విజయమ్మ అందుకే ఈ స్టెప్ తీసుకున్నారా?

వైఎస్సార్ ఈ లోకాన్ని వీడి పుష్కర కాలం దాటింది. ఆయన గురించి ఈ తరం వారికి కూడా తెలుసు. ఆయన చరిత్ర కళ్ల ముందు ఉన్నదే. మరి [more]

Update: 2021-08-29 13:30 GMT

వైఎస్సార్ ఈ లోకాన్ని వీడి పుష్కర కాలం దాటింది. ఆయన గురించి ఈ తరం వారికి కూడా తెలుసు. ఆయన చరిత్ర కళ్ల ముందు ఉన్నదే. మరి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది. పైగా ఆయన వారసుడు జగన్ ఏపీలో ముఖ్యమంత్రిగా రాజ్యం చేస్తున్నారు. జగన్ ఎపుడూ తండ్రినే తలచుకుంటారు. ఆయన పేరు మీదనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయి. అలాంటిది వైఎస్సార్ అందరి వాడు, అజాత శతృవు అని కొత్తగా ఎవరికి చెప్పాలి. ఎందుకు చెప్పాలి. అంటే చెప్పాలి. కాలాన్ని బట్టి కూడా చెప్పాలి. ఇపుడు ఆ ప్రయత్నమే ఆయనలో సగంగా జీవించిన సతీమణి వైఎస్ విజయమ్మ చేస్తున్నారు అనుకోవాలి.

చనిపోయినా కూడా…?

వైఎస్సార్ చనిపోయినా ఆయన మీద రాజకీయ విమర్శలు ఎక్కడా ఆగలేదు. తెలంగాణాలో అధికారంలో ఉన్న నాయకులు తమ పొలిటికల్ మైలేజ్ కోసం ఈ మధ్యనే ఏకంగా రాక్షసుడు అనేశారు. అంతే కాదు ఏపీలో జగన్ రాజకీయాల్లో ఉండడంతో వైఎస్సార్ మీదకు రాళ్ళు వేసేవారు ఎక్కువైపోయారు. అయితే ఇది ఫక్తు రాజకీయం అని జగన్ అనుకుంటారు. ఆయన మీద కూడా విమర్శలు వస్తూంటాయి కాబట్టి సర్దుకుపోతారు. కానీ సతీమణిగా విజయమ్మ అలా ఉండలేరు కదా. పైగా తన భర్త సాధారణ పరిస్థితుల్లో పోలేదు. ప్రజల కోసం వారి మేలు కోసం వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. దాంతో ఆమె భర్త గురించి కలత చెందని రోజు అంటూ ఉండదనే చెప్పాలి.

అవసరం లేదా…?

ఇక వైఎస్సార్ సంతానం రాజకీయాల్లో ఉన్నారు. జగన్ ఏపీకి సీఎం అయితే తెలంగాణాలో తన రాజకీయ చోటుని షర్మిల వెతుక్కుంటోంది. జగన్ విషయానికి వస్తే తండ్రిని దాటి ముందుకు వచ్చేశారు. పొలిటికల్ గా జగన్ ఇమేజ్ కూడా బాగా పెరిగింది. ఆయన పేరు మీద వచ్చే ఎన్నికలకు వెళ్ళేటంత స్తోమత సంపాదించుకున్నారు. ఇక షర్మిల ఇంకా తెలంగాణాలో వైఎస్సార్ పేరు వాడుకోవాలి. ఎవరు ఎలా రాజకీయం చేసుకున్నా వైఎస్సార్ కి తద్వారా కొత్త శత్రువులు కూడా పెరుగుతారు. అయితే వైఎస్సార్ భౌతికంగా ఈ లోకాన లేరు. మరి ఆయనకు ఎందుకు ఈ జంజాటాలు. పైగా ఆయన అంటే రాజకీయాలకు అతీతంగా ఇష్టపడేవారు ఉన్నారు. జగన్ అంటే పడని వారికి కూడా వైఎస్సార్ అంటే దేవుడుతో సమానం. అలాంటి వారు అంతా వైఎస్సార్ చనిపోయాక వైఎస్సార్ ఫ్యామిలీకి దూరం అయ్య్యారు. వారే వైఎస్సార్ అసలైన ఫ్యామిలీ అని విజయమ్మ కాస్తా లేట్ గా అయినా గుర్తించారు. అందుకే అందరికీ ఒక్క చోట చేర్చి ఆ మహానుభావుడికి నివాళి ఇస్తున్నారు.

దూరమే అయ్యారుగా…?

జగన్ తండ్రికి వారసుడు, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. ఆయన రాజకీయంగా గెలిచారు. కానీ తండ్రి సన్నిహితులకు మాత్రం దూరం అయ్యారు. దీనికి రాజకీయమే ప్రధాన కారణం. దాని వల్ల వారు ఎప్పటికీ జగన్ కి చేరువ కాలేకపోతున్నారు. కానీ రాజకీయాన్ని పక్కన పెడితే వారంతా గేట్లు దాటుకుని మరీ వస్తారు. వైఎస్సార్ ని గుండెల నిండా తలచుకుంటారు. ఆ పని ఒక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ ఎప్పటికీ చేయలేరు. రాజకీయ అడ్డుగోడలు తొలగించకుంటే వైఎస్సార్ ఎప్పటికీ కొందరివారుగానే ఉండిపోతారు. అందుకే విజయమ్మ ఆయన్ని అందరి వారుగా తలచుకోవాలని తపిస్తున్నారు. పన్నెండేళ్ళుగా వైఎసార్ చుట్టూ ఉన్న అడ్డుగోడలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ద్వారా ఆమె ఆత్మ తృప్తిని సాధిస్తారు. అంతే కాదు వైఎస్సార్ తన సొంతం. కోట్లాది మంది సొంతమని కూడా చెప్పదలచుకున్నారు. నిజమే రాజకీయపు పొరలు తొలగించుకుంటే వైఎస్సార్ అజాత శత్రువే. ఆయన అందరి వాడే.

Tags:    

Similar News