ఏం జ‌రుగుతోంది.. ఆ జిల్లాపై జ‌గ‌న్ ఆరా…?

రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో అధికార పార్టీ వైసీపీ ప‌రిస్థితి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో ఉంది. కొన్ని జిల్లాల్లో నేత‌ల మ‌ధ్య స‌ఖ్యత లేదు. మ‌రికొన్ని జిల్లాల్లో మంత్రుల‌కు, [more]

Update: 2021-09-13 02:00 GMT

రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో అధికార పార్టీ వైసీపీ ప‌రిస్థితి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో ఉంది. కొన్ని జిల్లాల్లో నేత‌ల మ‌ధ్య స‌ఖ్యత లేదు. మ‌రికొన్ని జిల్లాల్లో మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య పొంతన ఉండ‌డం లేదు. దీంతో నిత్యం వివాదాలు.. విమ‌ర్శల‌తో నాయ‌కులు అల్లాడుతున్నారు. ఇది పార్టీపై పెను ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి జిల్లాల్లో.. మ‌రీ వివాదంగా మారిన జిల్లా తూర్పు గోదావ‌రి. ఇక్కడ లెక్కకు మిక్కిలిగా నేత‌లు ఉన్నప్పటికీ.. ఎవ‌రికీ స‌ఖ్యత‌లేదు. పార్టీ ముందుకు న‌డిపించ‌డం అటుంచితే.. పాల‌న‌ను కూడా ప్రజ‌ల‌కు చేరువ చేయాల‌నే ధ్యాస క‌నుమ‌రుగైంది. మంత్రుల‌ను సైతం ఎమ్మెల్యేలు, లెక్కచేయ‌డం లేదు.
మంత్రిగారి పరిస్థితి….
రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే క‌మ్ మంత్రి చెల్లుబోయిన వేణు ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా ఎమ్మెల్యేలు ఆయ‌న‌ను లెక్కచేయ‌డం లేదు. పైగా ఒక‌రిద్దరు మంత్రిపైనే ఫిర్యాదు చేస్తున్నారు. ఇక‌, మ‌రోమంత్రి పినిపే విశ్వరూప్ అసాధార‌ణ మౌనం పాటిస్తున్నారు. ఎవ‌రితోనూ క‌లివిడిగా లేరు. ఎవ‌రితో ఎలా మాట్లాడితే.. దానికి ఎలాంటి మీనింగులు లాగుతారో.. అని ఆయ‌న ఒకింత జ‌డుపుగానే వైసీపీలో వ్యవ‌హ‌రిస్తున్నారు. స‌మైక్యాంధ్రలోనే మంత్రిగా ప‌నిచేసిన విశ్వరూప్ ఇప్పుడు ఈ ప‌ద‌వి నాకెందుకు అన్నంత నిర్వేదంలో ఉంటున్నారు.

అప్రకటిత మంత్రులుగా….

ఇదిలావుంటే.. అప్రక‌టిత మంత్రులుగా కొంద‌రు ఎమ్మెల్యేలు వ్యవ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న ఉంది. వీరిలో కాకినాడ సిటీ.. ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయ‌న ఎవ‌రినీ లెక్క‌చేయ‌క‌పోగా.. త‌న పంథాలో తాను పయ‌నిస్తున్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇటీవ‌ల ఈయ‌న తండ్రి ద్వారంపూడికి పౌర‌స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ చైర్మన్‌గా ప్రమోష‌న్ ల‌భించాక‌.. ఇక‌, ఎమ్మెల్యే చుట్టూనే రాజ‌కీయం న‌డుస్తోంది. ఆయ‌న‌కు వైసీపీ అధిష్టానం ద‌గ్గర ప‌లుకుబ‌డి ఉంద‌ని.. మంత్రి కాక‌పోయినా.. ఆయ‌నే అన్ని ప‌నులు చేస్తార‌ని.. పార్టీలో చ‌ర్చ న‌డుస్తోంది. దీంతో ఎవ‌రు ఏ ప‌నికోసం అయినా.. ఆయ‌న ద‌గ్గర‌కే క్యూక‌డుతున్నారు. దీంతో మంత్రులు నొచ్చుకుంటున్నారు.

ఎవరికి వారు వర్గాలుగా….

ఇక‌, గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీని మారి ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తులు.. ఓ వ‌ర్గాన్ని మెయింటెన్ చేస్తున్నారు. ఈయ‌న కూడా ఎవ‌రితోనూ క‌ల‌వడం లేదు. సామాజిక వ‌ర్గాల ప‌రంగా జ‌గ‌న్ త‌న‌కు తిరుగులేని ప్రయార్టీ ఇస్తున్నార‌ని తోట దూకుడుగా ఉంటున్నారు. ఇలా.. ఎవ‌రికివారు.. సొంత వ‌ర్గాలు మెయింటెన్ చేసుకుని ముందుకు సాగుతుండ‌డంతో వైసీపీ ప‌రిస్తితి ఇబ్బందిగా మారింద‌నే నివేదిక‌లు జ‌గ‌న్ కు చేరాయి. దీంతో అస‌లు ఆ జిల్లాలో ఏం జ‌రుగుతోంది? అనే ప్రశ్న దిశ‌గా జ‌గ‌న్ దృష్టి పెట్టార‌ని.. తెలుస్తోంది. ఇప్పటికే త‌న‌కు అందిన నివేదిక‌లు, స్థానిక నేత‌ల నుంచి వ‌చ్చే ఫీడ్ బ్యాక్‌ను తీసుకుని.. జిల్లాను సంస్కరించాల‌ని.. ఆయ‌న భావిస్తున్నట్టు స‌మాచారం.

అంతర్గత కుమ్ములాటలు…..

ఇప్పుడున్న ప‌రిస్థితిలోనే తూర్పుగోదావ‌రిని వ‌దిలేస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీలో అంత‌ర్గత కుమ్ములాట‌లే.. ఆ పార్టీని భ్ర‌ష్టుప‌ట్టిస్తాయ‌ని.. అంటున్నారు. పైగా.. టీడీపీకి కంచుకోట‌ల వంటి.. నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న జిల్లా కావ‌డంతో ఇప్పటి నుంచి చ‌ర్యలు తీసుకుని ముందుకు సాగ‌క‌పోతే.. ఇబ్బందులేన‌ని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో జ‌గ‌న్ జిల్లాపై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News