ముందుకెలా…?
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్న పంథాలో పనిచేసుకుంటూ పోతున్నారు. పరిపాలనపరమైన లౌక్యాన్ని రాజకీయానికి జోడించకపోవడంతో ఇంటా బయటా ఇబ్బందులు ఎదురుచూస్తున్నాయి. రాజకీయ వైకుంఠపాళిలో ఏ [more]
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్న పంథాలో పనిచేసుకుంటూ పోతున్నారు. పరిపాలనపరమైన లౌక్యాన్ని రాజకీయానికి జోడించకపోవడంతో ఇంటా బయటా ఇబ్బందులు ఎదురుచూస్తున్నాయి. రాజకీయ వైకుంఠపాళిలో ఏ [more]
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్న పంథాలో పనిచేసుకుంటూ పోతున్నారు. పరిపాలనపరమైన లౌక్యాన్ని రాజకీయానికి జోడించకపోవడంతో ఇంటా బయటా ఇబ్బందులు ఎదురుచూస్తున్నాయి. రాజకీయ వైకుంఠపాళిలో ఏ అడుగు తడబడినా కాటేసేందుకు పాములు సిద్ధంగానే ఉంటాయి. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పదిమందితో మాట్లాడి పర్యవసనాలను బేరీజు వేసుకున్న తర్వాతనే పాలకులు అడుగు ముందుకు వేయాలి. పార్టీగా వైసీపీ ఆశించే విషయాలు వేరు. సర్కారులోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం అంత సులభం కాదు. ఆ నిర్ణయాల విషయంలో ముందు వెనుకలు యోచించకపోతే అనేక ఆటంకాలు, అవాంతరాలు, ప్రతి బంధకాలు ఎదురవుతుంటాయి. ఏడేళ్ల పోరాటం, ఎదురీత తర్వాత అధికారంలోకి వచ్చింది వైసీపీ. పరిపాలనలో వ్యూహాత్మక పంథాను అనుసరించలేకపోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఫలితంగా అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని టీడీపీ లకు విమర్శనాస్త్రాలను సమకూర్చిపెడుతోంది. ఆరోపణకు, ఆచరణకు మధ్య అంతరాన్ని అంచనా వేయాలి. అప్పుడే పరిపాలన జోరందుకుంటుంది. లేకపోతే స్తబ్ధంగా, తిరోగమన దిశలో సర్కారు నడుస్తోందనే ప్రతికూల ప్రచారం ప్రబలమవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత వాతావరణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిజంగా కత్తిమీద సాము చేస్తున్నట్లుగానే చెప్పుకోవాలి.
కేంద్రానికో సాకు…
తెలుగుదేశం ప్రభుత్వహయాం నుంచి పోలవరం నిర్మాణం సాగుతున్న తీరుపై వైసీపీకి తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. అంచనాలను పెంచి ఆనాటి ప్రభుత్వ పెద్దలు కమీషన్లను భారీగా దండుకున్నారనేది వైసీపీ అభియోగం. ఎన్నికల్లో సైతం ఇదొక అంశంగా చేసింది వైసీపీ. పునరావాస గ్రామాల్లో నష్టపరిహారం విషయంలోనూ జగన్ స్పష్టమైన హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన వాతావరణం, సర్కారు నుంచి క్లియరెన్సు లేకపోవడంతో కాంట్రాక్టు సంస్థలు తమంతతాముగానే పనుల వేగాన్ని తగ్గించివేశాయి. రీటెండరింగ్ చేయడానికి వీలుగా పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్రం ఏమంత సానుకూలంగా లేదని ఢిల్లీ సమాచారం. పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుందో చెప్పలేమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ఇది కేంద్రం నుంచి అందిన హెచ్చరిక. ప్రతికూల సంకేతం. పనులు ఆపేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది. ఆలస్యం అవుతుంది. నిర్మాణానికి ఆటంకం ఏర్పడుతుందని లోక్ సభలోనే చెప్పేశారు మంత్రి. నిజానికి పోలవరం జాతీయ ప్రాజెక్టు . కేంద్ర సంస్థల ఆధ్వర్యంలోనే పనులు జరగాలి. చంద్రబాబు నాయుడు పోలవరం క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతో నిర్మాణ బాధ్యతను రాష్ట్రం చూసుకొనేలా కేంద్రాన్ని ఒప్పించగలిగారు. పర్సంటేజీల కోసమే అలా చేశారనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. కాదు పనులను వేగంగా చేయించడానికి తాము తీసుకున్నామని చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఏదేమైనా ప్రాజెక్టు నిధులను మాత్రం కేంద్రమే సమకూర్చాలి. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్రం ఖాతాలో ఉంది. స్వయంగా రాష్ట్రమే అవినీతి జరిగిందని పరోక్షంగా అంగీకరిస్తూ పనులు నిలిపివేయడంతో ప్రాజెక్టు ఫైలును కేంద్రం అటకెక్కించినా అడిగేవారుండరు. జాప్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని సాకును జగన్మోహన్ రెడ్డి మీదకు తోసివేయడం చాలా సులభం. బీజేపీకి ఈ అంశం కచ్చితంగా పొలిటికల్ మైలేజీని ఇస్తుంది. అటువంటి అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ వదులుకోదు. ఆ నిందను రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. పైపెచ్చు కేంద్రమూ నిధుల కొరతను ఎదుర్కొంటోంది.
