వైఎస్సార్ దేవుడు….జగనే…?

జగన్ కి బలం బలహీనతా రెండూ వైఎస్సారే. ఇక ఆయన పార్టీ పేరు కూడా వైఎస్సారే. జగన్ సొంత ఇమేజ్ ఎంత ఉన్నా నాయకులు ఇప్పటికీ ఆయన్ని [more]

Update: 2021-02-11 06:30 GMT

జగన్ కి బలం బలహీనతా రెండూ వైఎస్సారే. ఇక ఆయన పార్టీ పేరు కూడా వైఎస్సారే. జగన్ సొంత ఇమేజ్ ఎంత ఉన్నా నాయకులు ఇప్పటికీ ఆయన్ని అనుసరిస్తున్నారు అంటే దానికి కారణం వారికి వైఎస్సార్ తో ఉన్న అనుబంధం, అభిమానం వగైరా కారణం. ఇక పాత తరం జనాలు కూడా వైఎస్సార్ ని చూసే వైసీపీని ఆదరిస్తారు. ఇలా వైఎస్సార్ తో జగన్ అనుబంధం తండ్రీ కొడుకులుగా కంటే సీనియర్ జూనియర్ నాయకులుగానే ఎక్కువగా కూడా చూడాలి. ఏపీలో జగన్ ని ఏ విధంగానూ ఎదిరించలేమనుకున్న వారు తరచూ ఆయన తండ్రి ప్రస్తావన తెస్తూంటారు. ఆయన్ని పొగిడినట్లే పొగిడి జగన్ ని ఎక్కడో కెలుకుతూంటారు.

బాబు నుంచి అలా….

వైఎస్సార్ బతికున్నంతవరకూ ఆయన గురించి ఒక్క మంచి మాట ఆన్ రికార్డుగా అనని నాయకుడు చంద్రబాబు అంటారు. అటువంటి చంద్రబాబుకు జగన్ కంటే వైఎస్సార్ గొప్ప అనిపిస్తున్నారు. ఆయన నిండు అసెంబ్లీలోనే అనేక సార్లు వైఎస్సార్ మంచి స్నేహితుడు అని ఆయన తన మాటను వినేవారని, ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చేవారని చాలా చెప్పుకున్నారు. వైఎస్సార్ తో పోల్చుతూ జగన్ ఏమీ కాడని చెప్పడమే కాకుండా ఆయన్ని ఎంత వీలు అయితే అంత చెడ్డ చేసే ప్రయత్నమే బాబు మాటల వెనక అర్ధం పరమార్ధం. ఇది తరువాత చాలా మంది నాయకులు కూడా అనుసరించి జగన్ ని ఆ కోణం లో కూడా విమర్శలు చేస్తూ వచ్చారు.

హఠాత్తుగా నిమ్మగడ్డ….

నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన 1985 బ్యాచ్ కి చెందిన వారు. కలెక్టర్ గా ఆయన తొలి పోస్టింగ్ శ్రీకాకుళం జిల్లాలో. ఆ తరువాత ఆయన అడ్మినిస్ట్రేటివ్ వింగ్ లోనే ఎక్కువగా పనిచేశారు. ఆయన ఎన్టీయార్, చంద్రబాబు నుంచి నాటి కాంగ్రెస్ సీఎంలందరి తోనూ పనిచేసి 2016లో రిటైర్ అయ్యారు. ఆ తరువాత ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నియమితులయ్యారు. అటువంటి నిమ్మగడ్డ ఇన్నేళ్ళకు సంచలనాత్మకమైన విషయాలనే చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానూ అంటే దానికి కారణం వైఎస్సార్ అంటూ గతాన్ని నెమరేస్తుకున్నారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్ కి రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని, ఎదుటి వారి భావ ప్రకటనా స్వేచ్చకు అవకాశం ఇస్తారని కూడా పొగిడారు. దాని అర్ధం జగన్ కి అవి లేవని చెప్పకనే చెప్పడం అన్న మాట. ఇదే ఇపుడు ప్రచారం కూడా అవుతోంది.

అయ్యే పనేనా …?

ఎన్టీయార్ ని కుర్చీ నుంచి దింపేసి మరీ ఆయన ముఖ్యమంత్రి పదవిని, పార్టీని కూడా చేజిక్కుంచున్న చంద్రబాబు ఆయన విగ్రహానికి మొక్కుతారు. అయినా సరే ఎన్టీయార్ ఫ్యాన్స్ ఓట్లు టీడీపీకే పడతాయి. బాబు ఎన్టీయార్ కి కొడుకు కాదు, అల్లుడు మాత్రమే. మరి అల్లుడిగా ఉంటూ మామను వ్యతిరేకించిన చంద్రబాబుకే ఎన్టీయార్ పొలిటికల్ లెగసీ హక్కుభుక్తమైనపుడు సొంత తండ్రి వైఎస్సార్ నుంచి జగన్ కి వేరు చేసి రాజకీయంగా దెబ్బకొట్టాలనుకున్నా అది సాధ్యపడుతుందా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇక జగన్ కి వైఎస్సార్ కి ఎక్కడా విభేదాలు ఉన్నట్లు కూడా లేదు. ఆ తండ్రి కొడుకుగా నిత్యం వైఎస్సార్ విగ్రహానికి మొక్కి ఆయన పేరిట పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ ని చెడ్డ అని సాదర జనం ఏ విధంగానైనా అనుకోగలరా. అది సాధ్యమేనా. అయితే కనీసం పార్టీలోని నాయకులు, వైఎస్సార్ వీర భక్తులకైనా ఈ తేడాను చూపించి జగన్ నుంచి వారిని వేరు చేయడానికి ఈ రకమైన ఎత్తులు బాబు లాంటి వారు చేస్తారు. కానీ నిమ్మగడ్డ లాంటి అధికారులకు ఇది అవసరం లేకపోయినా తండ్రిని ఎంత పొగిడితే కొడుకుకు అంత చెడ్డ అని జనానికి చూపించవచ్చు అన్న లాజిక్ తోనే ఈ తరహా విమర్శలు చేస్తున్నారు అనుకోవాలి మరి.

Tags:    

Similar News