జగన్నామ స్మరణ తప్పదా… ?

జగన్ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా ఆయనకు ఉన్న ప్రజాదరణ దృష్ట్యా వైసీపీకి 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఆధారంగా జాతీయ రాజకీయాల్లో ఎవరూ [more]

Update: 2021-06-05 12:30 GMT

జగన్ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా ఆయనకు ఉన్న ప్రజాదరణ దృష్ట్యా వైసీపీకి 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఆధారంగా జాతీయ రాజకీయాల్లో ఎవరూ విస్మరించలేరు. నాయకుడు అంటే గెలుపే సూచిక. వ్యూహాలు ఎత్తులు, చాణక్య బిరుదులు ఇవన్నీ గెలుపు ముందు పూర్తిగా దిగదుడుపే. ఆ విధంగా ఆలోచిస్తే జగన్ రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో మరింత కీలకమైన పాత్ర పోషించనున్నారు అన్నది వాస్తవం. ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కి కూడా జగన్ అవసరం చాలానే ఉందిట.

పెద్ద పనే మరి …

ఏడేళ్ళుగా అధికారంలో ఉంటూ అప్రతిహిత విజయాలు ఎన్నో నమోదు చేస్తూ వస్తున్న బీజేపీకి పెద్ద సభలో మాత్రం మెజారిటీ ఇప్పటికీ దక్కడంలేదు. మొత్తం 245 మంది ఉన్న పెద్దల సభలో మెజారిటీకి మ్యాజిక్ ఫిగర్ 123గా ఉంది. అయితే బీజేపీకి ఇప్పటిదాకా చూస్తే 93 మంది మాత్రమే పెద్దల సభలో ఉన్నారు. అంటే ఇరవై మంది దాకా కొరత అలాగే ఉంది. దాంతో అనేక కీలకమైన బిల్లుల ఆమోదానికి వైసీపీ వంటి పార్టీలతో బీజేపీ సర్కార్ కి పెద్ద పనే పడుతోంది. అందుకే జగన్ విషయంలో కేంద్రం కూడా కాస్తా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటుంది అంటారు.

జంపింగ్ చేసినా…?

ఇక 2019 ఎన్నికల తరువాత టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీ తన వెంట తెచ్చుకుంది. ఇందులో గరికపాటి రామ్మోహనరావు తెలంగాణా కోటాలో నెగ్గారు. మిగిలిన ముగ్గురూ సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ఏపీకి చెందిన వారే. వీరంతా 2022లో రిటైర్ కాబోతున్నారు. ఈ సీట్లు అన్నీ కూడా వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ఆ విధంగా చూసుకుంటే బీజేపీకి ఆ మేరకు రాజ్య సభలో కోత పడనుండగా వైసీపీ మీద ఆధారపడడం మరింతగా పెరగనుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది మూడవ వంతు అంటే 70కి పైగా సీట్లు రాజ్య సభలో ఖాళీ కాబోతున్నాయి. వాటిలో చాలా వరకూ బీజేపీకి చెందినవే అంటున్నారు.

మాట నెగ్గేనా …?

ఇక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఉన్న రాజ్య సభ్య సీట్లు తగ్గుతాయి అంటున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి మళ్ళీ అధికారంలోకి రావడం ఇపుడున్న పరిస్థితుల్లో శక్తికి మించిన పనిగా చెబుతున్నారు. అదే విధంగా రాజస్థాన్ లాంటి కాంగ్రెస్ బలమున్న చోట్ల కూడా ఎంపీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అంటే అక్కడ కూడా బీజేపీ సీట్లు కోల్పోవాల్సివస్తుంది అన్న మాట. ఈ పరిణామాల నేపధ్యంలో చూసుకుంటే వచ్చే ఏడాదిలో 20 నుంచి పాతిక సీట్ల దాకా బీజేపీ పెద్దల సభలో కోల్పోతే కచ్చితంగా వైసీపీ మీదనే ఆధారపడాల్సి ఉంటుంది అంటున్నారు. ఇక వైసీపీకి వచ్చే ఏడాదిలో మరో నాలుగు ఎంపీ సీట్లు వచ్చి చేరతాయి. అంటే రాజ్యసభలో వైసీపీ బలం పది దాకా ఉంటుంది అని చెప్పాలి. ఇలాంటి బెటర్ నంబర్ ని పెట్టుకుని బీజేపీ సర్కార్ దగ్గర తన మాట నెగ్గించుకునేలా వైసీపీ పావులు కదుపుతుంది అంటున్నరు . చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News