్న విషయం విజయమ్మకు తెలుసు. అయినప్పటికీ ఆమెకు సముచిత స్థానం ఇప్పించడంలో విఫలమయ్యారు. విజయమ్మ, షర్మిల దాదాపు వైసీపీ కార్యకలాపాలకు ఈ రెండేళ్లలో దూరమై పోయారు. అయినప్పటికీ వీరిరువురూ గతంలో పార్టీ కార్యకలాపాల్లో నమోదైన కేసుల విషయమై తెలంగాణలో న్యాయస్థానాల సమన్లు అందుకుంటూనే ఉన్నారు. తన ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ప్రయోగాత్మకంగా తెలంగాణను వేదిక చేసుకుని షర్మిల పోరాటం మొదలు పెట్టారు. సొంత పార్టీతో పాటు , ప్రజలకు ప్రతికూల సంకేతాలు వెళతాయని ఆమెను నివారించేందుకు విజయమ్మ ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. అయినప్పటికీ మొండిగా ముందడుగు వేశారు షర్మిల. ఈ విషయంలో తన నైతిక మద్దతు ప్రకటించడం మినహా నిస్సహాయురాలై పోయారు విజయమ్మ. అన్నాచెల్లెళ్ల మధ్య రాజీ ప్రయత్నం చేసి కనీసం వైసీపీ తెలంగాణ శాఖ బాధ్యతలను అప్పగించేందుకు సైతం వీలు కాలేదు. ఆంధ్రాలో అన్న చెల్లెలను సొంత గూటికి రానీయడం లేదు. తెలంగాణలో చెల్లెలు సొంత కాళ్లపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. మానసికంగా తల్లి విజయమ్మకు ఇది ఇబ్బందికరమైన పరిణామమేనని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

ముఖ్యమంత్రి ముభావం..

ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యర్థుల నుంచి ఎదురైన పెను సవాళ్లు ఏమీ లేవు. కానీ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తాజాగా సందించిన ప్రశ్నలు ప్రభుత్వంలో ప్రకంపనలు రేపుతున్నాయి. రెండేళ్లైనా నా తండ్రి హత్య కారకులను వెలికితీయడం లేదంటూ ఆమె వేలెత్తి చూపారు. ముఖ్యమంత్రి ఈవిషయంలో పట్టించుకోవడం లేదని నేరుగానేవిమర్శించారు. తమ బంధువులే హత్య చేసి ఉంటారని ఆరోపించారు. అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తమకు న్యాయం చేయడం లేదని నిందించారు. ఇవన్నీ జగన్ ప్రతిష్ఠను మసకబార్చే అంశాలే. నిందితులను పట్టుకోవడంలో చిత్తశుద్ధి చూపడం లేదన్న విమర్శ నిజంగానే ఇబ్బంది పెడుతుంది. సీబీఐకి అప్పగించినా రాష్ట్ర పోలీసుల సహకారం తగినంతగా అందడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సునీత చేసిన విమర్శలు ముఖ్యమంత్రిపైనే ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదు. వివరణ ఇప్పించే ప్రయత్నమైనా చేసి ఉండాలి. వివేకానందరెడ్డి హత్య ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించింది. దీనిపై డీజీపీ స్థాయి అధికారితో ప్రజలకు వివరాలు చెప్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆడకూతురు బయటికి వచ్చి ఆవేదన వెలిబుచ్చినా పట్టించుకోవడం లేదనే నింద సర్కారుపై పడుతుంది. అందులోనూ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యురాలికే న్యాయం చేయడం లేదనే కోణమూ ప్రత్యర్థుల చేతికి అస్త్రం ఇచ్చినట్లే.

పక్క రాష్ట్రం నుంచి ప్రతికూలత…

ప్రతిపక్షాలు ఇంతవరకూ వైసీపీ ప్రభుత్వంపై అనేక రకాల ఉద్యమాలు చేశాయి. ఎక్కడా సక్సెస్ కాలేదు. ఇంటి నుంచి పుట్టిన ముసలాన్ని అందుకోవడానికి సిద్దం అవుతున్నాయి. ఇంతవరకూ తెలంగాణ ప్రభుత్వం జగన్ తో సన్నిహితంగానే ఉంటూ వచ్చింది. నీటి ప్రాజెక్టుల వివాదాలు ఉన్నప్పటికీ ఇరువురు సీఎంలు ప్రత్యక్ష ఆరోపణల స్థాయికి దిగలేదు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు షర్మిల పార్టీ అధికార టీఆర్ఎస్ కు కొంతమేరకు ఆగ్రహం కలిగిస్తోంది. చెల్లెలికి సొంత రాష్ట్రంలో సర్దుబాటు చేసుకోకుండా తమ గుండెలపై కుంపటిగా తెచ్చి పెట్టారనే ఆందోళన టీఆర్ఎస్ లో వ్యక్తమవుతోంది. మిత్రపక్షంగా ఉంటున్న తమకు పడాల్సిన వైసీపీ ఓటింగును షర్మిల కొల్లగొడతారని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఎంతో కొంతమేరకు తమ పార్టీకి నష్టం వాటిల్లుతుందనుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వాదంతోనే బీజేపీ ప్లాన్ లో భాగంగా షర్మిల హల్ చల్ చేస్తున్నారనే అనుమానాలూ ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతోంది టీఆర్ఎస్. ఆంధ్రాలో భూముల విలువలు పడిపోయాయంటూ ప్రభుత్వ పాలనను పరోక్షంగా ఎత్తి చూపారు కేసీఆర్. విశాఖ ఉక్కు ఉద్యమానికి మేం మద్దతిస్తామంటూ ముందుకు వచ్చారు కేటీఆర్. అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ సమర్థంగా వ్యవహరించడం లేదనే సంకేతాలను పంపడమే కేటీఆర్ మాటల ఆంతర్యం. మొత్తమ్మీద సొంత రాష్ట్రంలో ప్రతిపక్షాల కంటే ఇంటి పోరు, పొరుగింటి జోరు వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News