ఆయనను చూస్తున్నట్లే ఉంది.. ఆయనను మరవలేదు

నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేస్తూ దివంగతుడైన డా. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఆయన ఉన్నా లేకున్నా జన హృదయ నేతగా ఇప్పటికి అందరిలో [more]

Update: 2020-07-08 05:00 GMT

నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేస్తూ దివంగతుడైన డా. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఆయన ఉన్నా లేకున్నా జన హృదయ నేతగా ఇప్పటికి అందరిలో కొలువై ఎంతో ఎత్తుకు ఎదిగి అకాల మరణం చెందారు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పని చేసిన తరువాత ఆయన కుమారుడు కూడా ముఖ్యమంత్రి కావడం అరుదుగా లభించే అదృష్టం. తండ్రి వేసిన రాజకీయ పునాదిపై కుమారుడు జగన్ ఒక ప్రాంతీయ పార్టీనే నిర్మించారు అంటే వైఎస్ చరిష్మా ఎలాంటిదో ఎవరికి చెప్పక్కర్లేదు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.

తండ్రిపాలనే అజండా గా ….

తన తండ్రి పాలన ను ఉదహరిస్తూ వైసిపి అధినేత సమరశంఖం పూరించారు. రాజన్న రాజ్యం తెస్తానంటూ గత ఎన్నికల్లో ఆయన కుమారుడు జగన్ ప్రధాన స్లోగన్ ఇచ్చారంటే వైఎస్ పాలన ఎలా సాగిందో ఇప్పటికి ఏ ఒక్కరు మరువలేరు. ఆ స్లోగన్ వృధా కాలేదు. జనం వైఎస్ ను మరువలేదు. తన పాలనలో ప్రతి ఒక్కరికి ఎదో రకమైన మేలు ను చేయాలన్న తపన తో పాటు దాన్ని కార్యాచరణలో కూడా చూపించిన దార్శనికుడు డా. వైఎస్సాఆర్ తనయుడిని దేశ చరిత్రలోనే అరుదైన రీతిలో ఆదరించి పట్టం కట్టారు ప్రజలు. 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలను వైసిపి గెలుచుకుంది అంటే అది వైఎస్ ఆర్ పై నమ్మకం మాత్రమే.

ఇద్దరు చేసిన పాదయాత్ర …

స్వర్గీయ వైఎస్ చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేపట్టి అయిపొయింది ఇక అనుకున్న కాంగ్రెస్ కి రెండు ఎన్నికల్లో జీవం పోశారు. ఇదే తీరులో జగన్ 2014 ఎన్నికల్లో దెబ్బ తిని పైకి లేచి నిత్యం ప్రజల్లో మమేకం అవుతూ తండ్రి చూపిన బాటలో పాదయాత్ర చేపట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అఖండ మెజారిటీతో అధిరోహించారు. వైఎస్ కార్యక్రమాల్లో చాలా వరకు జగన్ అమలు చేస్తున్నా కొన్ని అంశాల్లో మాత్రం దుందుడుకు గా ముందుకు వెళ్లడం కోర్టు ల మొట్టికాయలు తగిలినా తన వైఖరి మార్చుకోవడం లేదు. దీనితో బాటు కీలక నిర్ణయాలపై నిపుణులతో చర్చించకుండా జగన్ ప్రజల్లోకి తీసుకురావడంతో లేని పోని ఆయుధాలను విపక్షానికి అందించడం తప్ప మరొకటిగా ఉండటం లేదు.

ఆరోగ్యం పై శ్రద్ధ …

వైఎస్సాఆర్ బతికున్నంతకాలం పేదలకు వైద్యాన్ని వీలైనంతగా ప్రభుత్వ పరం చేసేసారు. ఆరోగ్యశ్రీ తో కార్పొరేట్ ఆసుపత్రులకు నిరుపేదలు క్యూ కట్టేలా తీసుకువచ్చిన పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అదే విధంగా ఇప్పుడు జగన్ సైతం ఆరోగ్య రంగంపై తండ్రికి మించి మరీ సేవల్లో దూసుకుపోతున్నారు. అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలకు పచ్చజండా ఊపడం, పేద విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్, హాస్టల్స్ పై ప్రత్యేక దృష్టి, 1088 అంబులెన్స్ లను రాష్ట్ర వాసులకు అంకితం చేసి కొత్త చరిత్ర లిఖించారు. ఇలా విద్యా, వైద్య రంగాలపై స్వర్గీయ వైఎస్ఆర్ చేయాలిసినంత చేసి మరింత చేసే క్రమంలో అర్ధాంతరంగా నిష్క్రమించారు. అయితే ఆయన మిగిల్చిన పనిని కుమారుడు జగన్ పూర్తి చేస్తూ వస్తున్నారు. పార్టీ పేరులోనే నాన్న వైఎస్ ను తలుచుకునేలా పెట్టడమే కాదు, ఈరోజుకు తన పార్టీ మీడియా ఛానెల్, పత్రిక లో వైఎస్ ముఖ చిత్రం ఉంచడం జగన్ కి తండ్రి పట్ల ఉన్న ప్రేమ భక్తికి నిదర్శనం.

Tags:    

Similar News