విపక్షాలకు అస్త్రం…
పోలవరం విషయంలో కనబరిచిన దూకుడు విపక్షాలకు రాజకీయాస్త్రంగా ఉపకరించే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం తో ముందుగా సంప్రతించి చోటు చేసుకున్న పరిణామాలను, తాము తీసుకుంటున్న చర్యలను వివరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పునరావాసం సహా మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని భరించాల్సింది కేంద్రప్రభుత్వమే. ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినా, నిధులు విడుదల చేయకుండా జాప్యం చేసినా నష్టపోయేది రాష్ట్రమే. పోలవం ప్రాజెక్టును నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో ఇతర రాష్ట్రాల తరఫున కేసు నడుస్తోంది. న్యాయస్థానం తీర్పు రాకముందే వేగంగా పూర్తి చేసుకుంటే మంచిదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ న్యాయస్థానం ప్రతికూలంగా స్పందించినా పూర్తయిన ప్రాజెక్టు విషయంలో నష్ట పరిహారాలుంటాయే తప్ప నిలుపుదల ఉండదు. అందుకే పోలవరాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ దశలో సొంతంగా పెండింగు పెట్టుకోవడం ప్రాజెక్టు పూర్తిపై ప్రమాదఘంటికలు మోగిస్తోంది.. విచారణలో భాగంగా ఏమాత్రం నెగటివ్ గా సుప్రీం కోర్టు స్పందించినా ఫైలు అటకెక్కేసినట్లేననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొందరు. అవినీతిని వెలికి తీసి నిర్మాణ వ్యయాన్ని తగ్గించి ప్రాజెక్టును పారదర్శకంగా పూర్తి చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి ఉద్దేశం వేలెత్తిచూపలేనిదే. కానీ ఆశయానికి, ఆచరణకు, వాస్తవ పరిస్థితులకు మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాల్లో ఒకటి మాత్రమే. అందువల్ల ఏపీపై ప్రత్యేక ప్రేమ ఉండదు. మనలో ఉండే రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అంతా ఒకటై కలిసి నడిస్తేనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈవిషయంలో పాలకపార్టీపైనే ఎక్కువ బాధ్యత ఉంటుంది.
బహు పరాక్…
గతంలో ప్రతిపక్షాన్ని కలుపుకుని వెళ్లకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీవ్ర వివక్ష పాటించింది. ప్రతిపక్షం అభిప్రాయానికి ఏమాత్రం మన్నన దక్కలేదు. సంప్రతించడానికి సైతం ఇష్టపడలేదు. అందువల్లనే ఇప్పుడు రాజధాని, పోలవరం వంటి విషయాల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు భిన్నమైన రాజకీయ పార్టీలు. సైద్ధాంతికంగాను, విధానాల పరంగానూ విభేదించుకోవడం సహజం. ప్రత్యేకహోదా, కేంద్రం నిధులు, విభజన చట్టం హామీలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ఒకే బాటను అనుసరించడం నవ్యాంధ్రకు చాలా అవసరం. లేకపోతే రాష్ట్రంలో ఉండే రాజకీయ విభేదాలు కమలం పార్టీకి వెసులుబాటు కల్పిస్తాయి. మీ దగ్గరే ఏకాభిప్రాయం లేనప్పడు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారనే వాదన కేంద్రం వద్ద ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో ఏమాత్రం పొరపాటు కనిపించినా ప్రతిపక్షాలు దానిని పెద్దది చేసి చూపించేందుకు కాచుకుని ఉంటాయి. అందుకే ప్రభుత్వం పై ఉండే బాధ్యత ఎక్కువ. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమూ ఎక్కువే. నిర్ణయాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించకపోతే సీన్ రివర్స్ అవుతుంది. మంచి అనుకున్నది చెడుగా పరిణమిస్తుంది. దాని ప్రభావం, పర్యవసానం అధికారపార్టీపైనే ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం చాన్సు దొరికినా వదలకూడదని చూస్తున్న కేంద్ర పాలక పక్షం ఒకవైపు, రగిలిపోతున్న రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దూకుడు కంటే దూరదృష్టి ముఖ్యం. రాష్ట్రప్రగతే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపించాలి. అనిపించాలి. నిధుల కొరత, ఇంకా రూపుదిద్దుకోని రాజధాని. ప్రభుత్వ యంత్రాంగం నుంచి అంతంతమాత్రం సహకారం…జగన్ కు కత్తిమీద సామే…తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవాలంటే ప్రతికూల నిర్ణయాల కంటే నిర్మాణాత్మకంగా ముందడుగు వేయడమే తక్షణ కర్తవ్యం.
-ఎడిటోరియల్ డెస్క్