అమరావతి… ఎనీ డౌట్స్

ఏపీ రాజధాని అమరావతి. అది రుజువై, నిజమై కనిపిస్తోంది. మరికొన్నాళ్ళలో సాకారమై అభివృధ్ధికి శ్రీకారం చుట్టనుంది. అమరావతి అంటూ టీడీపీ ఇక గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు, [more]

Update: 2019-11-27 02:00 GMT

ఏపీ రాజధాని అమరావతి. అది రుజువై, నిజమై కనిపిస్తోంది. మరికొన్నాళ్ళలో సాకారమై అభివృధ్ధికి శ్రీకారం చుట్టనుంది. అమరావతి అంటూ టీడీపీ ఇక గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు, రాజు మారగానే రాజధాని మార్చేస్తారా అంటూ ఏ సేనానీ కన్నెర్రచేయనవసరంలేదు. అమరావతిలో రాజధాని అన్నది ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. అందువల్ల దానికి కొనసాగించాలని జగన్ సర్కార్ నిర్ణయించడం శుభపరిణామం. అసలు ఈ మాట కూడా అవసరం లేదు, ఎందుకంటే జగన్ ఎపుడూ అమరావతి రాజధానిగా ఉండదు అని ఎక్కడా చెప్పలేదు. ఇక అమరావతి ఎటూ రాజధానే కానీ చంద్రబాబు దృష్టికోణంలోలా ఉండదు అది. ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు పాలనా రాజధానిగా మాత్రమే ఉంటుంది. భవిషత్తులో అది ఎంత ఎత్త్తుకు అభివృధ్ధి చెందగలదో అంతమేర ప్రగతి వికసించేలా జగన్ విత్తనాలు నాటడానికే పరిమితమవుతున్నారు. అంటే ఆయన ఉల్టా సీదా వ్యవహారంలోలా విత్తుకు బదులు చెట్టునే ఏకంగా తెచ్చి నాటే కృత్రిమ పధ్ధతులను ఆసలు అనుసరించనని తన చేతల ద్వారా స్పష్టంగా చెప్పేస్తున్నారు.

భ్రమలు తీరిన చోట…..

ఇక అమరావతి రాజధాని అంటే ఆకాశ హర్మాలు, నిలువెత్తు భవనాలు, ఎటు చూసినా సిటీలు, భూలోకంలోనే స్వర్గం అన్నట్లుగా చంద్రబాబు తన పాలనలో భ్రమలు కల్పించారు. ఎంతటి అభివ్రుధ్ధి అయినా ఒక్క ఇటుకతోనే మొదలవుతుంది. ఆ విధంగా చూసుకున్నపుడు బాబు పాలనలో నేల విడిచి సాము చేయాలన్న ప్రయత్నం జరిగిందని అంతా అంగీకరిస్తారు. ఊహలను ముంగిట‌ ఉంచి వాస్తవాలను దాచే ప్రయత్నం చేయడం వల్లనే బాబు హయాంలో అమరావతి రాజధానిలో ఒక్క భవనం కూడా శాశ్వతంగా నిర్మాణం కాలేకపోయింది. ఇది నిష్టుర సత్యం. ఒక వైపు కేంద్రం సాయం చేయదు, మరో వైపు విశాఖపట్నం తప్ప పెద్ద నగరం ఒక్కటీ కూడా ఏపీకి లేదు. రెవిన్యూ బాగా తగ్గిపోయి నానా ఇబ్బందులు పడుతున్న వేళ సింగపూర్, చైనాను మించిన రాజధాని ఎవరికీ అవసరం లేదు. ఆంధ్రుల ప్రతిష్ట నిలబెట్టే రాజధాని మాత్రం కావాలి. జగన్ ఆ విషయంలో కచ్చితమైన ఆలోచనలతో ఉన్నారని ఆయన ఆరు నెలల పాలన తెలియచేస్తోంది.

వికేంద్రీకరణ దిశగా….

ఇక అమరావతిలో ఇపుడు ఉన్న నిర్మాణాలను కచ్చితంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం వెనక అమరావతిని ముందుకు తీసుకుపోవాలన్న ధృఢసంకల్పం ఉంది. అదే సమయంలో మొత్తానికి మొత్తంగా 33 వేల ఎకరాల్లో ఇప్పటి నుంచే నిర్మాణాల పేరిట లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేయాలన్న ఆశ కానీ, ధ్యాస‌ కానీ లేవని జగన్ స్పష్టం చేశారు. ఇక రాజధాని విషయంలో జగన్ ఆలోచనలు చూస్తే మంగళగిరిలో కొత్త భవనాలు నిర్మించి అక్కడే సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మంగళగిరిలో అట….

ఎందుకంటే అక్కడ బలహీనమైన నేల కాదు, భవన నిర్మాణానికి అనుకూలమైనది కాబట్టి తక్కువ ఖర్చుతో నిర్మాణాలు సాగుతాయి. ఇక ఏపీలో మిగిలిన ప్రాంతాల్లో వాటి పరిస్థితులు చూసి అభివ్రుధ్ధిని చేయాలని, మొత్తం అంతా కుప్పపోసినట్లుగా ఒక్క చోటనే అభివ్రుధ్ధి ఉండరాదని జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానం ఏపీలోని 13 జిల్లాల ప్రజలు ఆహ్వానించేదే. అదే సమయంలో అమరావతి నిర్మాణాలకు ఏటా అయిదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో రాజధాని నిర్మాణాలను చేపట్టాలన్నది జగన్ ఆలోచన‌గా ఉంది. మొత్తానికి అమరావతి రాజధాని కాదు, తరలిపోతోంది ఎవరైనా అనాలనుకున్నా జగన్ తన చేతల ద్వారా చెప్పాల్సింది చెప్పేశారు. ఎనీ డౌట్స్ అని కూడా వైసీపీ నేతలు అంటున్నారు.

Tags:    

Similar News