వైఎస్సార్ కానివాడు అయ్యారా… ?

వైఎస్సార్ పేరు లేనిదే ఆ కుటుంబ సభ్యులకు రాజకీయమే లేదు. ఏపీలో జగన్ ఆయన పేరు మీదనే పార్టీ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణాలో షర్మిల కూడా [more]

Update: 2021-07-05 05:00 GMT

వైఎస్సార్ పేరు లేనిదే ఆ కుటుంబ సభ్యులకు రాజకీయమే లేదు. ఏపీలో జగన్ ఆయన పేరు మీదనే పార్టీ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణాలో షర్మిల కూడా తండ్రి పేరునే వాడుకుంటున్నారు. అలాంటిది వైఎస్సార్ ని నానా మాటలు అంటున్నారు తెలంగాణాకు చెందిన మంత్రులు. ఆయన చనిపోయి పుష్కర కాలం అయింది. హిందూ సంప్రదాయంలో చనిపోయిన వారిని ఎవరూ విమర్శించరు. అలాంటిది దారుణమైన కామెంట్స్ నే అక్కడి మంత్రులు చేశారు. దానికి ఏపీ వైసీపీ నుంచి ఒక్క కౌంటర్ అంటూ లేకుండా పోయింది.

సరైన రిటార్ట్ …

సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళి పీసీసీ చీఫ్ గా ఎదిగొచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం ఒకే దెబ్బకు అందరికీ గట్టి రిటార్ట్ ఇచ్చేశారు. వైఎస్సార్ అని ఏమైనా అంటే టీయారెస్ మంత్రుల చెంపలు చెళ్ళుమనిపిస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ మా వాడు, మా కాంగ్రెస్ కి చెందిన వాడు, ఆయన కాంగ్రెస్ ఆస్తి, ఏమన్నా అన్నారంటే సహించేది లేదు అంటూ గర్జించారు. వైఎస్సార్ మీద కాంగ్రెస్ కి అభిమానం ఉంది. ఆయన్ని ఎన్ని అన్నా మౌనంగా ఉండడానికి మేము ఆయన కుటుంబ సభ్యులం కాదు అంటూ జగన్ షర్మిల, విజయమ్మలకు ఒకేసారి సెటైర్లు వేశారు. వారు వైఎస్సార్ ని వదిలేసుకున్నారేమో కానీ మేము అలా కాదు అంటూ బాగానే మాట్లాడారు.

అదే వ్యూహం …

ఇలా రేవంత్ రెడ్డి వైఎస్సార్ ని స్మరించుకోవడానికి కారణం ఉంది. ఆయన అభిమాన జనం తెలంగాణా అంతటా ఉన్నారు. అదే సమయంలో ఏపీలోనూ ఉన్నారు. వైఎస్సార్ ని పార్టీలకు అతీతంగా అభిమానించే నాయకులూ ఉన్నారు. అలాంటి వైఎస్సార్ ని తీవ్ర పదజాలంతో నిందిస్తున్నా కూడా కిమ్మనకపోవడం జగన్, షర్మిల రాజకీయ వ్యూహం అయి ఉంటే కావచ్చు. ఆయనను ప్రేమించే జనాలకు అది అవసరం లేదు. వైఎస్సార్ ని ఉత్త పుణ్యాన అన్నేసి మాటలు అంటూ ఉంటే పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆయన సొంత కొడుకు ఒక్క మాట అయినా అనకపోవడమేంటి అన్న చర్చ అయితే ఉంది. ఇక షర్మిల సైతం తెలంగాణా మంత్రుల మాటలు కరెక్ట్ అన్నట్లుగా జల జగడంపైన స్పందించారు. ఇలాంటి నేపధ్యంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ కి ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతోంది.

ఇబ్బందేనా …?

వైఎస్సార్ జయంతుల వేళ వర్ధంతుల వేళ ఆయన ఫోటోను ముందేసుకుని ప్రార్ధించడం కాదు, ఆయన్ని తిడుతున్న వారి గొంతు కూడా మూయించాలి. అదే వైఎస్సార్ వారసులు అనిపించుకోవడానికి అసలైన అర్హత అన్నది సగటు జనం భావన. తన తండ్రిని నిందించిన వారి మీద జగన్ కి బాధ ఉండవచ్చు. ఆయన సహనంతో దాన్ని భరించవచ్చు. కానీ జనాలు అలా ఉండలేరు కదా. పైగా పోయిన మనిషి మీద ఈ రాజకీయం ఏంటి అని గట్టిగా ఒక్క వైసీపీ మంత్రి కూడా ఖండించలేకపోయారే అన్న ఆవేదన అయితే జనంలో ఉంది. రేవంత్ రెడ్డి వైఎస్సార్ ని ఒక్కసారి ఎత్తడం ద్వారా తానే సిసలైన వారసుడిని అనిపించేసుకున్నారు అంటున్నారు.

రేపటి రోజున….

జగన్ కి వైఎస్సార్ రక్షణ కవచం. ఆయనను అభిమానించేవారే వైసీపీ లోనూ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా నాయకులుగా ఉన్నారు. వారంతా కూడా ఈ కామెంట్స్ మీద మధన పడుతున్నారు. రేవంత్ ఇపుడు ఇచ్చిన ప్రకటన కూడా అలాంటి వారి గుండెల్లో అలజడి రేపడానికే. మాట తప్పను, మడమ తిప్పను అంటూ ఆవేశంగా ప్రకటనలు ఇచ్చే జగన్ తండ్రిని తూలనాడుతూంటే ఏమీ చేయలేకపోయారు అన్న సందేశం పార్టీ జనాలతో పాటు సాధారణ జనాలకు సవ్యంగా చేరితే మాత్రం వైసీపీ పునాదులకే తూట్లు పడినట్లు లెక్క. మరి ఇకనైనా తెలంగాణా మంత్రులకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వైఎస్ ఫ్యామిలీ కానీ ప్రభుత్వం కానీ రెడీగా ఉందా.

Tags:    

Similar News