వ్యూహానికి పదును… తరలి వచ్చే అవకాశం ఉందా?
వైసీపీ తెలివిగా వేసిన ఎత్తుగడకు టాలీవుడ్ సినీ పెద్దలు పడతారా? అన్నది ఇపుడు చర్చగా ఉంది. గత రెండు నెలలుగా సినిమా షూటింగులు ఆపేసుకుని ఇళ్లకే పరిమితమైన [more]
వైసీపీ తెలివిగా వేసిన ఎత్తుగడకు టాలీవుడ్ సినీ పెద్దలు పడతారా? అన్నది ఇపుడు చర్చగా ఉంది. గత రెండు నెలలుగా సినిమా షూటింగులు ఆపేసుకుని ఇళ్లకే పరిమితమైన [more]
వైసీపీ తెలివిగా వేసిన ఎత్తుగడకు టాలీవుడ్ సినీ పెద్దలు పడతారా? అన్నది ఇపుడు చర్చగా ఉంది. గత రెండు నెలలుగా సినిమా షూటింగులు ఆపేసుకుని ఇళ్లకే పరిమితమైన రీల్ హీరోలు ఇంట్లో ఉండలేకపోతున్నారు. కనీసం సినిమా షూటింగులకు పర్మిషన్లు ఇస్తే చేసుకుంటామని అంటున్నారు. సామాజిక దూరం పాటిస్తూ మిగిలిన రంగాల మాదిరిగా సినిమా రంగంలో కూడా పరిమిత సంఖ్యలో సిబ్బందిని పెట్టుకుని మెల్లగా గాడిలో పడతామని అంటున్నారు. అయితే తెలంగాణా సర్కార్ మాత్రం ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఈ లోగా వ్యూహాత్మకంగా ఏపీలోని వైసీపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చసింది. ఏపీకి వచ్చి హ్యాపీగా షూటింగులు చేసుకోండి అంటూ ఘనమైన ఆహ్వానం పలికింది.
గడప దాటేనా ..?
చంద్రబాబుకు సినీ మిత్రులు ఎక్కువగా ఉన్నారు. పైగా ఆయన పార్టీ పుట్టుకే ఓ సినీ పెద్ద ఎన్టీఆర్ చేతుల మీదుగా జరిగింది. ఇక టాలీవుడ్ లో తెలుగుదేశం సామాజికవర్గం జనాభా ఎక్కువ మంది ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు సర్కార్ ఏనాడూ ఏపీలో షూటింగులకు ఉచిత సదుపాయం కల్పించింది లేదు. మీకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెబుతూనే పుణ్యకాలం గడిపేసింది తప్ప నిజంగా చిత్తశుద్ధితో చేసింది ఏదీ లేదు. దానికి తోడు కేసీఆర్ సర్కార్ సినిమా పరిశ్రమను తరలిపోనీయకుండా వేసిన ఎత్తులు కూడా టాలీవుడ్ ని తెలంగాణా గడప దాటించలేకపోయాయి.
ఈ వైపు చూపు లేదు…
ఇక ఏపీలో కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి టాలీవుడ్ తమ సొంత రాష్ట్రానికి వస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉంది. సినిమా రంగాన్ని ఈ వైపుగా రప్పించే విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రధ్ధ తీసుకుంటున్నారు. టాలీవుడ్ సినీ పెద్ద చిరంజీవి తన ఇంటికి వస్తే ఎదురేగి స్వాగతం పలికిన జగన్ సినీ పరిశ్రమ తరలివస్తే ప్రభుత్వం పరంగా చేయాల్సినవన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ దిశగా తగిన కార్యచరణని సిధ్ధం చేయాలని కూడా కోరారు. అయితే ఈ లోగా తెలంగాణా సర్కార్ మేలుకుని చిరంజీవితో పాతు ఇతర సినీ పెద్దలతో సంప్రదింపులు జరపడంతో ఏపీ వైపు టాలీవుడ్ చూపు పడలేదు.
మేలు చేసేదేనా…?
ఇపుడు మరోమారు జగన్ తన వ్యూహానికి పదును పెట్టారు. తెలంగాణా షూటింగులకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేయడంతో దాన్ని అందిపుచ్చుకోవాలని జగన్ వేగంగా పావులు కదిపారు. టాలీవుడ్ కి రెడ్ కార్పెట్ పరచారు. ఉచితంగా ఏపీలో ఎక్కడైనా షూటింగులు జరుపుకోవచ్చంటూ పచ్చ జెండా ఊపారు. దాంతో విశాఖ వంటి అందాల ప్రాంతాలకు సినీ కళ వస్తుందని వైసీపీ సర్కార్ భావిస్తోంది. సినీ యాక్టివిటీ పెరిగితే ఆ తరువాత దాన్ని మరింతగా పెంచి ఏపీలో సినీ పరిశ్రమ వచ్చేలా చేసుకోవచ్చునని జగన్ భావిస్తున్నారు.
ఇమేజ్ పెరిగితే..?
విశాఖతో పాటు, భీమిలీ, ఏజెన్సీ ప్రాంతమైన అరకు, పాడేరు వంటివి సినిమా షూటింగులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. గతంలో ఇక్కడ షూటింగులు జరిగాయి కూడా. సినిమా షూటింగులు పెద్ద ఎత్తున జరిగితే విశాఖ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుందని, తద్వారా విసాఖ రాజధానిగా మార్చేందుకు మరింత అవకాశం ఉంటుందని వైసీపీ సర్కార్ ఆలోచన చేస్తోంది. మరి టాలీవుడ్ స్పందన ఏంటన్నది చూడాలి. ఏది ఏమైనా ఉచితంగా ఏపీలో షూటింగులు అంటూ జగన్ ఇచ్చిన వరం మాత్రం టాలీవుడ్ మీద నెమ్మదిగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.