గోడ మీద వాటం.. స్వామిభక్తి.. దీంతోనే అసలు సమస్య

సగం తెరిచిన హార్డ్ వేర్ షాప్ లో హడావుడిగా సామాను కొంటుంటే వెనుక వచ్చిన ముసలాయనని వెళ్లిపోమని షాప్ కుర్రాడు అదిలిస్తుంటే…. ఆయనకు ఎక్కడ లేని కోపం [more]

Update: 2020-05-06 11:00 GMT

సగం తెరిచిన హార్డ్ వేర్ షాప్ లో హడావుడిగా సామాను కొంటుంటే వెనుక వచ్చిన ముసలాయనని వెళ్లిపోమని షాప్ కుర్రాడు అదిలిస్తుంటే…. ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. కూరగాయలు, ముఖ్యమైన సామాన్లు ఉదయం 9 గంటలలోపు కొనాలి, మందు మాత్రం సాయంత్రం దాకా అమ్ముతారని ఆక్రోశంతో అంటుంటే షాప్ ఓనర్ కొద్దిగా ఆగండి ఇస్తాను అని మెల్లగా చెప్పాడు. ముసలాయన గొణగడం ఆపలేదు. సిటీ మొత్తం మీద సత్యనారాయణ పురంలో ఓ మూలకి ఉన్న ఆ ఒక్క షాప్ అదృష్టవశాత్తూ తెరిచి కనిపించింది. చిన్న చిన్న మరమ్మతులకు కూడా అవకాశం లేకుండా పోయింది.

చిన్న సమస్యకూ….

బెడ్ లైట్లు పోయినా, మిక్సీలు పాడైనా, కుళాయిలు విరిగినా, టీవీలు కాలం చేసినా ఒకరి ముఖాలు ఒకరు చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వాలు కరుణించే వరకు ఇదే పరిస్థితి. మరి మద్యంపై మాత్రం ఎందుకు మమకారం వచ్చిందో తెలియని అమాయకత్వం కాదు. అది పాలకుల చోదక శక్తి. తాగుబోతు, మందుబాబు అని ఎన్ని విమర్శలు చేసినా మందు చేసే మేలు మరెవ్వరూ ప్రభుత్వాలకు చేయరు. ఈ కష్ట కాలంలో పాలకులు తమ శక్తి మేరకు జనానికి మేలు చేయడానికే ప్రయత్నిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అది వాళ్ళ బాధ్యత కూడా.

ఢిల్లీలో వైద్యం కోసం …

ఢిల్లీలో కొందరు మిత్రులు వైద్యం కోసం లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. వైద్య పరీక్షల కోసం ఒక్కొక్కరు 4500 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ లెక్కలో ఢిల్లీ కంటే ఆంధ్రాలో పరిస్థితి మెరుగ్గా ఉంది. పొరుగు రాష్ట్రంలో కేసుల లెక్క తగ్గు ముఖం పట్టడానికి పరీక్షలు ఆపేసినట్టే ఆంధ్రాలో కూడా కొన్ని జిల్లాల్లో అధికారులు ఆ రూట్ లో వెళుతున్నారు. రాపిడ్ టెస్ట్ కిట్లు లేవనో, కరోనా లక్షణాలు కనిపిస్తేనే పరీక్షలు చేస్తామని, వాలంటీర్లు సిఫార్సు చేస్తేనే ఒప్పుకుంటామని చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వం అమలు చేసే విధాన పరమైన నిర్ణయాల్లో ప్రజాభీష్టానికి వ్యతిరేకమైన నిర్ణయాల వెనుక అధికారుల ప్రమేయమే ఎక్కువ ఉంటుంది.

భజన చేసి మరీ….

“all is well”… “situation under control” వంటి సానుకూల మాటలే ఇలాంటి అధికారుల నోటి వెంట వస్తాయి. బయట సమాజంలో ఏమి జరుగుతుందో, సగటు మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయనే అంచనాలు వీళ్ళకి ఉండవు. ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న చాలామంది గతంలో ముఖ్యమంత్రి కొంప ముంచిన వాళ్లే. అనుభవం, భజన అనే కారణాలతో వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతుంటుంది. చంద్రబాబు భ్రష్టు పట్టడానికి కారణమైన ఓ అధికారి తన మీద పడిన ముద్ర పోగొట్టుకోడానికి ఎన్నికల ఫలితాలు రాకముందే కొత్త ప్రభుత్వానికి సాగిల పడిపోయారు. నిజాయితీ ముసుగు వేసుకున్న సదరు అధికారి కొత్త ప్రభుత్వం కొలువు దీరగానే తన పేషీలో ఆ రెండు పత్రికలు కొనడం మానేయలని ఆదేశించారు. ఆ తర్వాత ఆ విషయం సిఎంవో కి తెలపాలని తన సిబ్బందికి ఆదేశించారు.

సలహాలు ఇచ్చింది వాళ్లే…?

ముఖ్యమంత్రికి కళ్ళు, చెవుల్లా పని చేయాల్సిన అధికారులు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు గోడ మీద వాటం ప్రదర్శించారు. తర్వాత కూడా స్వామి భక్తి చూపించారు. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు తాము ఎక్కడ ఉండాలి అనేది చాలా మందికి స్పష్టత ఉంటుంది. అలాంటి వారికి అధికార కేంద్రాల్లో చోటు దక్కుతుంది. మిగిలిన వారు అప్రాధాన్య పోస్టులకు పరిమితం అవుతారు. ఇందులో కూడా మళ్లీ కులం బలంగా పని చేస్తుంటుంది. దానికి ఏ పార్టీ మినహాయింపు కాదు. పాలకులకు సలహాలు ఇవ్వలేని వారు నిస్సహాయంగా మిగిలిపోతుంటారు. మద్యం విక్రయాలను అనుమతించే విషయంలో కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు. పర్యవసానాలు ఊహించలేని సలహాలు ఇందుకు కారణం అయ్యుండొచ్చు కాకపోవచ్చు.

Tags:    

Similar News